ఎయిర్‌టెల్‌కు 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్
• రూ.14,244 కోట్ల వ్యయం
• ఐడియా సెల్యులార్కు రూ.12,798 కోట్ల విలువైన స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: టెలికం శాఖ నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో భారతీ ఎయిర్టెల్ 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. దీని విలువ రూ.14,244 కోట్లని ఎయిర్టెల్ గురువారం వెల్లడించింది. వచ్చే 20 ఏళ్ల కాలానికి సరిపడా స్పెక్ట్రమ్‌ను తాము సొంతం చేసుకున్నామని, అన్ని సర్కిళ్లలో తాము 3జీ, 4జీ సర్వీసులకు స్పెక్ట్రమ్ కలిగి ఉన్నామని తెలిపింది. ఈ స్పెక్ట్రమ్‌ను 1800, 2100, 2300 మెగాహెర్జ్ బ్యాండ్లలో ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఐడియా సెల్యులార్ సైతం రూ.12,798 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను తాజా వేలంలో సొంతం చేసుకుంది.
మరోవైపు టెలికం శాఖ స్పెక్ట్రమ్ వేలం గురువారంతో ఐదు రోజుకు చేరుకుంది. మొత్తం 26 రౌండ్లకు గాను రూ.66 వేల కోట్ల విలువైన బిడ్లు దాఖల య్యాయి. ప్రభుత్వం 2,354.55 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలను వేలానికి ఉంచగా... ఇప్పటి వరకు 960 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీల స్పెక్ట్రమ్ కోసం బిడ్లు వచ్చినట్టు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుత వేలంలో 4జీ సర్వీసులకు అనుకూలించే 1800, 2300 మెగాహెర్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్ కోసం టెలికం కంపెనీల నుంచి అధిక స్పందన ఉంది.
3జీ/4జీ సర్వీలకు ఉపకరించే 2100 మెగాహెర్జ్, 4జీ సర్వీలకు అనుకూలించే 2500 మెగాహెర్జ్, 2జీ/4జీ సేవలకు వీలు కల్పించే 800 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లకు కూడా స్పందన ఫర్వాలేదు. అత్యంత ఖరీదైన 700 మెగాహెర్జ్తోపాటు 900 మెగాహెర్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌కు కంపెనీలు దూరంగా ఉన్నాయి. వీటి రిజర్వ్ ధర (రూ.4 లక్షల కోట్లు) చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఇది తమకు అనుకూలం కాదని ఎయిర్టెల్ తెలిపింది.