మళ్లీ మరుదనాయగమ్?
మరుదనాయగమ్ ఇది చరిత్ర కథ. దీన్ని విశ్వనాయకుడు కమలహాసన్ 18 ఏళ్ల క్రితమే చారిత్రాత్మక చిత్రంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆయనే కథను తయారు చేసుకుని కథనం, దర్శకత్వం బాధ్యతలతో పాటు టైటిల్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు. చిత్ర షూటింగ్‌ను ఆర్భాటంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఇంగ్లాడ్ రాణి ఎలిజబెత్‌ను ఆహ్వానించారు. చిత్ర నిర్మాణం కొంత వరకూ నిర్విఘ్నంగా జరిగింది. కమలహాసన్ కూడా తన కలల చిత్రం తెర రూపం దాల్చడంతో ఆనందించారు. అయితే ఆర్థిక సమస్య దానికి అడ్డుకట్ట వేసింది.
ఫలితం చిత్ర నిర్మాణం ఆగిపోయింది. మరుదనాయగమ్ చిత్రాన్ని కమల్ 1997లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాన్ని పూర్తి చేయడానికి ఆయన పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది విశ్వనటుడి డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక. ఇటీవల కూడా కమలహాసన్ లండన్‌కు చెందిన తన మిత్రుడు మరుదనాయగమ్ చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చారన్న విషయాన్ని వెల్లడించారు.
తాజాగా ఐయింగరన్ చిత్ర నిర్మాణ సంస్థ మరుదనాయగమ్ చిత్ర పోస్టర్‌ను అధికారిక పూర్వంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఆ చిత్ర నిర్మాణానికి రోజులు దగ్గర పడ్డాయనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. సూపర్‌స్టార్‌తో ఎందిరన్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థే ఆగిన మరుదనాయగమ్‌కు జీవం పోయనున్నట్లు కోడంబాక్కమ్ వర్గాల టాక్.