Market Godham
-
వ్యవసాయ మార్కెట్ గోదాం ‘మమ’
మధిర మార్కెట్ యార్డుకు అనుసంధానంగా రైతుల సౌకర్యార్థం మండల కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ గోదాం నిరుపయోగంగా మారింది. 2010లో నాటి డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సబ్‌మార్కెటింగ్ యార్డుకు ప్రారంభోత్సం చేశారు. దీంతోపాటు రూ.2లక్షల వ్యయంతో పంటను ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫాం కూడా నిర్మించారు. కానీ ప్రారంభానికే పరిమితమైంది. ఈ మార్కెట్ గోదాం ఉపయోగంలోకి రాలేదు. రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పట్టించుకునే వారు లేరు. బోనకల్ : మార్కెట్ గోదాం ఆవరణం ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి చిట్టడవిని తలపిస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్ శాఖ అధికారులు ఆ పని చేయకపోవడంతో గోదాం మూత పడింది. దీంతో మండలంలోని అన్ని గ్రామాల రైతులు పంటలను మధిర, ఖమ్మం తరలిస్తున్నారు. మండలంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సబ్‌మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసి గోదాంలో నిల్వచేయాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా ప్లాట్‌ఫాం పగుళ్లు వచ్చి శిథిలావస్థకు చేరింది. మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులు ధాన్యాన్ని, మార్కెట్‌కు తీసుకొచ్చే పంటలను ప్లాట్‌ఫాంపై ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉగయోగించని మార్కెట్ యార్డ్‌కు ఇటీవల రూ.1లక్షతో ఖర్చు ఆర్చి నిర్మించారు. సబ్ మార్కెట్‌యార్డును ప్రారంభిస్తే రైతులకు సౌకర్యంగా ఉండటంతోపాటు, నిరుపయోగంగా ఉన్న గోదాం, ప్లాట్‌ఫాం వినియోగంలోకి వస్తుందని రైతులు అంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభించాలి... బోనకల్లో నిర్మించిన సబ్‌మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించాలి. పండించిన పంటలను దూరప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి వస్తోంది. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోదాం కూడా ఉందని, కానీ సిబ్బంది లేకపోవడంతో రైతులు ఎవరు తమ పంటలను దాచుకోవడం లేదు. – బందం అచ్చయ్య, రామాపురం, రైతు మార్కెట్ లేక రైతుల అవస్థలు... రైతుల కోసం నిర్మించిన సబ్‌మార్కెట్ యార్డులో కొనుగోళ్లు జరుపకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మార్కెట్ యార్డు నిర్మించారే తప్ప, కొనుగోళ్లు లేకపోవడంతో గోదాం నిరుపయోగంగా మారింది. ముళ్లపొదలు, చెట్లతో నిండి ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. –హనుమంతరావు, రైతు ముష్టికుంట్ల -
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
-
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
కొడంగల్‌లో లాఠీచార్జి, ఎమ్మెల్యే అరెస్ట్.. విడుదల సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు.. గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో మార్కెట్ గోదాం శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిర్ణీత సమయానికి వచ్చారు. భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాకపోవడంతో అసహనానికి గురైన రేవంత్.. గోదాం వద్ద గల ప్రాంగణంలో చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించారు. శంకుస్థాపన జరిగే వరకు ఎవరూ లోపలకు వెళ్లరాదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెదరగొట్టేందుకు యత్నిస్తుండగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ తరలించగా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి, ఇతర కార్యకర్తలను కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు గంటసేపు ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. రేవంత్‌ను అరెస్టు చేసిన తర్వాత కొద్దిసేపటికే మంత్రి జూపల్లి సభా ప్రాంగణానికి వచ్చారు. స్థానిక శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని.. ఆయనను తీసుకురావాలని నారాయణపేట డీఎస్పీకి మంత్రి సూచించారు. అయితే కార్యక్రమానికి రావడానికి రేవంత్ నిరాకరించారని డీఎస్పీ చెప్పడంతో జూపల్లి గోదాం శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి రాకుండా అధికార పార్టీ అడ్డుకుందన్న ప్రచారం కోసమే రేవంత్‌రెడ్డి తపన పడుతున్నారే తప్ప ప్రజలకు జరిగే మేలులో పాల్గొనాలన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంత్రి జూపల్లి పర్యటన ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. కేసీఆర్‌ను దించేవరకూ నిద్రపోను: రేవంత్ దౌల్తాబాద్: తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయపబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుర్చీదించే వరకు తాను నిద్రపోనని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల అయిన అనంతరం గాంధీ కూడలిలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను బయటపెడితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల లిక్కర్ మాఫియాతో ముఖ్యమంత్రి ముడుపులు తీసుకుని ఇంటింటికీ చీప్ లిక్కర్ పంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, అక్రమాలపై పోరాటం సాగిస్తామన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కొడంగల్‌లో జూపల్లి చిచ్చు రేపి రణరంగాన్ని సృష్టిం చారన్నారు. టీఆర్ఎస్ పాలనలో టీడీపీ ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండాపోయిందని చెప్పారు. జూపల్లి గూండాగిరీ చేస్తున్నారు: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గూండాగిరీ చేస్తున్నారని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు అక్రమమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎర్రబెల్లి గురువారం విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఢిల్లీ వెళ్లి ప్రయత్నించాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తన నియోజకవర్గం పాలకుర్తిలో మంత్రి కార్యక్రమం ఉందని, అయితే, తనకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు.