McKinsey Global Institute
-
8.5 శాతం వృద్ధి లేదంటే భారత్కు కష్టమే!
ముంబై: కోవిడ్–19 సమస్య సమసిపోయిన అనంతరం భారత్లో అవకాశాల సృష్టికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దశాబ్ద కాలంపాటు వార్షికంగా 8 నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి సాధన జరగాల్సిన అవసరం ఉందని మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. భారీ వృద్ధిరేటులేని పరిస్థితిలో దేశంలో ఆదాయాల స్తబ్దత నెలకొంటుందని, జీవన నాణ్యత లోపిస్తుందని విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో భారీ వృద్ధికి తక్షణ చర్యలు అవసరమని తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►దేశంలో ఉత్పాదకత పెరగాలి. ఉపాధి సృష్టి జరగాలి. ఇందుకు రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో పలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ►2013 నుంచి 2018 మధ్య భారత్ వార్షికంగా సగటున 40 లక్షల వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు సృష్టించింది. తాజా పరిస్థితుల ప్రకారం పట్టణీకరణ పెరుగుతోంది. జనాభా పెరుగుదల కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి వార్షికంగా 1.2 కోట్ల వ్యవసాయేతర ఉపాధి అవకాశాల సృష్టి జరగాలి. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) భారత్ జీడీపీ 5% వరకూ క్షీణించే అవకాశం ఉంది. అయితే కోవిడ్ అనంతరం తాజా అవకాశాల సృష్టికి వచ్చే దశాబ్ద కాలంలో భారత్ 8 నుంచి 8.5% వృద్ధి సాధించాల్సిందే. లేదంటే రానున్న దశాబ్ద కాలంలో తీవ్ర సవాళ్లు తప్పవు. ►తయారీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ పరిశ్రమసహా కార్మిక, భూ వ్యవహారాల్లో సంస్కరణలు తక్షణం జరగాలి. అలాగే తక్కువ టారిఫ్లతో వినియోగదారులకు విద్యుత్ సౌకర్యాలను అందించడానికి తగిన ప్రయత్నాలు జరగాలి. ►ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు, ద్రవ్యలోటు కట్టడి, తగిన సరళతర వడ్డీరేట్ల విధానంతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ►మొండిబకాయిల పరిష్కార దిశలో ‘బ్యాడ్బ్యాంక్’ ఏర్పాటు జరగాలి. ►సంస్కరణల పరంగా చూస్తే, 60 శాతం రాష్ట్రాల వైపు నుంచి జరగాల్సి ఉండగా, 40 శాతం కేంద్రం చేపట్టాల్సి ఉంటుంది. -
సగం ఉద్యోగాలకు మనుషులతో పనిలేదు!
వాషింగ్టన్: మనుషులు చేస్తున్న ఉద్యోగాలను రోబోలు ఆక్రమించేస్తున్నాయి. 2055 నాటికి ఇప్పుడు మనుషులు చేస్తున్న పనుల్లో సగం రోబోలే చేయనున్నాయని మెక్కిన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాజకీయ పరిస్థితులు, టెక్నాలజీపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్ వల్ల రోబోల విస్తృత వినియోగానికి మహా అయితే ఇంకో 20 ఏళ్లు ఆలస్యమౌతుందేమో గానీ.. మార్పు మాత్రం ఖాయం అని అధ్యయనానికి నేతృత్వం వహించిన మైఖేల్ చుయ్ వెల్లడించారు. అలాగే.. ఆటోమేషన్ పెరిగిపోవడం మూలంగా ఉత్పాదకత కూడా పెరుగుతుందని మెక్కిన్సీ నివేదిక వెల్లడించింది. రోబోల మూలంగా మానవ తప్పిదాలు, జబ్బుపడటం లాంటి వాటికి ఆస్కారం లేకపోవడంతో.. పనిలో వేగం పెరుగుతుందని, ఇది ఏడాదికి 0.8 నుంచి 1.4 శాతం ఉత్పదకత పెరిగేలా నివేదిక తెలిపింది. అలాగని ఉద్యోగాలను రోబోలు ఆక్రమిస్తున్నాయనగానే నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని మైఖేల్ చుయ్ వెల్లడించారు. అమెరికాలో వ్యవసాయ రంగంలో ఇంతకు ముందు 40 శాతం కార్మికులు పనిచేస్తే.. ఇప్పుడు యంత్రాల వాడకం మూలంగా అది 2 శాతానికి తగ్గిందని, అంతమాత్రాన ఇప్పుడు 30 శాతానికి మించిన నిరుద్యోగం అక్కడ లేదని అన్నారు. నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన తెలిపారు. -
పేరెంట్స్కన్నా పేదోళ్లు ఈ తరం పిల్లలు
న్యూయార్క్: రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అభివృద్ధి చెందిన దేశాల్లో తాత ముత్తాతలు, తల్లిదండ్రలు కన్నా పిల్లలు ఎక్కువగా సంపాదిస్తూ వచ్చారు. 1993 నుంచి 2005 వరకు ఆ తరం ఆదాయాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 98 శాతం మంది ఆదాయం ఏటా పెరుగుతూ వచ్చింది. ఈ ట్రెండ్ కనీసం 25 అభివృద్ధి చెందిన దేశాల్లో స్పష్టంగా కనిపించింది. 2005 నుంచి 2014 సంవత్సరాల మధ్య నవతరం ఆదాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 70 శాతం ఈ తరం ఇళ్లలో తాతముత్తాతలు, తల్లిదండ్రులకన్నా ఆదాయం ఉన్న చోట ఆగిపోవడంగానీ, తగ్గిపోవడంగానీ జరుగుతోంది. ఈ ప్రతికూల పరిణామాన్ని కొంతమేరకైనా తగ్గిద్దామనే ఆలోచనతో కొన్ని దేశాల ప్రభుత్వాలు పన్నులను తగ్గించడమే రాయితీలను కూడా పెంచాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. ఇటలీ లాంటి దేశాల్లో పరిస్థితి మరింత దిగజారింది. 2005 నుంచి 2014 మధ్య ఇటలీలో 97 శాతం మంది ఆదాయం నిలకడగా ఉండడంగానీ, పడిపోవడంగానీ జరగ్గా, ఆదాయం పన్ను రాయితీల అనంతరం వారి శాతం నూటికి నూరు శాతం చేరుకుంది. అమెరికాలో ఈ ట్రెండ్ వైవిధ్యంగా ఉంది. ఇదే కాలానికి 80 శాతం ఈ తరం అమెరికన్ల ఆదాయం నిలకడగా, లేదా పడిపోగా పన్ను రాయితీల వల్ల వారందరి ఆదాయం పెరిగింది. దీనికి కారణం 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం ఒక కారణంకాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యత్యాసం బాగా పెరగడం, అంటే కొంత మంది వద్దనే ఆదాయం ఎక్కువగా పోగవడం మరో కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. లేబర్ మార్కెట్లో వయసుమీరిన వారు కూడా ఎక్కువవడం కూడా కారణమని వారంటున్నారు. ఏదేమైనా ‘మ్యాక్కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్’ విడుదల చేసిన ఈ ఆర్థిక విశ్లేషణలు ఆసక్తిదాయకంగా ఉన్నాయని, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై చర్చించే అవకాశం వచ్చిందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.