
సగం ఉద్యోగాలకు మనుషులతో పనిలేదు!
రాబోయే రోజుల్లో ఇప్పుడు మనుషులు చేస్తున్న పనులను సగం రోబోలు ఆక్రమించనున్నాయి.
వాషింగ్టన్: మనుషులు చేస్తున్న ఉద్యోగాలను రోబోలు ఆక్రమించేస్తున్నాయి. 2055 నాటికి ఇప్పుడు మనుషులు చేస్తున్న పనుల్లో సగం రోబోలే చేయనున్నాయని మెక్‌కిన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాజకీయ పరిస్థితులు, టెక్నాలజీపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్ వల్ల రోబోల విస్తృత వినియోగానికి మహా అయితే ఇంకో 20 ఏళ్లు ఆలస్యమౌతుందేమో గానీ.. మార్పు మాత్రం ఖాయం అని అధ్యయనానికి నేతృత్వం వహించిన మైఖేల్ చుయ్ వెల్లడించారు.
అలాగే.. ఆటోమేషన్ పెరిగిపోవడం మూలంగా ఉత్పాదకత కూడా పెరుగుతుందని మెక్‌కిన్సీ నివేదిక వెల్లడించింది. రోబోల మూలంగా మానవ తప్పిదాలు, జబ్బుపడటం లాంటి వాటికి ఆస్కారం లేకపోవడంతో.. పనిలో వేగం పెరుగుతుందని, ఇది ఏడాదికి 0.8 నుంచి 1.4 శాతం ఉత్పదకత పెరిగేలా నివేదిక తెలిపింది.
అలాగని ఉద్యోగాలను రోబోలు ఆక్రమిస్తున్నాయనగానే నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని మైఖేల్ చుయ్ వెల్లడించారు. అమెరికాలో వ్యవసాయ రంగంలో ఇంతకు ముందు 40 శాతం కార్మికులు పనిచేస్తే.. ఇప్పుడు యంత్రాల వాడకం మూలంగా అది 2 శాతానికి తగ్గిందని, అంతమాత్రాన ఇప్పుడు 30 శాతానికి మించిన నిరుద్యోగం అక్కడ లేదని అన్నారు. నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన తెలిపారు.