Medak - Akkannapet railway line
-
నిరీక్షణ ఫలించిన వేళ.. మెతుకుసీమకు రైలుబండి
మెదక్‌జోన్: ఎన్నో దశాబ్దాలుగా రైలుకోసం ఎదురు చూస్తున్న మెతుకు సీమ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరే సమయం ఆసన్నమైంది. శుక్రవారం రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. దివంగత ఇందిరా గాంధీ ఎంపీగా మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటినుంచే ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఉంది. అందుకోసం చాలా కాలం ఉద్యమాలు కొనసాగాయి. 2012 –13లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఫలితంగా కాస్ట్ షేరింగ్ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ మంజూరైంది. 2014లో శంకుస్థాపన.. మెదక్–అక్కన్నపేట రైల్వేలైన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 17.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి 2012–2013 సంవత్సరంలో రూ.117 కోట్లు అవసరమని అంచనా వేసి ఆమోదం తెలిపారు. 2014లో రైల్వేలైన్ నిర్మాణానికి అప్పటి ఎంపీ విజయశాంతి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనుల ఆలస్యంతో అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. ఇందులో రూ.103 కోట్లు రాష్ట్రం భరించగా, మిగతా నిధులు కేంద్రం విడుదల చేసింది. భూసేకరణకు రాష్ట్ర నిధులు రైల్వేలైన్ కోసం అవసరమయ్యే 392 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైతులకు రూ.16.80 కోట్ల పరిహారం అందజేసింది. రేక్‌పాయింట్‌తో రైతులకు మేలు.. రెండు నెలల క్రితమే మెదక్‌కు రేక్‌పాయింట్ మంజూరు కాగా, మంత్రి హరీశ్‌రావు దానిని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా తరలించుకోవడానికి ఈ పాయింట్ ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవచ్చు. మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు సౌలభ్యం మెదక్ నుంచి రైళ్ల రాకపోకలతో మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. మెదక్, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట, కొల్చారం మండలాలు, కామారెడ్డి జిల్లా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వారు ఈ సేవలు పొందొచ్చు. కలనెరవేరింది... మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు విడుదల చేయడంతోపాటు భూసేకరణ కూడా వేగవంతం చేసి పరిహారం చెల్లించారు. దీంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. ఎట్టకేలకు రైలు రాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. :: పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మూడు రైల్వేస్టేషన్లు.. మెదక్– అక్కన్నపేట మధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వేలైన్ దూరం 17.2 కిలోమీటర్లు. ఈ మధ్యలో మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్‌లలో కొత్తగా రైల్వేస్టేషన్లు నిర్మించారు. ప్రస్తుతానికి మెదక్ టు కాచిగూడ, మెదక్ టు మహబూబ్‌నగర్‌కు ఉదయం, సాయంత్రం వేళ రెండు రైళ్లు నడుపుతారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు. -
ఆ ఊరికి రైలొచ్చిందోచ్!... పట్టాలపై వెళ్తున్న గూడ్స్ రైలు!
రామాయంపేట(మెదక్): మెదక్–అక్కన్నపేట మధ్య మొదటిసారిగా శనివారం గూడ్స్ రైలు నడిచింది. పట్టాల మధ్యన కంకరను గూడ్స్‌లో తరలించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మండలంలోని అక్కన్నపేట స్టేషన్ నుంచి నాలుగైదు కిలోమీటర్ల మేర పట్టాలపై కంకరపరిచారు. గూడ్స్‌లో కంకరను ఇక్కడికి తరలించారు. క్లియరెన్స్ రాకపోవడంతో సదరు గూడ్సును రెండు గంటలపాటు అక్కన్నపేట స్టేషన్లోనే నిలిచి పోయింది. సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే గూడ్స్ కదిలింది. నూతనంగా నిర్మించిన బ్రిడ్జిల వద్ద రైలు నెమ్మదిగా వెళ్లింది. అంతకుముందు రైలు ఎదుట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఈసారైనా పట్టాలెక్కేనా?
మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ పోటీ చేసిన సమయంలో సంగారెడ్డి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాటి నుంచి జిల్లా కేంద్రానికి రైల్వేలైన్ ఏర్పాటు నేతల హామీగానే మిగిలింది. రైల్వేలైన్‌తోపాటు సంగారెడ్డికి ఎంఎంటీఎస్ లైన్ పొడిగింపు హామీలు ఇంత వరకు నెరవేరలేదు. తాజాగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పొడిగింపు అంశం తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా.. జోగిపేట రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత వాసులు మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పటాన్చెరు, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, అక్కన్నపేట మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా లాభం లేకుండా పోయింది. 2012లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్పను కలిసి జోగిపేట రైల్వే లైన్ ఏర్పాటుకు వినతిపత్రం సమర్పించారు. ఆరు నెలల్లో సర్వే చేయిస్తానని హమీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగకపోవడంతో ఈ ప్రాంత వాసులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎంఎంటీఎస్ పనులతో కాస్త ఊరట.. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన పటాన్‌చెరుకు రైలు సౌకర్యం కలగానే మిగిలింది. దివంగత నేత మల్లికార్జున్ కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో పటాన్‌చెరుకు రైల్వే లైను వేయించారు. రెండేళ్ల క్రితం రూ.33 కోట్లతో ఎంఎంటీఎస్ సౌకర్యానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా జరుగుతున్నాయి. రైల్వే లైన్‌కు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా వరకే ఎంఎంటీఎస్‌ను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి మీదుగా పాత రైల్వే లైను ఉన్న కారణంగా ఆర్సీపురం వరకే ఎంఎంటీఎస్‌ను కుదించారు. పటాన్చెరు మీదుగా మెదక్‌కు రైల్వే లైను వేస్తామని గతంలో బడ్జెట్లో చూపారు. కాని నేటికి ఆ సర్వే పనులు జరగలేదు. మియాపూర్ వరకు ఉన్న మెట్రోను లింగంపల్లి వరకైనా పొడిగించాలని స్థానికుల నుంచి డిమాండ్ ఉంది. మెదక్ లైన్‌కు ప్రతిపాదిత నిధుల కోసం.. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన రూ.129.32 కోట్ల నిధులపై మెదక్ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గత మూడు బడ్జెట్లలో ఆశించిన మేర నిధులు మంజూరు కాలేదు. మూడేళ్లుగా పెండింగ్‌లోనే.. జహీరాబాద్ రైల్వేస్టేషన్లో గత మూడేళ్లుగా పలు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా రెండో ఫ్లాట్ ఫారం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి తదితర పనుల జాప్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్లో రైళ్ల క్రాసింగ్ సమయంలో రెండో ఫ్లాట్ ఫారం లేకపోవడంతో రైల్లోకి ఎక్కి, దిగే సమయంలో అవస్థలు పడుతున్నారు. బోధన్-బీదర్ మార్గం కోసం.. బోధన్-బీదర్ రైల్వే లైన్ కోసం నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎంపీ షెట్కార్ చొరవతో బోధన్-బీదర్ మార్గంలో కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి కల్హేర్ మండలం మహదేవుపల్లి మీదుగా లైన్ కోసం రెండేళ్ల క్రితమే సర్వే చేశారు. ఈ లైన్ ఏర్పాటైతే బాన్స్వాడ, జుక్కల్, నారాయణఖేడ్ నియోజక వర్గాల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. సర్వే పూర్తయి నాలుగేళ్లయినా.. సిద్దిపేట నూతన రైల్వేమార్గం కోసం నాలుగేళ్ల క్రితం తాత్కాలిక సర్వే కోసం రూ.40 కోట్లను ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత సిద్దిపేట ఊసెత్తక పోవడం గమనార్హం. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో సిద్దిపేట రైల్వేమార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భూసేకరణ, రాష్ట్ర వాటాలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా రైల్వేలైన్ నిర్మాణం నుంచి ఐదేళ్ల వరకు ఆ మార్గంలో ఎదురయ్యే ఆర్థిక నష్టాలను భరించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సిద్దిపేట లైన్‌కు మోక్షం కలగడం లేదు.