Maratha community
-
మరాఠా కోటా.. ‘జూలై 20 నుంచి మళ్లీ నిరాహారదీక్ష చేపడతా’
ముంబై: మరాఠా రిజర్వేషన్ సమస్యకు రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఒత్తిడి కారణంగా పరిష్కారం లభించటం లేదని మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్ ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘ప్రభుత్వం మారాఠా రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటంలేదు. మేము పెట్టిన డెడ్‌లైన్ జూలై 13 కూడా దాటిపోయింది. మరాఠా రిజర్వేషన్లకు పరిష్కారం లభించకుండా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మరో మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి, మారాఠా సబ్ కోటా కమిటీ మెంబర్ శంభూరాజ్ దేశాయ్ మమ్మల్ని సంప్రదించటం లేదు. మాకు ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. కానీ, ఇప్పటికి ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. ఆయనపై కూడా మారాఠా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే కార్యకర్తలను కలవకూడదని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మారాఠా రిజర్వేషన్ల కార్యకర్తలము జూలై 20న సమావేశం అవుతాము. తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత వెలువడకపోతే వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 మంది కార్యకర్తలు పోటీ చేస్తాం లేదా ముంబై పెద్ద ఎత్తును నిరసన మార్చ్ చేపడతాం. మా హక్కులను సాధించుకోవడానికి మేము ముంబై వెళ్తాం. శాంతియూతంగా నిరసన తెలపటం మాకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు’’ అని అన్నారు.మరోవైపు.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే జూలై 20 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపడతామని మనోజ్ జరాంగే పాటిల్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరిలో మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది. -
మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే
ముంబయి: సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించడానికి చట్టపరమైన విధానాలు పాటించడానికి ప్రభుత్వానికి సమయం అవసరమని చెప్పారు. మరాఠా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో నేడు రాష్ట్రంలో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారుడు మనోజ్ జరాండే నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని అఖిలపక్ష నేతలు కోరారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలను ఆకాంక్షించారు. ఈ అఖిలపక్ష భేటీలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) నాయకుడు అనిల్ పరాబ్, శాసనసభా ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ తదితరులు పాల్గొన్నారు. మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్రంలో కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదు మరాఠా జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ బస్సులను రద్దు చేశారు. ఆందోళనలు వ్యాప్తి చెందకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బుధవారం నుంచి దీక్షను మరింత తీవ్రతరం చేస్తామని నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న మనోజ్ జరాండే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించింది. మరాఠా రిజర్వేషన్లపై మంగళవారం తీవ్రస్థాయికి చేరాయి. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిని ఆందోళనకారులు అడ్డగించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైలు పట్టాలను దిగ్బంధించారు. పట్టాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు, మరాఠా రిజర్వేషన్లకు మద్దతు కోరుతూ నిరసనకారులు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయుల రాజీనామా
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు చెలరేగాయి. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ డిమాండ్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని యావత్మాల్లో ఆందోళనకారులు పాటిల్‌ను అడ్డగించారు. దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు. శివసేన ఎంపీ గాడ్సేను నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నిరసనకారులు ప్రశ్నించగా.. ఆయన కూడా తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపించారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే రాజీనామా స్టంట్స్ చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వ్యాఖ్యానించడంపై పాటిల్ మండిపడ్డారు. "నేను నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టలేదు. రెండు-మూడు తరాలు అధికారంలో ఉన్నారు. వారే చొరవ తీసుకుని ఉండేవారు. కానీ అదేమీ చేయలేదు. మరాఠా సామాజికవర్గానికి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆ వర్గానికి ఏం చేయలేదు" అని పాటిల్ మండిపడ్డారు. మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. మనోజ్ జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠా సమాజం మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యునికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు' -
Maratha Reservation: ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా
సాక్షి ముంబై: రిజర్వేషన్ కోసం మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ముంబైలో బైక్ ర్యాలీ జరిగింది. వందాలది బైక్‌లతో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠా సమాజం ప్రజలు పాల్గొన్నారు. యువకులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రారంభం నుంచి చివరి వరకు ‘ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా..’, ‘జై శివాజీ... జై భవానీ’, ‘హరహర మహదేవ్’ తదితర నినాదాలతో సాగింది. దీంతో పరిసరాలన్ని మారుమ్రోగాయి. ముంబై సైన్‌లోని సోమయ్య మైదానం నుంచి ఆదివారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ర్యాలీ సైన్, మాటుంగా, దాదర్, పరెల్, భైకల్లాల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ (సీఎస్ఎంటీ) వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యువతి, యువకులు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. వివిధ రకాల బైక్‌లపై వందలాది మంది నినాదాలు చేస్తు మందుకు సాగారు. కాషాయ జెండాలు చేతపట్టుకొని తలపై తెల్ల టోపీలు ధరించారు. ఇలా ప్రత్యేక వేషాధారణతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మరాఠా సమాజం నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు ఆశీష్ శెలార్, ప్రవీణ్ దరేకర్‌లతోపాటు పలువురు నేతలు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ముంబైలోని ఓ ఫ్లైఓవర్‌పై ర్యాలీగా వెళుతున్న మరాఠాలు సహనాన్ని పరీక్షించొద్దు.. మరాఠా సమాజానికి రిజర్వేషన్ తొందరగా ఇవ్వాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మరాఠా క్రాంతి సంఘర్స్ మోర్చా కన్వీనర్ రాజన్ శివసంగ్రామ్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వినాయక్ రావ్ మెటే హెచ్చరించారు. సీఎస్ఎంటి వద్ద ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా తమ సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు. తొందర్లో ఈ అంశంపై నిర్ణయం వెలువడకపోతే ముంబైలో లక్ష మందితో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మరాఠా క్రాంతి మోర్చా బైక్ ర్యాలీ కారణంగా సైన్– భైకళా–సీఎస్ఎంటీ ప్రధాన మార్గంపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో ముఖ్యంగా అంబేడ్కర్ నగర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగిన ర్యాలీలో సీఎస్ఎంటీ వద్ద శివాజీ ముఖచిత్రం కలిగిన జెండా ఊపుతూ వెళుతున్న ఓ మరాఠా యువకుడు ఈ ర్యాలీని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును మోహరించారు. మరోవైపు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్ రద్దు చేసింది. మే 5న రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో రగడ మొదలైంది. కాగా, ఇప్పటివరకు జరిగిన ఎలాంటి నియామకాలకైనా ఈ ఉత్తర్వులు అడ్డుకోలేవని తెలిపింది. దీంతో కోటాను రద్దు చేయడానికి ముందే ఎంపీఎస్సీ పరీక్షలకు హాజరైన 2,200 మంది మరాఠా అభ్యర్థులను ఆర్థికంగా బలహీనమైన విభాగంలో లేదా ఓపెన్ కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రజా సేవా కమిషన్‌ను కోరింది. కాగా, గతంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి (లిమిట్)ను ఎత్తివేయాలని ప్రధానితో డిమాండ్ చేసినట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: మావోయిస్టులకు చెందిన రూ.5కోట్లు స్వాధీనం Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా? -
హీరో అక్షయ్ కుమార్‌పై కేసు నమోదు
ముంబై : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అక్షయ్ నటించిన యాడ్‌కు సంబంధించి ఆయనపై మరాఠాలు మండిపడ్డారు. ఓ వాషింగ్ పౌడర్ కంపెనీ ప్రచారానికి సంబంధించిన యాడ్‌లో అక్షయ్ మరాఠా యోధుడిగా కనిపించారు. అయితే ఆ యాడ్‌లో అక్షయ్ పాత్ర తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మరాఠాలు ఆరోపిస్తున్నారు. దీనిపై అక్షయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన అన్ని వీడియోలను, ఫొటోలను ఆన్లైన్లో నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఫిర్యాదు మేరకు ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్లో అక్షయ్‌పై కేసు నమోదైంది. అయితే ఇందుకు సంబంధించి అక్షయ్ వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు సోషల్ మీడియాలో అక్షయ్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆ వాషింగ్ పౌడర్‌ను బాయ్‌కాట్ చేయాలని ట్వీట్లు చేస్తున్నారు. ‘అక్షయ్ ఎప్పుడైనా మరాఠాల చరిత్ర చదివారా?. మీకు తెలియకపోతే.. వారు దేశానికి చేసిన త్యాగాలను ముందుగా తెలుసుకోండి. అంతేకానీ మరాఠా సంస్కృతిని ఎగతాళి చేయకండి’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. Mr. @akshaykumar , have you ever read history of Maratha's ? If No then go and read their sacrifice towards Nation. Else dont mock our Maratha culture !#BoycottNirma pic.twitter.com/cQE8k39GGv — Nikhil Patrikar (@jagruthindu) January 8, 2020 -
హింసాత్మకంగా మారిన రిజర్వేషన్ల ఉద్యమం
ముంబై : రిజర్వేషన్ల కోసం మరాఠా సామాజిక వర్గం చేపట్టిన ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా క్రాంతి మోర్చా గత కొంత కాలంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల రైతు కాకాసాహెబ్ శిండే గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ వర్గం నేతలు మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలిపునిచ్చారు. ఔరంగబాద్‌లో ఈ రోజు ఉదయం బంద్‌లో పాల్గొన్న ఓ నిరసనకారుడు కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ.. బ్రిడ్జిపై నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరాఠా సామాజిక వర్గం తలపెట్టిన ఈ బంద్ ప్రభావం పశ్చిమ మహారాష్ట్రతో పాటు, ఔరంగబాద్, ఉస్మాన్‌బాద్, బీడ్, అహ్మాద్‌నగర్ ప్రాంతాల్లో అధికంగా ఉంది. నిరసనకారులు ఔరంగబాద్‌లో పలు వాహనాలపై దాడికి దిగారు. ఉస్మాన్‌బాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల ముందు టైర్లను కాల్చివేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ క్షమాపణలు చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని మరాఠా రిజర్వేషన్ల సమితి నేత రవీంద్ర పాటిల్ తెలిపారు. అవసరమైతే ముంబైలో తాము ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళనలపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న రైతు ఆత్మహత్యకు పాల్పడటం బాధకరమని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఆందోళకారులను శాంతియుతంగా ఉండాలని కోరారు. కాగా ఫడ్నవీస్ ఆదివారం రోజున సోలాపూర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా అక్కడ కొందరు మరాఠా నాయకులు తనపై దాడి చేస్తారనే కారణంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై సీఎం క్షమాపణలు చెప్పాలంటూ మరాఠా సామాజిక వర్గం నేతలు ఆందోళనలు చేపట్టారు. -
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబయి: డిమాండ్ల సాధన కోసం ముంబయిలో మహాప్రదర్శన చేపట్టిన మరాఠాలను సంతృప్తి పరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వారికి వరాల జల్లు కురిపించింది. ఓబీసీలకు కల్పించే విద్యా రాయితీలను మరాఠాలకూ వర్తింపచేయనున్నట్టు మహా సర్కార్ స్పష్టం చేసింది. మరాఠా విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణం కోసం ప్రతి జిల్లాలో స్థలం కేటాయించడంతో పాటు రూ 5 కోట్ల నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఉద్యోగాల్లో కోటా అంశాన్ని పరిశీలించేందుకు బీసీ కమిషన్‌కు నివేదిస్తామని తెలిపింది. మరాఠా మోర్చా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. ఉద్యోగ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు, రైతు రుణ మాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కోరుతూ మరాఠాలు కొంత కాలంగా ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా ర్యాలీలు నిర్వహించిన మరాఠా మోర్చా ముంబయిలో బుధవారం నిర్వహించిన ప్రదర్శనకు 10 లక్షల మందికి పైగా మరాఠాలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి హామీలతో మరాఠాలు తమ ఆందోళన విరమించారు. -
మరాఠీలకు ఉద్ధవ్ థాక్రే క్షమాపణలు...
ముంబైః మరాఠా నిశ్శబ్ద నిరసనకారులను వెక్కిరిస్తూ సామ్నా పత్రిక ప్రచురించిన కార్టూన్ పై శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే క్షమాపణ చెప్పారు. తాము ప్రచురించిన కార్టూన్ ఎవరినైనా బాధించిఉంటే అందుకు తాను విచారిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 'నిశ్శబ్ద మార్చ్' పేరుతో ప్రచురించిన కార్టూన్ వల్ల మరాఠాలను కించపరిచినట్లు భావిస్తే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నానన్నారు. మరాఠా కమ్యూనిటీని ఉద్దేశపూర్వకంగానే కించపరిచారంటూ శివసేన పత్రిక 'సామ్నా' ప్రచురించిన కార్టూన్ పై ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరాఠాలకు థాకరే ట్వీట్ ద్వారా క్షమాపణలు చెప్పారు. సామ్నా పత్రికలో గత ఆదివారం వచ్చిన కార్టూన్ కు నిరసనగా కొందరు కార్యాలయంపై రాళ్ళ దాడి కూడా చేశారు. అనంతరం దాడికి పాల్పడింది తామే అంటూ మరాఠా సామాజిక సంస్థ శంభాజీ బ్రిగేడ్ ప్రకటించింది. సామ్నాలో కార్టూన్ ను ప్రచురించడాన్ని శాంభాజీ బ్రిగేడ్ ప్రతినిధి శివానంద్ భోంజే ఖండించారు. ఈ అంశంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సహా సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ రౌత్, కార్టూనిస్టు మహరాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరాఠాల భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో భాగంగానే యాదృచ్ఛిక దాడి జరిగిందని శివానంద్ వివరించారు. మరోవైపు వివాదాస్పద కార్టూన్ ప్రచురణపై పలు రాజకీయ పార్టీలు సైతం విమర్శలు గుప్పించాయి. సామ్నా పత్రిక వ్యంగ్యంగా చిత్రీకరించిన కార్టూన్.. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్ యూ) విద్యార్థులను, సైనికులను సైతం వెక్కిరిస్తున్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. శివసేన పత్రిక ప్రజల వాక్ స్వాతంత్ర్యానికి అడ్డు పడుతూ.. అనారోగ్య హాస్యాన్ని పలికిస్తూ ప్రజల్ని కించపరిచేట్లుగా వ్యవహరిస్తోందని పలువురు దుయ్యబట్టారు. గతనెల్లో అహ్మద్ నగర్ లో ఓ మరాఠా మైనర్ బాలికపై జరిగిన క్రూరమైన గ్యాంగ్ రేప్, హత్య ఘటన తర్వాత మరాఠా కమ్యూనిటీ సభ్యులు చేపట్టిన నిశ్శబ్ద నిరసనకు మహరాష్ట్ర ప్రభుత్వం సైతం గడగడలాడింది.