Marudhanayagam
-
ఆ భారీ చిత్రం తెరపైకి రానట్టేనా..?
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితమే బాహుబలిని మించిన ఫాంటసీ సినిమాను మొదలు పెట్టాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ చేతుల మీదుగా ప్రారంభించిన మరుదనాయగం సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత చాలా సందర్భాల్లో సినిమాను తిరిగి ప్రారంభించే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన కమల్ ఇప్పుడు ఆ ఆశలు కూడా వదులు కున్నట్టున్నాడు. ఇటీవల ఓ మీడియా ప్రతినిథి మరుదనాయగం సినిమా ఎప్పుడు తెర మీదకు వస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా.. ఏమో సినిమాగానే కాదు.. వెబ్ సీరీస్, టీవీ సీరీస్లా అయినా రావచ్చు అంటూ సమాధానమిచ్చాడు. అంటే ఇక మరుదనాయగంను వెండితెర మీదకు తీసుకురావటం అసాధ్యమని కమల్ కూడా భావిస్తున్నట్టున్నాడు. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న శభాష్ నాయుడు, విశ్వరూపం 2 సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. -
మళ్లీ మరుదనాయగమ్?
మరుదనాయగమ్ ఇది చరిత్ర కథ. దీన్ని విశ్వనాయకుడు కమలహాసన్ 18 ఏళ్ల క్రితమే చారిత్రాత్మక చిత్రంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆయనే కథను తయారు చేసుకుని కథనం, దర్శకత్వం బాధ్యతలతో పాటు టైటిల్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు. చిత్ర షూటింగ్‌ను ఆర్భాటంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఇంగ్లాడ్ రాణి ఎలిజబెత్‌ను ఆహ్వానించారు. చిత్ర నిర్మాణం కొంత వరకూ నిర్విఘ్నంగా జరిగింది. కమలహాసన్ కూడా తన కలల చిత్రం తెర రూపం దాల్చడంతో ఆనందించారు. అయితే ఆర్థిక సమస్య దానికి అడ్డుకట్ట వేసింది. ఫలితం చిత్ర నిర్మాణం ఆగిపోయింది. మరుదనాయగమ్ చిత్రాన్ని కమల్ 1997లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాన్ని పూర్తి చేయడానికి ఆయన పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది విశ్వనటుడి డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక. ఇటీవల కూడా కమలహాసన్ లండన్‌కు చెందిన తన మిత్రుడు మరుదనాయగమ్ చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చారన్న విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఐయింగరన్ చిత్ర నిర్మాణ సంస్థ మరుదనాయగమ్ చిత్ర పోస్టర్‌ను అధికారిక పూర్వంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఆ చిత్ర నిర్మాణానికి రోజులు దగ్గర పడ్డాయనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. సూపర్‌స్టార్‌తో ఎందిరన్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థే ఆగిన మరుదనాయగమ్కు జీవం పోయనున్నట్లు కోడంబాక్కమ్ వర్గాల టాక్. -
మరుదనాయగం మళ్లీ మొదలు
మరుదనాయగం చిత్ర నిర్మా ణం మళ్లీ మొదలు కానుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర కర్త, కర్మ, క్రియ అయిన నటుడు కమలహాసన్‌నే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిం చారు. 1997 అక్టోబర్ 16వ తారీఖున ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా ప్రారంభమైన చిత్రం మరుదనాయగం. వందలాది కళాకారులతో యుద్ధ సన్నివేశాలను తొలిరోజునే భారీ ఎత్తున కమల్ చిత్రీకరించారు. అలా 30 నిమిషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఆ తరువాత కమలహాసన్ పలుమార్లు ఈ చిత్రానికి పూర్తి చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాంటిది సుమారు 17 ఏళ్ల తరువాత మల్లీ మరుదనాయగం చిత్ర నిర్మాణానికి కమల్ నడుం బిగించారు. దీనిగురించి ఆయన తెలుపుతూ మరుదనాయగం చిత్రాన్ని చేయడానికి నిర్మాత దొరికారన్నారు. లండన్‌కు చెందిన పారిశ్రామికవేత్త అయిన తన స్నేహితుడొకరు ఈ చిత్రాన్ని పూర్తిచేయడానికి సిద్ధం అయ్యారన్నారు. చాలా ఖర్చు అవుతుందని చెప్పినా ఎంత ఖర్చు అయినా తాను నిర్మిస్తానని చెప్పారన్నారు. దీంతో మరుదనాయగం చిత్ర పునః నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే మొదలవుతాయని కమల్ తెలిపారు. ఇది చరిత్ర పౌరుడి ఇతివృత్తంతో కూడిన కథ. భారతదేశం తొలి స్వాతంత్య్ర పోరాట యోధుడు మహ్మద్ యూసప్ ఖాన్ కథేగా మరుదనాయగం తెరకెక్కనుంది. ఆయన అసలు పేరు మరుదనాయగం పిళై్ల. ఈ చిత్రంలో కమలహాసన్‌తో పాటు సత్యరాజ్, నాజర్, పశుపతి, విష్ణువర్దన్, అమ్రేష్పురి ప్రారంభంలో నటించారు. -
మరుదనాయగం మళ్లీ మొదలుపెడతా!
గత కొన్నేళ్లుగా ఒకేసారి ఒక చిత్రం మాత్రమే చేస్తూ వచ్చిన కమల్‌హాసన్ ఇప్పుడు ఏకంగా విశ్వరూపం-2, పాపనాశం, ఉత్తమ విలన్.. ఈ మూడు చిత్రాలూ చేశారు. మరో ఆరు నెలల్లో ఒకదాని తర్వాత ఒకటి ఈ మూడు చిత్రాలూ విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో తదుపరి ‘టిప్పు సుల్తాన్’ అనే చిత్రం చేయాలనుకుంటున్నారు. అలాగే, తన కలల చిత్రం ‘మరుదనాయగమ్’ని మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో కమల్ ఈ విషయం గురించి చెబుతూ - ‘‘‘మరుదనాయగమ్’వంటి చిత్రం చేయడానికి డబ్బులు మాత్రమే కాదు.. చాలా సమకూరాలి. ముఖ్యంగా పంపిణీరంగం నుంచి సహకారం కావాలి. ఈ చిత్రాన్ని తమిళ్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నా. పంపిణీ సరిగ్గా జరిగితేనే సినిమాకి న్యాయం జరుగుతుంది. అందుకని పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. జస్ట్ అలా అమ్మేసి, ఇలా హ్యాపీగా ఇంటికెళ్లిపోయేంత తేలికైన చిత్రం కాదిది. యూఎస్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మంచి వేదిక కావాలి నాకు. ఫాక్స్, వయొకామ్ వంటి సంస్థలు ముందుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికి 30 నిమిషాల చిత్రాన్ని తీశాను. ఇంకా రెండు గంటల సినిమా తీయాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే.. మొదలుపెడతా’’ అన్నారు. -
మరుదనాయగమ్ ఎప్పటికైనా తీస్తా!
‘‘గత ఇరవయ్యేళ్లలో జరగనిది ఈ ఏడాది జరగనుంది. నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ 20 ఏళ్లల్లో ఇలా జరగలేదు’’ అని కమల్‌హాసన్ చెప్పారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. అలాగే, రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రం కూడా పూర్తి కావచ్చిందట. ఈ సినిమాల గురించే కమల్ ఈ విధంగా పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక తన పాఠకులకు కమల్‌ను ప్రశ్నించే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఓ పాఠకుడు ‘మరుదనాయగమ్’ని మధ్యలో ఆపేశారు.. మళ్లీ మొదలుపెడతారా? అని అడిగాడు... దానికి కమల్ సమాధానం చెబుతూ -‘‘అది నాక్కూడా తెలియదు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాల్సిన సినిమా. నాకు తెలిసి లోకల్ నిర్మాతల నుంచి భారీ బడ్జెట్ పొందే అవకాశం లేదు. ఎందుకంటే, ఇది లోకల్ మూవీ కాదు. తమిళ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించాల్సిన సినిమా. ఈ చిత్రాన్ని ఆపేయలేదు. ఎప్పుడు ఆరంభమైనా ఆశ్చర్యపోవడానికి లేదు’’ అన్నారు. ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో ప్రారంభించారు కమల్. దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్ధంతరంగా ఆపేశారు. మరి.. ‘మరుదనాయగమ్’ మళ్లీ ఎప్పుడు షూటింగ్ పట్టాలెక్కుతాడో వేచి చూడాల్సిందే.