MCHRD
-
నోటీసులు లేకుండానే కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకొస్తున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద వెళ్లేందుకు మార్గం లేక ఇటీవల కురిసిన వర్షాలతో నగరంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయని అన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, నాలాలు, బఫర్ జోన్లలోని నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసే అధికారం అధికారులకు కట్టబెడుతూ కొత్తగా తీసుకురానున్న జీహెచ్ఎంసీ చట్టంలో కఠినమైన నిబంధనలు పొందుపరచనున్నట్లు వెల్లడించారు. దీనికోసం అవసరమైతే న్యాయ నిపుణులు, న్యాయస్థానాలను సంప్రదిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఉజ్వల భవిష్యత్ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ అనుమతుల జారీకి కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్–బీపాస్)ను సోమవారం ఆయన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్–బీపాస్ విధానం దేశంలోనే అత్యుత్తమమైందని, ఒక రూపాయి లంచం ఇవ్వకుండానే ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందేలా దీనికి రూపకల్పన చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇతర పాలసీల తరహాలో టీఎస్–బీపాస్ విధానం కూడా దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు. బాధ్యతాయుతంగా మెలగాలి.. 75 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మించే ఇళ్లకు అనుమతులు అవసరం లేదని, రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందన్నారు. 75 నుంచి 300 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం టీఎస్–బీపాస్ వెబ్సైట్లో స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా అనుమతులు జారీ అవుతాయన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినా, నిర్మాణంలో సెట్ బ్యాక్ రూల్స్‌ను ఉల్లంఘించినా, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందినట్లు తేలినా తక్షణమే నోటీసులు లేకుండా కూల్చివేస్తారన్నారు. ఈ విషయంలో పౌరులు బాధ్యతాయుతంగా మెలగాలని, ప్రజల మేలు కోరి తీసుకొచ్చిన ఈ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 300 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కేవలం 21 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులను, ఎన్ఓసీలను జారీ చేస్తామన్నారు. దరఖాస్తుల్లో ఏవైనా లోపాలుంటే తొలి వారంలోనే దరఖాస్తుదారులకు తెలియజేసి వాటిని సరిదిద్దడానికి అవకాశం కల్పిస్తారన్నారు. ఒకవేళ గడువులోగా అనుమతులు రాకుంటే వచ్చినట్లు పరిగణించాలని చెప్పారు. అనుమతులకు చట్టబద్ధత.. టీఎస్–బీపాస్ ద్వారా జారీ చేసే తక్షణ ఇళ్ల అనుమతులకు చట్టబద్ధత ఉంటుందని, బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. టీఎస్–బీపాస్ విధానాన్ని రెరా ఆథారిటీతో అనుసంధానం చేస్తామని, అనుమతులు పొందిన ప్రాజెక్టుల సమాచారం అటోమెటిక్‌గా రెరా ఆథారిటీకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అత్యున్నతమైన జీవన ప్రమాణాలు, అత్యధిక ఆఫీస్ స్పేస్ వినియోగం కలిగిన నగరంగా హైదరాబాద్‌కు పేరుందని, నగరంలో స్థిరాస్తి వ్యాపారం బాగా జరుగుతోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకే ఇక్కడ ఇళ్లు లభిస్తాయని పేరుందని, డిమాండ్ ఉందని అడ్డగోలుగా ధరలు పెంచవద్దని స్థిరాస్తి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా అమలు చేస్తున్న టీఎస్–బీపాస్ విధానం అమలుపై కొంత కాలం పరిశీలన జరుపుతామని, ఆ తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు తీసుకొస్తామని వెల్లడించారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇళ్లకు అనుమతి పొందిన పలువురు దరఖాస్తుదారులకు మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో అనుమతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవందర్ రెడ్డి, డీటీసీపీ విద్యాధర్ రావు, క్రెడాయ్ రామకృష్ణా తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన తలసాని
సాక్షి, హైదరాబాద్: వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణకు అనుమతిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో సినీ ప్రముఖులతో గురువారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హీరో నాగార్జున, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, డి. సురేష్‌బాబు, సుప్రియ, మా అధ్యక్షులు నరేష్, తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల ప్రారంభంపై చర్చించామని, ఇందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానిపై పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు. (సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది) ఎలాంటి ఇబ్బందులు లేవనే పోస్టు ప్రొడక్షన్స్‌కు అనుమతిచ్చామని, విధానపరమైన నిర్ణయాలను రూపొందించామని చెప్పారు. ఇక సినీ రంగం ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుళ్తామని, ఆయన అమోదించగానే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న వారినే చర్చలకు పిలిచామని తెలిపారు. సమావేశాలకు అందరినీ పిలవబోమని, అసోషియేషన్ ప్రతినిధులను మాత్రమే పిలుస్తామన్నారు. బాలకృష్ణ మాట్లాడినట్టుగా చెబుతున్న వీడియో పాతది అంటున్నారని, దీనిపై క్లారిటీ వచ్చాక మాట్లాడతానని తలసాని చెప్పారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తమ విషయంలో చాలా త్వరగా స్పందిస్తోందన్నారు. తలసాని వల్లే ఇదంతా సాధ్యమైందని నాగార్జున వ్యాఖ్యానించారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిత్రీకరణలపై చర్చించామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాలేకపోవడంతో హోం సెక్రటరీ రవితో చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం) -
ఈ చట్టాలు మార్చాలి : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : అందరిలాగే ‘దిశ’ ఘటనలో తనకు భావోద్వేగాలున్నాయని.. అయితే చట్టపరంగానే దోషులకు శిక్ష పడుతుందని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు సంయమనంతో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో సివిల్ సర్వీసెస్ 94 ఫౌండేషన్ అధికారుల వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అధికారులకు ఆయన ధ్రువపత్రాలు అందజేశారు. దిశ కేసులో దోషులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని స్పష్టంచేశారు. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం, హత్య ఘటన చాలా దారుణం. దీనిపై తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇటు నిందితులను ఉరితీయాలని ఎంపీలు పార్లమెంటు వేదికగా నినదించారు. అందరి కోపం, ఉద్వేగమంతా న్యాయబద్ధమైనవే. ఢిల్లీలో 2012లో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ కేసులో 7 ఏళ్లుగా విచారణ సాగినా.. ఇప్పటివరకు నిందితులను ఉరితీయలేదు. ఇటు దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాద చర్యకు పాల్పడిన అజ్మల్ కసబ్‌ను ఉరితీయడానికి ఎంత సమయం పట్టిందో అందరికీ తెలుసు. దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నా, ప్రస్తుత చట్టాలు అందుకు తగిన విధంగా లేవు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. నాకూ నలుగురు నిందితులను తుదముట్టించాలని ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలు కోరినట్లు వారిని ఉరితీయలేం. వాస్తవాలను గ్రహించి, రాజ్యాంగబద్ధంగా నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది’అని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేయాలి.. సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. సమస్యల పట్ల వేగంగా స్పందించే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రజలతో మమేకం కావాలన్నారు. రాజకీయాల్లోకి రాకముందు తానొక ప్రైవేట్ ఉద్యోగినని గుర్తుచేసుకున్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో వేలాది గ్రామాల్లో తాగునీరు, కరెంటు, రోడ్ల సౌకర్యం లేదన్నారు. అయినా వందలాది ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తున్న భారత్‌ను మరోవైపు నుంచీ చూడాలని చెప్పారు. -
‘జోనల్’పై భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జోనల్ వ్యవస్థపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. జోనల్ స్ఫూర్తికి విఘాతం కలుగకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ఎంసీహెచ్ఆర్డీలో ప్రత్యేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారుల సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 30 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా రోజున జిల్లాల ఏర్పాటుకు గడువు విధించిన తరహాలోనే.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దసరాలోగా పరిష్కరించాలని సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, డీఏను చెల్లించాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలని కోరారు. ఎవరేమన్నారంటే.. జోన్ల వ్యవస్థను రద్దు చేసి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థ ఉండాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.మమత, ఏ.సత్యనారాయణ పేర్కొన్నారు. అవసరం లేని విభాగాలు, కార్పొరేషన్లను విలీనం చేసి, జోన్ల వ్యవస్థను రద్దు చేయాలని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ ప్రతినిధులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హనుమంత్ నాయక్, శశికిరణాచారి విజ్ఞప్తి చేశారు. అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా తీసుకోవాలని పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు సరోత్తమ్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్రతిపాదించారు. జోనల్ వ్యవస్థను కొనసాగించాలని, ఆరు జోన్లుగా విభజించాలని యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి కోరారు. కొత్త జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల వరకు 20 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని పీఆర్టీయూ-తెలంగాణ ప్రతినిధులు కోరారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(టీటీయూ) అధ్యక్ష కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలను ఆరు జోన్లుగా విభజించాలని, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా పోస్టులుగా, ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2 గెజిటెడ్ హెచ్ఎంలను జోనల్ పోస్టులుగా గుర్తించాలని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానందగౌడ్ విజ్ఞప్తి చేశారు. జోన్ల వ్యవస్థ అశాస్త్రీయం: టీఎన్జీవో ప్రస్తుతం ఉన్న జోన్ల వ్యవస్థ శాస్త్రీయంగా లేదని, అందువల్ల ఇక ఈ వ్యవస్థ అక్కర్లేదని టీఎన్జీవో సంఘం ప్రతినిధులు దేవీ ప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, హమీద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘సూపరింటెండెంట్ కేడర్ వరకు పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా భర్తీ చేయాలి. 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్ కేటగిరీకి కేటాయించాలి. ఆపై స్థాయి పోస్టుల్లో 30 శాతం ఓపెన్ కేటగిరీని మాత్రమే నేరుగా నియామకం చేపట్టాలి. మిగతా 70 శాతం ప్రమోషన్ల ద్వారా అన్ని జిల్లాలకు సమాన అవకాశమివ్వాలి. హెచ్‌వోడీ కార్యాలయాల్లో 30 శాతం డెరైక్ట్ రిక్రూట్మెంట్, 70 శాతం ప్రమోషన్లు పాటించాలి. జిల్లా నుంచి హెచ్‌వోడీకి, సెక్రెటేరియట్‌కు, అక్కణ్నుంచి జిల్లాలకు బదిలీల విధానం ఉండాలి. జనాభాకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెంచాలి. కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో ఇప్పుడున్న పోస్టుల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. ఉన్న పోస్టులనే పంపిణీ చేయడం సరి కాదు’’ అని వారు పేర్కొన్నారు.