
ముంబై: మరాఠా రిజర్వేషన్ సమస్యకు రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఒత్తిడి కారణంగా పరిష్కారం లభించటం లేదని మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్ ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘ప్రభుత్వం మారాఠా రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటంలేదు. మేము పెట్టిన డెడ్‌లైన్ జూలై 13 కూడా దాటిపోయింది. మరాఠా రిజర్వేషన్లకు పరిష్కారం లభించకుండా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మరో మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రి, మారాఠా సబ్ కోటా కమిటీ మెంబర్ శంభూరాజ్ దేశాయ్ మమ్మల్ని సంప్రదించటం లేదు. మాకు ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. కానీ, ఇప్పటికి ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. ఆయనపై కూడా మారాఠా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే కార్యకర్తలను కలవకూడదని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
మారాఠా రిజర్వేషన్ల కార్యకర్తలము జూలై 20న సమావేశం అవుతాము. తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత వెలువడకపోతే వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 మంది కార్యకర్తలు పోటీ చేస్తాం లేదా ముంబై పెద్ద ఎత్తును నిరసన మార్చ్ చేపడతాం. మా హక్కులను సాధించుకోవడానికి మేము ముంబై వెళ్తాం. శాంతియూతంగా నిరసన తెలపటం మాకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు’’ అని అన్నారు.
మరోవైపు.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే జూలై 20 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపడతామని మనోజ్ జరాంగే పాటిల్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరిలో మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది.