మాజీమంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూత
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మెట్ల సత్యనారాయణ మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1996 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు కేబినెట్లో సత్యనారాయణ ఆరోగ్య మంత్రిగా పని చేశారు. మెట్ల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సంతాపం తెలిపారు. కాగా మెట్ల సత్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటు అని చినరాజప్ప అన్నారు.