శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ సర్వే ఎలా చేయాలో నిర్ధరించుకోవడానికి నిర్వహించిన ట్రయల్ రన్ అట్టర్ ఫ్లాపైంది. యాప్ సరిగ్గా పనిచేయకపోవడం, వివరాలు తెలిపేందుకు ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో సర్వే సందిగ్ధంలో పడింది. ఈ సర్వే బుధవారం నుంచే ప్రారంభం కానుండడం విశేషం.
జిల్లాలోని 38 మండలాలను, 5 మున్సిపాలిటీలను, శ్రీకాకుళం నగరపాలక సంస్థను జనాభా ప్రాతిపదికన బ్లాక్‌లుగా విభజించారు. వీటిలో ఉన్న కుటుంబాల వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్‌పీఎస్ యాప్ ద్వారా వివరాలు సేకరించే పద్ధతిని జిల్లాలోని కొందరు అధికారులకు మాస్టర్ ట్రైనర్స్‌తో శిక్షణ ఇప్పించారు. వీరి ద్వారా జిల్లాలోని ప్రతి మండలంలో ఇద్దరు ఉద్యోగులు, పురపాలక సంఘాల్లోని నలుగురు ఉద్యోగులకు మాస్టర్ ట్రైనీస్‌గా శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా అన్ని మండలాల్లోని ఎన్యూమరేటర్లు శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం వివిధ డిపార్టుమెంట్లకు అందజేసిన ట్యాబ్‌లకు బయోమెట్రిక్ పరికరం అమర్చి వాటి ద్వా రా సర్వే వివరాలు సేకరించనున్నారు.
ట్రయల్ రన్‌లోనే అవాంతరాలు
పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో నడిచే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన రె వెన్యూ డివిజన్‌లోని ఓ పట్టణం, ఓ గ్రామంలో గత బుధ, గురు వారాల్లో ఎన్యూమరేటర్లు పర్యటించారు. సిగ్నల్ లేక అసలు యాప్ ఓపెన్ కాలేదని ఆయా ప్రాంతాల్లో సర్వే జరిపిన ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. యాప్ పూర్తిగా పనిచేయాలంటే 3జీ సిగ్నల్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లలో 2జీ సిమ్‌లే ఉండటంతో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం.
అలాగే ప్రతి కుటుంబానికి సుమారు హౌస్‌హోల్డ్, వ్యక్తిగత, ఇతర వివరాల కింద సు మారు 77 కాలమ్స్‌ను టచ్ ప్యాడ్ ద్వారా డేటాను ఎంటర్ చేయడానికి గంట సమయం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక యాప్ పనిచేయకపోతే, మరికొన్ని ప్రాంతాల్లో యాప్ ద్వారా వివరాలు సేకరిస్తుంటే సర్వర్ బిజీ అయి ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు ట్రయల్ రన్ చేసిన ఎన్యూమరేటర్లు అంటున్నారు.
ప్రచారం శూన్యం...
సర్వేకు సంబంధించి ప్రచారం కల్పించకపోవడం వల్ల వివరాలు చెబితే ఏం జరుగుతుందో, చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి ప్రజల్లో ఏర్పడింది. సమాచారంతోపాటు 20 రకాల ధ్రువపత్రాలను అడుగుతుండడంతో అవేవీ తమ వద్ద లేవని, తమ వివరాలు నమోదు చేయనవసరం లేదని ప్రజల నుంచి సమాధానం వచ్చే పరిస్థితి ఉంటోంది. ఇల్లు ఎంత స్థలంలో కట్టారు, ఎన్ని గదులున్నాయి, ఏసీలు, వాషింగ్ మిషన్లు ఉన్నాయా, విద్యార్హత, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థ నుంచి పొందినదా, సబ్సిడీ లోన్, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్ నంబర్ వంటి వివరాలు సేకరించడంపై కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువలన సర్వేకు ప్రజల సహకారంపై స ర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అంత ‘స్మార్ట్’ కాదు..!
Published Wed, Jul 6 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement