Microorganisms
-
స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు
బెంగళూరు: అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్సీ సైంటిస్టులు రూపొందించారు. ఈ మాడ్యులర్ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటి స్పందనల ఆధారంగా మనిషికి ఎదురయ్యే సవాళ్లను పసిగట్టవచ్చు. గగన్‌యాన్ పేరిట త్వరలో స్వదేశీయ అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సాధనంలో ఎల్ఈడీ, ఫొటోడయోడ్ సెన్సార్లతో బ్యాక్టీరియా పెరుగుదలను గమనిస్తారు. కొత్త పరికరం వంద శాతం లీక్ప్రూఫ్ అని, ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది.జీవేతర ప్రయోగాలకు సైతం దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశోధకుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం! -
24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి!
మాస్కో: అవును నిజమే ఆ జీవులు 24 వేల సంవత్సరాల తర్వాత బతికాయి.. డెల్లాయిడ్ రోటిఫెర్స్ అనే సూక్ష్మజీవులు అప్పట్లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మంచు అడుగు భాగాల్లో సుప్తావస్త స్థితిలోకి జారుకున్నాయి. తాజాగా ఆ సూక్ష్మ జీవులు నిద్ర నుంచి మేలుకున్నాయి. 24 వేల ఏళ్ల తర్వాత సంతానం కూడా ఉత్పత్తి చేశాయి. రోటిఫెర్స్ మంచి నీటిలో జీవించే సూక్ష్మజీవులు. గడ్డ కట్టే స్థితి (ఘనీభవ స్థితి)లో దాదాపు పదేళ్లు జీవించి ఉంటాయని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. అయితే వీటి గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు రష్యాలోని సాయిల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లోని సాయిల్ క్రయాలజీ లేబొరేటరీ పరిశోధకులు ముందడుగు వేశారు. ఈశాన్య సైబీరియాలోని అలజేయా నదికి సమీపంలో మంచు నమూనాలను తీసుకుని పరిశోధనలు చేశారు. ఈ మంచు అవక్షేపాల్లో డజన్ల కొద్దీ రోటిఫెర్స్ను వారు గుర్తించారు. ఈ సూక్ష్మ జీవులను లేబొరేటరీకి తీసుకొచ్చి వాటికి ప్రాణం పోశారు. వాటిలో కొన్ని జీవులు ‘పార్థో జెనెసిస్’అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వాటి సంతానానికి జన్మనిచ్చాయి. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి, అవక్షేపాలు ఉన్న లోతును బట్టి ఇవి దాదాపు 24 వేల ఏళ్ల కిందటివిగా కనుగొన్నారు. ఆ సమయంలో సైబీరియాలోని మామ్మత్ జాతి ఏనుగులు సంచరిస్తూ ఉండేవని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త మాలావిన్ వివరించారు. చదవండి: మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..! -
కాదేదీ విద్యుదుత్పత్తికి అనర్హం..!
ఈ కాలంలో విద్యుత్ ప్రాధాన్యం తెలియందెవరికి? దురదృష్టమేమిటంటే... ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఈ సౌకర్యానికి దూరంగానే ఉన్నారు. ఇటువంటి వారికి కూడా చౌకగా విద్యుత్తు వెలుగులు పంచేందుకు ఎన్నో ప్రయత్నాలూ జరుగుతున్నాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ సమస్య పరిష్కారానికి ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. మానవ మూత్రంతోనే చిన్న మోతాదులో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఓ ఫ్యుయెల్ సెల్‌ను అభివృద్ధి చేసింది. ఫ్యుయెల్ సెల్‌లోని సూక్ష్మజీవులు మూత్రాన్ని విడగొట్టి విద్యుత్తును నేరుగా ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో ఫ్యుయెల్‌సెల్‌ను తయారు చేసేందుకు డాలరు (రూ.63) కంటే ఎక్కువ ఖర్చు కాదని ఈ ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లెరోపౌలస్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, అశాంతి చెలరేగుతున్న ప్రాంతాల్లో ఉన్న శరణార్థి శిబిరాల్లో విద్యుత్తు వెలుగులు పండించే లక్ష్యంతో తాము దీన్ని అభివృద్ధి చేశామని, ఒక్కో ఫ్యుయెల్ సెల్‌తో ఎల్ఈడీ బల్బులనూ వెలిగించవచ్చునని ఆయన వివరించారు. -
విత్తనంలోనే ‘సూక్ష్మ’ రక్షక దళం!
మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు కొన్నయితే.. హాని చేసేవి మరికొన్ని. మేలు చేసే సూక్ష్మజీవుల (బాక్టీరియా)తో మొక్కలకు ప్రకృతిసిద్ధమైన అనుబంధం ఉంటుంది. మొక్కలు పోషకాలను గ్రహించడంలోనూ, శత్రు పురుగులను అడ్డుకోవడంలోనూ ఈ సూక్ష్మజీవులు సాయపడుతుంటాయి. వ్యాధుల కారణంగా పండ్లు, కూరగాయలు కలుషితం కాకుండా చూడడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఇంతటి ప్రాణప్రదమైన బ్యాక్టీరియాను మొక్కలు తమ విత్తనాల్లోనే నిక్షిప్తం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. మొలకను తొలి దశ నుంచే పరిరక్షించే రక్షణ కవచం విత్తనంలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట! ఈ బాక్టీరియా రక్షణ కల్పించడంతోపాటు నత్రజనిని వాతావరణం నుంచి స్వీకరించి అంకురానికి నేరుగా అందించగలిగినదైఉంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు ఆరా తీశారంటే.. కొన్ని పండ్లు, కూరగాయలను తిన్న జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశస్థులు కొందరికి ఈ-కొలై వ్యాధి సోకిందట. మొక్కలకు హాని కలిగించే వ్యాధికారక బాక్టీరియాతో కలుషితమైనవి తినడం వల్లే ఈ వ్యాధి సోకిందని తేలింది. ఆహారం ఇలా కలుషితం కాకుండా చూడటం ఎలా అని శోధించే క్రమంలో.. విత్తనాల్లో ఉండే మేలు చేసే బాక్టీరియా గురించి ఆరా తీశారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే బాసిల్లస్ పమిలస్ అనే బాక్టీరియాను విత్తనాల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా పండ్లు, కూరగాయల ద్వారా ఈ-కొలై సోకకుండా జాగ్రత్తపడొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ చొప్పించడం సంగతి ఎలా ఉన్నా.. విత్తనాల్లో ప్రకృతిసిద్ధంగా నిక్షిప్తమయ్యే సూక్ష్మజీవులతో కూడిన రక్షణ వ్యవస్థ గురించి మాత్రం స్పష్టమైంది!