మణిపూర్లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి
ఇంఫాల్: మణిపూర్లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.
మయన్మార్ సరిహద్దుకు సమీపంలో భద్రతా బలగాలు మంగళవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా సరిహద్దు పట్టణమైన మోరేకు పోలీసు కమాండోలు వాహనాల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆకస్మికంగా కాల్పులు జరిపారు. నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. గాయపడిన భద్రతా సిబ్బందికి అస్సాం రైఫిల్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.
మణిపూర్లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్లపై ఎగబడ్డ జనం