Master trainers
-
లక్షలాది మందిని చేర్చుకోవడం లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా కరోనాతోపాటు వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తున్న సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపై టీఆర్ఎస్ దృష్టిసారించింది. జూన్ లేదా జూలైలో ప్రారంభించి అక్టోబర్‌లోగా పూర్తి చేయాలనే యోచనలో ఉంది. లక్షలాది మంది కార్యకర్తలను చేర్చుకోవడం లక్ష్యంగా చేపడుతున్న శిక్షణ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో చేపట్టాలని భావిస్తోంది. పార్టీ కొత్త జిల్లా కార్యాలయాలు వేదికగా జరిగే శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయ బాధ్యతలు చూసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున చురుకైన నేతలను గుర్తించాలని ఆదేశించింది. వనపర్తి వంటి ఒకటి రెండు జిల్లాల్లో ఇప్పటికే సమన్వయకర్తల నియామకం పూర్తికాగా, మిగతా జిల్లాల్లో నెలాఖరులోగా నియమించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే సమన్వయకర్తల జాబితాలను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. 65 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్ఎస్లో కనీసం 40 లక్షల మందిని లక్ష్యంగా చేసుకుని శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ఉంటుందని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రస్థాయిలో శిక్షణ కార్యకలాపాల షెడ్యూల్, సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన వక్తలుగా భావజాల వ్యాప్తికి కృషి చేసిన వారితోపాటు పార్టీ ప్రస్థానం, ప్రభుత్వ కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన కలిగిన వారిని ‘రిసోర్స్ పర్సన్లు’గా ఎంపిక చేసే పనిని కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే వరంగల్, సిద్దిపేట తదితర చోట్ల జిల్లా కార్యాలయాలు ప్రారంభం కాగా, మిగతా జిల్లాల్లోనూ త్వరలో ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శిక్షణ అంశాలు, మెటీరియల్‌పై కసరత్తు కార్యకర్తలకు ఏయే అంశాలపై శిక్షణ ఇవ్వాలి, అందుకు అవసరమైన మెటీరియల్ తదితరాలపై కేసీఆర్ నిర్దిష్ట సూచనలు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ పాత్ర, అధికారంలో ఉన్న రెండు పర్యాయాల్లో రంగాల వారీగా సాధించిన అభివృద్ధి వంటి అంశాలు శిక్షణలో అంతర్భాగంగా ఉంటాయి. వీటితోపాటు రాజ్యాంగం మౌలిక అంశాలు, జాతీయ రాజకీయాలు, స్వాతంత్య్రానంతరం పాలనలో జాతీయ పార్టీలు విఫలమైన తీరు, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా వంటి అనేక అంశాలు అందరికీ సులభంగా అర్థమయ్యేరీతిలో వివరించేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లు తదితర వాటికి రూపకల్పన చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలు, ఆరోపణలు, వాటిని తిప్పికొట్టాల్సిన తీరు తదితరాలు కూడా శిక్షణలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. శిక్షణ షెడ్యూల్, ఇతర వివరాలను త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించే అవకాశముంది. -
అంత ‘స్మార్ట్’ కాదు..!
శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ సర్వే ఎలా చేయాలో నిర్ధరించుకోవడానికి నిర్వహించిన ట్రయల్ రన్ అట్టర్ ఫ్లాపైంది. యాప్ సరిగ్గా పనిచేయకపోవడం, వివరాలు తెలిపేందుకు ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో సర్వే సందిగ్ధంలో పడింది. ఈ సర్వే బుధవారం నుంచే ప్రారంభం కానుండడం విశేషం. జిల్లాలోని 38 మండలాలను, 5 మున్సిపాలిటీలను, శ్రీకాకుళం నగరపాలక సంస్థను జనాభా ప్రాతిపదికన బ్లాక్‌లుగా విభజించారు. వీటిలో ఉన్న కుటుంబాల వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీఎస్ యాప్ ద్వారా వివరాలు సేకరించే పద్ధతిని జిల్లాలోని కొందరు అధికారులకు మాస్టర్ ట్రైనర్స్‌తో శిక్షణ ఇప్పించారు. వీరి ద్వారా జిల్లాలోని ప్రతి మండలంలో ఇద్దరు ఉద్యోగులు, పురపాలక సంఘాల్లోని నలుగురు ఉద్యోగులకు మాస్టర్ ట్రైనీస్‌గా శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా అన్ని మండలాల్లోని ఎన్యూమరేటర్లు శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం వివిధ డిపార్టుమెంట్లకు అందజేసిన ట్యాబ్‌లకు బయోమెట్రిక్ పరికరం అమర్చి వాటి ద్వా రా సర్వే వివరాలు సేకరించనున్నారు. ట్రయల్ రన్‌లోనే అవాంతరాలు పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో నడిచే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన రె వెన్యూ డివిజన్లోని ఓ పట్టణం, ఓ గ్రామంలో గత బుధ, గురు వారాల్లో ఎన్యూమరేటర్లు పర్యటించారు. సిగ్నల్ లేక అసలు యాప్ ఓపెన్ కాలేదని ఆయా ప్రాంతాల్లో సర్వే జరిపిన ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. యాప్ పూర్తిగా పనిచేయాలంటే 3జీ సిగ్నల్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లలో 2జీ సిమ్లే ఉండటంతో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. అలాగే ప్రతి కుటుంబానికి సుమారు హౌస్‌హోల్డ్, వ్యక్తిగత, ఇతర వివరాల కింద సు మారు 77 కాలమ్స్‌ను టచ్ ప్యాడ్ ద్వారా డేటాను ఎంటర్ చేయడానికి గంట సమయం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక యాప్ పనిచేయకపోతే, మరికొన్ని ప్రాంతాల్లో యాప్ ద్వారా వివరాలు సేకరిస్తుంటే సర్వర్ బిజీ అయి ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు ట్రయల్ రన్ చేసిన ఎన్యూమరేటర్లు అంటున్నారు. ప్రచారం శూన్యం... సర్వేకు సంబంధించి ప్రచారం కల్పించకపోవడం వల్ల వివరాలు చెబితే ఏం జరుగుతుందో, చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి ప్రజల్లో ఏర్పడింది. సమాచారంతోపాటు 20 రకాల ధ్రువపత్రాలను అడుగుతుండడంతో అవేవీ తమ వద్ద లేవని, తమ వివరాలు నమోదు చేయనవసరం లేదని ప్రజల నుంచి సమాధానం వచ్చే పరిస్థితి ఉంటోంది. ఇల్లు ఎంత స్థలంలో కట్టారు, ఎన్ని గదులున్నాయి, ఏసీలు, వాషింగ్ మిషన్లు ఉన్నాయా, విద్యార్హత, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థ నుంచి పొందినదా, సబ్సిడీ లోన్, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్ నంబర్ వంటి వివరాలు సేకరించడంపై కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువలన సర్వేకు ప్రజల సహకారంపై స ర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
జూన్ 27 నుంచి ప్రజాసాధికార సర్వే
- ప్రతి ఇంటికీ కొత్త నంబర్ల జారీ - అప్పటికప్పుడు ఆధార్ నంబర్ ఇస్తాం - రెండు నిముషాల్లో జన్‌ధన్ బ్యాంక్ ఖాతా - మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ తరగతుల్లో ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న అమరావతి (గుంటూరు) : ప్రజల నుంచి కేవలం సమాచారం సేకరించడమే కాకుండా వారి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాసాధికార సర్వే నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి పి.ప్రద్యుమ్న చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని ట్యాబ్ ద్వారా ఫొటో తీసి దాన్ని జియోట్యాగ్ చేసి అప్పటికప్పుడే కొత్త ఇంటి నంబర్‌ను ఈ సర్వేలో కేటాయిస్తామన్నారు. ఆధార్ కార్డులో ఏదైనా సమాచారం లోపముంటే అప్పటికప్పుడు సరిదిద్దడం, మొబైల్ నంబర్‌ను అనుసంధానించడం వంటివి చేయనున్నట్లు తెలిపారు. గురువారం విజయవాడలో ప్రజాసాధికార సర్వేలో పాల్గొనే మాస్టర్ ట్రైనర్స్‌కు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన 2,500 మంది పాల్గొన్నారు. ప్రద్యుమ్న మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారుల్లో చాలామందికి ఆధార్ లేదని, వీరందరికీ సర్వేలో ఆధార్ నంబర్ ఇస్తామని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి రెండు నిమిషాల్లో జన్‌ధన్ ఖాతా ప్రారంభించి ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వ పథక లబ్ధిదారులను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి అనుసంధానం చేస్తామన్నారు. దీనివల్ల పనికి ఆహారం పథక లబ్ధిదారులకు వేతనం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమవుతుందన్నారు. ఈ సర్వే ద్వారా డైనమిక్ ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ డేటా బేస్ సేకరిస్తామన్నారు. దీని వల్ల ప్రతి కుటుంబానికి చెందిన వాస్తవ పరిస్థితులు, సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటాయన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సర్వే పూర్తయితే ప్రజలతో ప్రభుత్వానికి నేరుగా సంబంధాలు ఏర్పడతాయన్నారు. జూన్ 27న ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27న ఈ సర్వే ప్రారంభిస్తారని, సుమారు 40 రోజులు కొనసాగుతుందని ప్రద్యుమ్న తెలిపారు. విదేశాలు, పక్క రాష్ట్రాల్లో నివసిస్తున్న రాష్ట్ర పౌరులందరూ ఈ సర్వేలో పాల్గొనవచ్చన్నారు. ఇందుకోసం సుమారు 34,000 మంది వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ.. ఈ సర్వేలో పాల్గొంటే ప్రభుత్వ పథకాలు, పింఛన్లు ఆగిపోతాయని, రేషన్ కార్డులు రద్దుచేస్తారంటూ వచ్చే వదంతులను నమ్మొద్దని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి మాత్రమే ఈ సర్వే నిర్వహిస్తున్నామన్నారు.