ఎన్ఎఫ్సీలో స్లాబ్ కూలి ఇద్దరి దుర్మరణం
♦ 11 మందికి గాయాలు
♦ భర్త శవం చూడటానికి అనుమతించని భద్రతా సిబ్బంది
♦ కార్మిక సంఘాల ఆందోళన
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ)లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎన్ఎఫ్సీలో మూడు నెలలుగా జరుగుతున్న భవన నిర్మాణంలో భాగంగా కూలీలు సోమవారం స్లాబ్ వేస్తున్నారు. ప్రమాదవశాత్తు సెంట్రింగ్ కుంగిపోవడంతో స్లాబ్ కూలిపోయింది. 10 మీటర్ల ఎత్తున ఉన్న స్లాబ్‌పైన పనిలో నిమగ్నమైన కూలీలు కింద పడిపోయారు.
ఈ ఘటనలో అల్వాల నర్సింహగౌడ్(35), సాండ్రిక్(32) అనే ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా రాందాసు, భీంసేన్, నర్సింహులు, రసూల్, రాములు, శ్యామూల్, యాదగిరిరెడ్డి, బాలయ్య, భసంత్కుమార్, అన్సారీ, సతీష్ అనేక కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు దాదాపుగా 44 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను జేసీబీ సహాయంతో వెలికితీసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నర్సింహగౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా, బూత్పూర్ మండలం, పోతలమడుగు గ్రామానికి చెందినవాడు. బతుకుదెరువు కోసం చాలా కాలం క్రితమే నగరానికి వచ్చి మేస్త్రీ పనిచేసుకుంటూ అశోక్‌నగర్ కేబుల్ చౌరస్తా సమీపంలో భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలసి ఉంటున్నాడు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన మరో మృతుడు సాండ్రిక్ దమ్మాయిగూడలో నివాసం ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నాడు. క్షతగాత్రుల్లో అధికులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారేనని పోలీసులు పేర్కొన్నారు.
పడిగాపులు కాసిన కుటుంబ సభ్యులు..
ప్రమాద విషయం తెలిసిన వెంటనే కూలీల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఎన్ఎఫ్సీ వద్దకు చేరుకున్నారు. తమవారిని చూసుకోవడానికి వచ్చిన వారిని భద్రతా సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో గంటల తరబడి బయట పడిగాపులు కాసారు. నాలుగు గంటల తరువాత మృతుడు నర్సింహ్మగౌడ్ భార్య విజయలక్ష్మిని లోనికి అనుమతించారు. కంపెనీ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాల నాయకులు కంపెనీ వద్ద ఆందోళనకు దిగాయి. కొంత మందికి చిన్న, చిన్న గాయాలయ్యాయని, వారికి చికిత్స అందించి పంపిస్తామని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మిగతావారి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు
వెల్లడించారు.