రాజంపేటలో తన్నుకున్న పచ్చతమ్ముళ్లు
రాజంపేట: తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఎంపికపై తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో గురువారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల కమిటీల ఎంపిక చేపట్టారు. ఒంటిమిట్ట మండల కమిటీ ఎంపిక ఏకపక్షంగా జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య వర్గం ఆరోపించింది.
వారి అభ్యంతరాలతో గొడవ ప్రారంభమవడంతో ప్రభుత్వ విప్ మల్లికార్జునరెడ్డి వర్గం ఎదురుదాడికి దిగింది. వాదప్రతివాదాలు ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మల్లికార్జునరెడ్డి..గొడవలకు కారణమయ్యే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించటంతోపాటు బ్రహ్మయ్య వర్గానికి చెందిన కొందరిని సమావేశం బయటకు పంపడంతో పరిస్థితి చక్కబడింది.