- ప్రతి ఇంటికీ కొత్త నంబర్ల జారీ
- అప్పటికప్పుడు ఆధార్ నంబర్ ఇస్తాం
- రెండు నిముషాల్లో జన్‌ధన్ బ్యాంక్ ఖాతా
- మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ తరగతుల్లో ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న
అమరావతి (గుంటూరు) : ప్రజల నుంచి కేవలం సమాచారం సేకరించడమే కాకుండా వారి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాసాధికార సర్వే నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి పి.ప్రద్యుమ్న చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని ట్యాబ్ ద్వారా ఫొటో తీసి దాన్ని జియోట్యాగ్ చేసి అప్పటికప్పుడే కొత్త ఇంటి నంబర్‌ను ఈ సర్వేలో కేటాయిస్తామన్నారు. ఆధార్ కార్డులో ఏదైనా సమాచారం లోపముంటే అప్పటికప్పుడు సరిదిద్దడం, మొబైల్ నంబర్‌ను అనుసంధానించడం వంటివి చేయనున్నట్లు తెలిపారు. గురువారం విజయవాడలో ప్రజాసాధికార సర్వేలో పాల్గొనే మాస్టర్ ట్రైనర్స్‌కు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన 2,500 మంది పాల్గొన్నారు.
ప్రద్యుమ్న మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారుల్లో చాలామందికి ఆధార్ లేదని, వీరందరికీ సర్వేలో ఆధార్ నంబర్ ఇస్తామని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి రెండు నిమిషాల్లో జన్‌ధన్ ఖాతా ప్రారంభించి ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వ పథక లబ్ధిదారులను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కి అనుసంధానం చేస్తామన్నారు. దీనివల్ల పనికి ఆహారం పథక లబ్ధిదారులకు వేతనం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమవుతుందన్నారు. ఈ సర్వే ద్వారా డైనమిక్ ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ డేటా బేస్ సేకరిస్తామన్నారు. దీని వల్ల ప్రతి కుటుంబానికి చెందిన వాస్తవ పరిస్థితులు, సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటాయన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సర్వే పూర్తయితే ప్రజలతో ప్రభుత్వానికి నేరుగా సంబంధాలు ఏర్పడతాయన్నారు.
జూన్ 27న ప్రారంభం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27న ఈ సర్వే ప్రారంభిస్తారని, సుమారు 40 రోజులు కొనసాగుతుందని ప్రద్యుమ్న తెలిపారు. విదేశాలు, పక్క రాష్ట్రాల్లో నివసిస్తున్న రాష్ట్ర పౌరులందరూ ఈ సర్వేలో పాల్గొనవచ్చన్నారు. ఇందుకోసం సుమారు 34,000 మంది వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ.. ఈ సర్వేలో పాల్గొంటే ప్రభుత్వ పథకాలు, పింఛన్లు ఆగిపోతాయని, రేషన్ కార్డులు రద్దుచేస్తారంటూ వచ్చే వదంతులను నమ్మొద్దని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి మాత్రమే ఈ సర్వే నిర్వహిస్తున్నామన్నారు.
జూన్ 27 నుంచి ప్రజాసాధికార సర్వే
Published Thu, Jun 23 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement
Advertisement