ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షియోమీ 'స్మార్ట్’ బాట పట్టింది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌నెస్ బ్యాండ్, పవర్ బ్యాకప్, యాక్సెసరీస్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ వినూత్న స్మార్ట్ ఉపకరణాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేయనుంది. టీవీలు, రౌటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, మస్కిటో రెపెల్లెంట్, ఎలక్ట్రికల్ బైసికిల్, డ్రోన్, బూట్లు, రైస్ కుకర్, ల్యాప్‌టాప్‌ల వంటి స్మార్ట్ ప్రొడక్ట్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది.
వచ్చే ఏడాది నుంచి వీటిని దశలవారీగా ఇక్కడి మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు షియోమీ ఇండియా హెడ్ మను జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రతి ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించవచ్చని తెలిపారు. వేటికవే ప్రత్యేకం.. షియోమీ వాటర్ ప్యూరిఫయర్‌లో నాలుగు ఫిల్టర్లుంటాయి. ఏది పాడైనా వెంటనే కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌కు, అలాగే కంపెనీ కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఒక్క క్లిక్‌తో ఫిల్టర్‌ను ఆర్డరివ్వొచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండానే అయిదు నిముషాల్లో బిగించొచ్చు కూడా.
ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశామో చెప్పే షూస్, బియ్యం రకం, వంటకాన్నిబట్టి సమయానుకూలంగా వండే రైస్ కుకర్, ఏడు కిలోల బరువున్న మడవగలిగే ఎలక్ట్రికల్ బైసికిల్, వెంట తీసుకెళ్లగలిగే మస్కిటో రెపెల్లెంట్ కస్టమర్ల మదిని చూరగొంటాయని కంపెనీ తెలిపింది. చైనాలో షియోమీ స్మార్ట్ టీవీలకు 4.40 లక్షల గంటల కంటెంట్ అందుబాటులో ఉంది. భారత్‌లో కంటెంట్ సిద్ధమవగానే టీవీలను ప్రవేశపెట్టనుంది. మరో రెండు ప్లాంట్లు.. కంపెనీ ప్రతి మూడు నెలలకు 10 లక్షలకుపైగా స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో షియోమీ కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన యూనిట్‌లో మొబైళ్లను తయారు చేస్తున్నారు.
మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు పలు రాష్ట్రాలతో కంపెనీ సంప్రదిస్తోంది. ప్రతి స్మార్ట్‌ఫోన్ 4జీ, ఎల్‌టీఈ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. అలాగే అంతర్జాతీయంగా లభించే మోడళ్లకు పలు మార్పులు చేసి భారత్‌లో విడుదల చేస్తోంది. గతంలో స్మార్ట్‌ఫోన్లను చైనాలో విడుదలైన 6-9 నెలలకు భారత్‌కు తీసుకువచ్చేవారు. ఇప్పుడు రెండు నెలలలోపే ప్రవేశపెడుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరుస్తామని మను జైన్ చెప్పారు.