Manu Jain
-
మరింత ‘స్మార్ట్’గా ఎంఐ తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ(మేకిన్ ఇండియా)కి ప్రాధాన్యతనిస్తూ చైనీస్ దిగ్గజం ఎంఐ తాజాగా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల తయారీకి బీవైడీ, డీబీజీ, రేడియంట్‌లతో చేతులు కలిపింది. దీనిలో భాగంగా ఎంఐ తరఫున బీవైడీ, డీబీజీ స్మార్ట్ ఫోన్లను తయారు చేయనుండగా.. స్మార్ట్ టీవీలను రేడియంట్ రూపొందించనుంది. తద్వారా దేశీయంగా స్మార్ట్ టీవీల తయారీని భారీగా పెంచుకోనుంది. హర్యానా యూనిట్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన డీబీజీ.. ఇకపై తమ బ్రాండ్ తయారీ సామర్థ్యాన్ని 20% పెంచనున్నట్లు షావోమీ ఇండియా ఎండీ మను జైన్ పేర్కొన్నారు. తమిళనాడులో ఏర్పాటైన బీవైడీ యూనిట్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభంకానున్నట్లు మను జైన్ తెలియజేశారు. 5 క్యాంపస్‌లు దేశవ్యాప్తంగా ప్రస్తుతం షావోమీ ఐదు క్యాంపస్‌లను కలిగి ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఫోన్లను అసెంబుల్ ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌లతో జట్టు కట్టింది. స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న భారీ డిమాండ్ నేపథ్యంలో తయారీ సామర్థ్యాన్ని విస్తరించవలసి ఉన్నట్లు జైన్ వెల్లడించారు. ఇంటివద్ద నుంచే ఆఫీస్ వర్క్, చదువులు కొనసాగుతున్న కారణంగా అత్యధిక కంటెంట్ వినియోగమవుతున్నట్లు చెప్పారు. దీంతో డిమాండుకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్న విడిభాగాలు స్థానికంగా తయారు చేసినవి లేదా అసెంబుల్డ్ అయినవేనని పేర్కొన్నారు. ఫోన్ల విలువలో 75 శాతంవరకూ స్థానికంగా సమకూర్చుకున్న విభాగాలతోనే రూపొందుతున్నట్లు వివరించారు. పీసీబీఏ, సబ్–బోర్డులు, కెమెరా మాడ్యూల్స్, బ్యాక్ ప్యానల్స్, వైర్లు, చార్జర్లు దేశీయంగా తయారవుతున్నట్లు వెల్లడించారు. వీటిని సన్నీ ఇండియా, ఎన్వీటీ, శాల్‌కాంప్, ఎల్వై టెక్, సన్వోడా తదితరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అన్ని కార్యకలాపాల ఫలితంగా 30,000 మందికి ఉపాధి కల్పించినట్లు జైన్ తెలియజేశారు. స్మార్ట్ టీవీ విభాగంలోనూ 1,000 మంది పనిచేస్తున్నట్లు తెలియజేశారు. 2020లో జూమ్: కోవిడ్–19 నేపథ్యంలో 2020లో 15 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ నమోదయ్యాయి. కౌంటర్‌పాయింట్ గణాంకాల ప్రకారం అక్టోబర్–డిసెంబర్ కాలంలో వార్షికంగా 19 శాతం వృద్ధిని సాధించగా.. పోకో బ్రాండుతో కలిపి షావోమీ 26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టాప్ ర్యాంకులో నిలవగా.. 21 శాతం వాటాతో శామ్సంగ్, 16 శాతంతో వివో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక రియల్మీ వాటా 13 శాతంకాగా.. ఒప్పో 10 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 2021లో స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్స్ 16–16.5 కోట్ల యూనిట్లకు చేరవచ్చని జైన్ అంచనా వేస్తున్నారు. ఈ బాటలో ఓటీటీ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా స్థానికంగా తయారైన 30 లక్షల స్మార్ట్ టీవీలను విక్రయించినట్లు వెల్లడించారు. -
షావోమియే ‘గాడ్‌ఫాదర్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అతి చౌకైన స్మార్ట్ఫోన్లను విక్రయిస్తూ ప్రసిద్ధి చెందిన ‘షావోమి’ అనే చైనా కంపెనీ గురించి తెలియనివారు నేటి యువతరంలో ఉండకపోవచ్చు. నిజంగా ఈ కంపెనీని స్మార్ట్ఫోన్ల రంగంలో ‘ది గాడ్ ఫాదర్’గా అభివర్ణించవచ్చు. అందుకు ఓ అసలైన కారణం కూడా ఉంది. ప్రముఖ చైనా వ్యాపారవేత్త లీ జున్ స్వతంత్ర భావాలు కలిగిన చిత్రమైన వ్యక్తి. షావోమి కంపెనీ స్థాపించడానికి ముందు ఆయన కోట్లకొద్ది డాలర్లను కుమ్మరించి ‘కింగ్‌సాఫ్ట్’ లాంటి పలు కంపెనీలను స్థాపించారు. జోయో అనే ఈ కామర్స్ సంస్థను స్థాపించి దాన్ని అనతి కాలంలోనే దాన్ని అమెజాన్ చైనాకు అమ్మేశారు. ఆ తర్వాత ‘వైవై కార్పొరేషన్’ పేరిట గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తన వ్యాపారాలన్నింటికీ స్వస్తి చెప్పి హఠాత్తుగా చైనా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. ఒకనాడు హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘ది గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చైనా భాషలో రీమేక్ చేసి తాను స్వయంగా అందులో గాడ్ ఫాదర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత 2010లో జీ జున్ సినిమా ప్రపంచం నుంచి మళ్లీ వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టారు. షావోమి సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగించి ‘ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు సాఫ్ట్వేర్ రంగంలో, ఆపిల్, శ్యామ్‌సంగ్, నోకియా, మైక్రోమాక్స్ కంపెనీలు హార్డ్‌వేర్ రంగంలో రాణిస్తుండగా.. షావోమి రెండు రంగాల్లో రాణించడం విశేషం. ఒకప్పుడు మెకిన్సేలో పనిచేసిన భారతీయుడు మను జైన్ షావోమిలో చేరి భారత్‌లో ఈ ఫోన్ల విక్రయానికి అధిపతిగా నియమితులయ్యారు. ఫ్లిప్‌కార్ట్ సహాయంతో ఆన్లైన్లో షావోమి ఫోన్ల అమ్మకాల్లో పెద్ద విప్లవాన్నే సృష్టించారు. -
షావోమి బాస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో విపరీతమైన పోటీ నెలకింది. యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలకు ధీటుగా చైనా కంపెనీలు షావోమి,వివో, ఒప్పో, రియల్‌మి లాంటి కంపెనీలు కొత్త వ్యూహాలతో మార్కెట్లో పాగావేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బాస్‌లు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. ట్విటర్వే దికగా పరస్పరం బహిరంగంగా ట్వీట్ యుద్ధం మొదలు పెట్టారు. దీంతో నెటిజన్లు పలు జోక్‌లు, ట్విటర్ మెమెలతో పండుగ చేసుకుంటున్నారు. ప్రధానంగా షావోమి ఇండియా ఎండీ మను కుమార్‌జైన్ భారతీయ మార్కెట్లో టాప్ పొజిషన్కోసం తంటాలుపడుతున్నాడు. 2018లో రికార్డు స్థాయి అమ్మకాలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపింది. షావోమి. అయితే 2019 నాటికి కథ వేరేలా ఉంది. చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి బడ్జెట్ ధరల డివైస్లతో షావోమికి వణుకు పుట్టిస్తోంది. సరికొత్త ఫీచర్లు, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకట్టు కుంటోంది. ఈ పరిణామం గుర్రుగా ఉన్న జైన్ రెడ్మి నోట్ ప్రొ 7 స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ క్వాల్కం స్నాప్డ్రాగెన్ రియల్ మి 3 ప్రొ ప్రాసెసర్ కంటే పాతది అని ట్వీట్ చేశాడు. తమ మిలియన్ల విక్రయాలను చూసి ఎవరికో భయం పట్టుకుందంటూ రియర్మి ఇండియా సీఈవో సేథ్ కౌంటర్ ఇచ్చాడు. దీంటో ఈ ట్వీట్లు, విపరీతంగా రీట్వీట్ అవుతుండటం, విపరీతంగా జోక్స్ పేలుతుండటంతో ఇద్దరూ వారి వారి ట్వీట్లను డిలిట్ చేయడం విశేషం. కౌంటర్ పాయింట్ పరిశోధన ప్రకారం 2019 మొదటి త్రైమాసికంలో మార్కెట్ వాటా పడిపోయింది. గత ఏడాది 31శాతంతో పోలిస్తే 2 శాతం క్షీణించి ఏడాది 29 శాతానికి పరిమితమైంది. అయితే రియల్‌మి మాత్రం రెండవ వరుస క్వార్టర్లో టాప్ 5 బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మరోవైపు వివో 2019 ఫస్ట్ కార్టర్లో టాప్‌కి చేరింది. (మను జైన్ వివోను విడిచిపెట్టడం గమనార్హం.) ఇటీవల తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్ చేసిన మనూ జైన్.. వన్‌ప్లస్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తోందని విన్నాం. ఫ్లాగ్షిప్ కిల్లర్ 2.0 వస్తోంది..అంటూ ఉడికిస్తూ ట్వీట్ చేశారు. ఆసుస్ జెన్ ఫోన్ సిరీస్‌లో భాగంగా రొటేటింగ్ కెమెరా స్పెషల్ ఫీచర్‌గా జెన్‌ఫోన్6ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మరి షావోమి బాస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరో అంటూ వ్యాఖ్యలు వినబడుతున్నాయి. 2019 మొదటి త్రైమాసికంలో షావోమి ఎగుమతులు 2 శాతం క్షీణించడం, భారత్‌లో రియల్ మి ఏడు శాతం మార్కెట్ వాటాను సాధించడంతో మను జైన్‌లో ఆందోళన మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రియల్ మి దేశంలో 150 నగరాల్లో 20వేల మల్టీ బ్రాండ్ రీటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే ఈ ఏడాది కనీసం 15 మిలియన్ హ్యాండ్ సెట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్ మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. -
స్మార్ట్ బాటలో షియోమీ
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షియోమీ 'స్మార్ట్’ బాట పట్టింది. భారత్‌లో స్మార్ట్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్, పవర్ బ్యాకప్, యాక్సెసరీస్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ వినూత్న స్మార్ట్ ఉపకరణాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేయనుంది. టీవీలు, రౌటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, మస్కిటో రెపెల్లెంట్, ఎలక్ట్రికల్ బైసికిల్, డ్రోన్, బూట్లు, రైస్ కుకర్, ల్యాప్‌టాప్‌ల వంటి స్మార్ట్ ప్రొడక్ట్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి వీటిని దశలవారీగా ఇక్కడి మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు షియోమీ ఇండియా హెడ్ మను జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రతి ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించవచ్చని తెలిపారు. వేటికవే ప్రత్యేకం.. షియోమీ వాటర్ ప్యూరిఫయర్‌లో నాలుగు ఫిల్టర్లుంటాయి. ఏది పాడైనా వెంటనే కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌కు, అలాగే కంపెనీ కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఒక్క క్లిక్‌తో ఫిల్టర్‌ను ఆర్డరివ్వొచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండానే అయిదు నిముషాల్లో బిగించొచ్చు కూడా. ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశామో చెప్పే షూస్, బియ్యం రకం, వంటకాన్నిబట్టి సమయానుకూలంగా వండే రైస్ కుకర్, ఏడు కిలోల బరువున్న మడవగలిగే ఎలక్ట్రికల్ బైసికిల్, వెంట తీసుకెళ్లగలిగే మస్కిటో రెపెల్లెంట్ కస్టమర్ల మదిని చూరగొంటాయని కంపెనీ తెలిపింది. చైనాలో షియోమీ స్మార్ట్ టీవీలకు 4.40 లక్షల గంటల కంటెంట్ అందుబాటులో ఉంది. భారత్‌లో కంటెంట్ సిద్ధమవగానే టీవీలను ప్రవేశపెట్టనుంది. మరో రెండు ప్లాంట్లు.. కంపెనీ ప్రతి మూడు నెలలకు 10 లక్షలకుపైగా స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో షియోమీ కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన యూనిట్లో మొబైళ్లను తయారు చేస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు పలు రాష్ట్రాలతో కంపెనీ సంప్రదిస్తోంది. ప్రతి స్మార్ట్‌ఫోన్ 4జీ, ఎల్టీఈ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. అలాగే అంతర్జాతీయంగా లభించే మోడళ్లకు పలు మార్పులు చేసి భారత్‌లో విడుదల చేస్తోంది. గతంలో స్మార్ట్ఫోన్లను చైనాలో విడుదలైన 6-9 నెలలకు భారత్‌కు తీసుకువచ్చేవారు. ఇప్పుడు రెండు నెలలలోపే ప్రవేశపెడుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరుస్తామని మను జైన్ చెప్పారు.