వామ్మో.. ఈ మహిళకెంత డేర్..!
ఫ్లోరిడా: మొసలి అనగానే సాధారణంగా ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. దాన్ని చూడ్డానికి కాస్తం భయంగా, ఎబ్బేట్టుగా ఉంటుంది. దాని నోటికి చిక్కితే ఎంత భయంకరంగా నమిలేస్తుందో తెలియని విషయం కాదు. అలాంటి మొసలిని ఎవరైనా పెంపుడు జంతువుగా పెట్టుకోవాలని చూస్తే.. అంతేకాదు ఎక్కడికంటే అక్కడికి తనతోపాటే బైక్ పై తీసుకొని వెళితే.. ఫ్లోరిడాలో ఇదే జరిగింది. మేరే థార్న్ అనే ఓ కుస్తీ పోరాట యోధురాలు (రెజ్లర్) ఏకంగా ఓ రాంబో అనే మొసలిని తన పెట్ యానిమల్ గా పెంచుకుంటోంది. తన బైక్కు అదనంగా మరో బైక్లాంటిదాన్ని తగిలించి దానిపై దాదాపు ఆరడుగుల పొడవున్న మొసలిని తీసుకెళుతుంది.
ఎక్కడైనా ఖాళీ దొరికి కూర్చుంటే మొసలి ఎంతో ప్రేమగా ఆమెను ఆలింగనం కూడా చేసుకుంటుంది. ఆమె చెప్పే మాటలకు అది సరే అన్నట్లుగా కనురెప్పలు వాలుస్తుంటుంది. దీనిని పలువురు వ్యతిరేకించడంతోపాటు అటవీ శాఖ కమిషన్ అధికారులు కూడా అడ్డుచెప్పారు. ఒక వేళ ఆ మొసలిని పెంచుకోవాలనుకుంటే రెండున్నర ఎకరాల స్థలం ఉండాలని, దాన్ని ముందు ఏర్పాటుచేసుకొమ్మని తెలిపింది. కాగా, తాను మొత్తం నాలుగు మొసళ్లను పెంచడం ప్రారంభించానని, పరిస్థితులు అనుకూలించక మూడు చనిపోయాయని ప్రస్తుతం రాంబో మాత్రమే మిగిలిందని, అది ఆరడుగులు పెరుగుతుందని తాను కూడా అస్సలు ఊహించలేదని తెలిపింది.