విత్తనంలోనే ‘సూక్ష్మ’ రక్షక దళం!
మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు కొన్నయితే.. హాని చేసేవి మరికొన్ని. మేలు చేసే సూక్ష్మజీవుల (బాక్టీరియా)తో మొక్కలకు ప్రకృతిసిద్ధమైన అనుబంధం ఉంటుంది. మొక్కలు పోషకాలను గ్రహించడంలోనూ, శత్రు పురుగులను అడ్డుకోవడంలోనూ ఈ సూక్ష్మజీవులు సాయపడుతుంటాయి. వ్యాధుల కారణంగా పండ్లు, కూరగాయలు కలుషితం కాకుండా చూడడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఇంతటి ప్రాణప్రదమైన బ్యాక్టీరియాను మొక్కలు తమ విత్తనాల్లోనే నిక్షిప్తం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. మొలకను తొలి దశ నుంచే పరిరక్షించే రక్షణ కవచం విత్తనంలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట! ఈ బాక్టీరియా రక్షణ కల్పించడంతోపాటు నత్రజనిని వాతావరణం నుంచి స్వీకరించి అంకురానికి నేరుగా అందించగలిగినదైఉంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు ఆరా తీశారంటే..
కొన్ని పండ్లు, కూరగాయలను తిన్న జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశస్థులు కొందరికి ఈ-కొలై వ్యాధి సోకిందట. మొక్కలకు హాని కలిగించే వ్యాధికారక బాక్టీరియాతో కలుషితమైనవి తినడం వల్లే ఈ వ్యాధి సోకిందని తేలింది. ఆహారం ఇలా కలుషితం కాకుండా చూడటం ఎలా అని శోధించే క్రమంలో.. విత్తనాల్లో ఉండే మేలు చేసే బాక్టీరియా గురించి ఆరా తీశారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే బాసిల్లస్ పమిలస్ అనే బాక్టీరియాను విత్తనాల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా పండ్లు, కూరగాయల ద్వారా ఈ-కొలై సోకకుండా జాగ్రత్తపడొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ చొప్పించడం సంగతి ఎలా ఉన్నా.. విత్తనాల్లో ప్రకృతిసిద్ధంగా నిక్షిప్తమయ్యే సూక్ష్మజీవులతో కూడిన రక్షణ వ్యవస్థ గురించి మాత్రం స్పష్టమైంది!