Mars machine
-
అంగారక కక్ష్యలోకి ‘మామ్’
2014 సెప్టెంబరు 24న ఉదయం గం. 7.17.32 లకు ‘మామ్’.. అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. జీవాన్వేషణ, గ్రహ నిర్మాణం వంటి అంశాలపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన ఈ ‘ప్రాజెక్ట్ అంగారకయాన్’ లేదా ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (మామ్) ను 2013 నవంబరు 5న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి విజయవంతంగా ప్రయోగించారు. పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లడంతో భారత్ అంగారకయానం మొదలైంది. దాంతో అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రయోగించిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఈ ప్రాజెక్టుకు రాకెట్ శాస్త్రవేత్త నందిని హరినాథ్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు యువ నటుడు ఉదయ్‌కిరణ్, సీనియర్ నటులు అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు; సుచిత్రాసేన్, సునంద పుష్కర్, బాలూ మహేంద్ర, రూసీ మోడీ, కె.బాలచందర్.. కన్నుమూత. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి ప్రమాణ స్వీకారం. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. -
అరుణగ్రహంపై జీవం కోసం...
పాసడీనా (అమెరికా): వచ్చే ఏడాది అరుణగ్రహంపైకి పంపనున్న ‘ది మార్స్ 2020 మిషన్’అంతరిక్ష నౌక (రోవర్) ద్వారా నాసా ఆ గ్రహంపై ఇప్పటివరకు ఏమైనా జీవం ఉందా అన్న అంశాన్ని పరిశోధించనుంది. అంతేకాదు భవిష్యత్తులో మానవుని మనుగడ సాధ్యమవుతుందా అనేది కూడా తెలుసుకోనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అరుణగ్రహంపైకి పంపనున్న అంతరిక్ష నౌకను శుక్రవారం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్ పాసడీనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ఈ నౌకను శాస్త్రవేత్తలు రూపొందించారు. గత వారమే ఈ నౌకను విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష నౌకను తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఈ నౌక 2020 జూలైలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి 2021 ఫిబ్రవరిలో అరుణగ్రహంపై ల్యాండ్ కానుంది. ఈ రోవర్‌పై 23 కెమెరాలు, మార్స్‌పై గాలి శబ్దాలు వినేందుకు రెండు రిసీవర్లు, రసాయనిక చర్యలను విశ్లేషించేందుకు లేజర్లను వాడినట్లు డిప్యూటీ మిషన్ లీడర్ మట్ వాలేస్ తెలిపారు. క్యూరియాసిటీ రోవర్ మాదిరిగానే 6 చక్రాలను అమర్చారు. ఈ రోవర్ దాదాపు కారు పరిమాణంలో ఉంటుంది. అక్కడి ఒక్క రోజులో పూర్తిస్థాయిలో 200 గజాల స్థలాన్ని తూర్పారా పట్టే పనిని రోవర్‌కు అప్పగించారు. దీనికి చేతులు, నేలను తవ్వేందుకు డ్రిల్ అమర్చారు. ఒకప్పుడు అరుణగ్రహంపై వెచ్చటి ఉపరితల జలం, చిక్కటి వాతావరణం, దీని చుట్టూ అయస్కాంత శక్తి ఉండేదని వివరించారు. దీన్ని బట్టి ఏకకణ జీవం ఉండేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రోవర్ దిగే స్థలంపై పరిశోధన చేశాక ఎంపికచేశారు. ఈ స్థలంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని తెలిపారు. 350 కోట్ల ఏళ్ల ఇది నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రోవర్ ప్రయోగం తర్వాత ప్రతిష్టాత్మకమైన అరుణగ్రహంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనున్నారు. అరుణ గ్రహంపై పరిశోధనలు చేయనున్న రోవర్ ఇదే -
ఇదొక మైలురాయి: ప్రణబ్‌ముఖర్జీ
న్యూఢిల్లీ: అరుణ గ్రహ రహస్యాలను చేధించేందుకు ఉద్దేశించిన మార్స్ ఆర్బిటార్ మిషన్(మంగళయాన్) ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హర్షం వ్యక్తంచేశారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మంగళవారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌కు సందేశం పంపించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయని, ఈ విజయం మరింతమంది శాస్త్రజ్ఙులకు స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మార్స్ మిషన్ విజయవంతం కావడం సంతోషకరమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తెలిపారు. చరిత్రాత్మకం: ప్రధాని మార్స్ మిషన్ ప్రయోగం సఫలం కావడాన్నిచరిత్రాత్మక విజయంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అభివర్ణించారు. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌కు ఆయన స్వయంగా ఫోన్ చేసి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. అనంతరం రాధాకృష్ణన్, ఆయన సహచరులకు అభినందనలు తెలుపుతూ ప్రధాని ఒక సందేశం పంపించారు. ‘అంతరిక్ష వాహక నౌకల ప్రయోగంలో ఇస్రో అద్భుత నైపుణ్యం కలిగి ఉందనడానికి ఈ ప్రయోగం ఒక నిదర్శనం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో మైలురాయిగా నిలిచే ఈ మార్స్ మిషన్ భవిష్యత్ అంచెలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు. భారతీయులంతా గర్విస్తున్న అద్భుత వైజ్ఞానిక విజయం ఇదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. భూమి పుత్రుడు అంగారకుడు! అంగారకుడిని భూగ్రహానికి కుమారుడిగా భారతీయులు భావిస్తారని, ఆ గ్రహంపై జీవం మనగలిగే పరిస్థితులున్నాయా, లేవా అన్న విషయం ఈ ప్రయోగం ద్వారా తేలుతుందని బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి అన్నారు. సీఎం, ఆర్థిక మంత్రి అభినందనలు పీఎస్ఎల్వీసీ-25 ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ రాధాకృష్ణన్, ఇతర శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలోని కీలకమైన నాలుగు దశలు పూర్తి చేసుకుని విజయవంతంగా మార్స్ మిషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చడంతో భారత అంగారక యాత్ర 300 రోజుల ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైందని సీఎం కార్యాలయం పేర్కొంది. ‘ఇస్రో’కు జగన్ అభినందనలు అంగారక గ్రహ యాత్రలో భాగంగా మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు శాస్త్రవేత్తల బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. తొలి ప్రయత్నంలోనే అపూర్వ విజయం సాధించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు తమ అసమాన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని ఆయన కొనియాడారు. ఈ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం ద్వారా ప్రపంచంలో అంగారక యాత్రను చేపట్టిన నాలుగోదేశంగా భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఇస్రో.. భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని జగన్ ఒక సందేశంలో ఆకాంక్షించారు. మరిన్ని ప్రయోగాలు జరపాలి: బాబు పీఎస్ఎల్వీ సీ-25ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను చంద్రబాబు అభినందించారు. అంతరిక్ష రంగంలో భారత్ విజయపతాకను రెపరెపలాడించారని వారిని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు జరపాలని ఓ ప్రకటనలో అభిలషించారు. కాగా.. పీఎస్ఎల్వీసీ 25 ప్రయోగం విజయవంతం కావడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తంచేశారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే.. ‘‘మార్స్ మిషన్ పూర్తిగా అర్థరహితం. మార్స్‌పై రోవర్ ప్రయోగం నిర్వహించిన నాసా అంగారకుడిపై జీవం ఆనవాలే లేదని బహిరంగంగా ప్రకటించింది. అయినప్పటికీ.. మార్స్ మీద జీవాన్వేషణ కోసం వెళుతున్నామని ప్రకటన చేయటం.. ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే.’’ - మాధవన్నాయర్, ఇస్రో మాజీ చైర్మన్ దీపావళి టపాసుల ఖర్చులో పదో వంతే... ‘‘మార్స్ మిషన్‌పై రూ. 450 - 500 కోట్లు ఖర్చు చేశారంటూ భారతీయులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇది ఖచ్చితంగా భారత్ గర్వించదగ్గ రోజు. పది అడుగులకన్నా ఎత్తుకు వెళ్లని దీపావళి టపాసుల కోసం ఒక్క రోజులో రూ. 5,000 కోట్లు ఖర్చుపెట్టటానికి భారతీయులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అందులో పదో వంతు అంగారకుడి వరకూ వెళ్లటానికి ఖర్చు చేస్తే ఎందుకింత గగ్గోలు?’’ - యు.ఆర్.రావు, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ పాలక మండలి చైర్మన్ ఇస్రోకు కీలక మైలురాయి.. ‘అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకునే యోగ్యత ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు పెరుగుతుంది. ఇస్రోకు ఇది చాలా కీలక మైలురాయి’ - కే కస్తూరిరంగన్, ఇస్రో మాజీ చైర్మన్ మాపై ఆధిక్యం చూపేందుకే: చైనా అంతరిక్షంలో శాంతిని నెలకొల్పేందుకు కలిసి పనిచేద్దామని అంతర్జాతీయ సమాజానికి చైనా పిలుపునిచ్చింది. భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్ విజయవంతం కావడంపై చైనా స్పందించింది. ‘అంతరిక్షం మానవాళికందరికీ చెందుతుంది. దానిపై ప్రయోగాలు చేసేందుకు అన్ని దేశాలకు హక్కుంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్లీ వ్యాఖ్యానించారు. అయితే, చైనా అధికారిక మీడియా మాత్రం తమ దేశ అంతరిక్ష ప్రయోగాలపై పైచేయి సాధించేందుకే భారత్ ఈ ప్రయోగాలు చేస్తోందని విమర్శించింది. చైనా గతంలో చేపట్టిన మార్స్ ప్రయోగం విఫలమైంది. -
మార్స్.. మేమొస్తున్నాం..
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ25.. అంగారక యాత్రకు సర్వం సిద్ధం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మార్స్ మిషన్‌కు ఆదివారం ఉదయం 6.08 నుంచి నిర్విఘ్నంగా కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోలు బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు నౌక నింగికేసి దూసుకెళ్లనుంది. తద్వారా గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టనుంది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్‌స్పేస్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేయనున్నారు. 310 రోజుల ప్రక్రియ మార్స్ ఆర్బిటర్‌ను భూమికి దూరంగా భూ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో అత్యంత శక్తివంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తున్నారు. రాకెట్‌కు తొలి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 75 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. 139 టన్నుల ఘన ఇంధనంతో 112.75 సెకండ్లలో 57.678 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశను పూర్తి చేస్తారు. 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264.74 సెకన్లలో 132.311 కి.మీ. ఎత్తులో రెండో దశ, 7.5 టన్నుల ఘన ఇంధనంతో 583.6 సెకన్లలో 194.869 కి.మీ. ఎత్తులో మూడో దశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 2,619.72 సెకన్లకు 342.515 కి.మీ. ఎత్తులో నాలుగో దశను పూర్తి చేసేలా రూపకల్పన చేశారు. నాలుగో దశలో 2656.72 సెకన్లకు, భూ ధీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రవేశపెడుతుంది. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనం సాయంతో ఐదుసార్లు మండించి, దాన్ని అంగారకుడి వైపు మళ్లించే ప్రక్రియను చేపడతారు. అప్పటినుంచి దాదాపుగా 310 రోజుల తరవాత, అంటే 2014 సెప్టెంబర్ 28 నాటికి అంగారకుడి కక్ష్యలో 360‘80,000 కిలో మీటర్లు ఎత్తులో అంగారకుడి చుట్టూరా తిరుగుతూ పరిశోధనలను ప్రారంభిస్తుంది. తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు సాక్షి, తిరుమల: మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ సోమవారం వేకువజామున 2.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఎంవోఎం నమూనా ఉపగ్ర హం, దాన్ని మోసుకెళ్లే పీఎస్ఎల్వీ సీ25 నమూనా రాకెట్‌ను గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. తర్వాత వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. సుదూర ప్రయోగమిది: రాధాకృష్ణన్ అరుణగ్రహంపై పరిశోధనల కోసం ఈ ప్రయోగం చేపట్టామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సుదూర ప్రయోగానికి షార్‌లో ఆదివారం కౌంట్‌డౌన్ ఆరంభమైందని, మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రయోగించనున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో జీఎస్ఎల్వీ-డీ5 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు.