వేలాదిగా కశ్మీర్‌ను వీడుతున్న వలసకూలీలు
జమ్మూ: ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్‌లోని వలసకూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వస్థలాలకు పరుగులు తీస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఉగ్రవాదులు మైనారిటీలను, వలస కూలీలను లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా దాడులు కొనసాగిస్తుండటంతో ఈనెలలో ఇప్పటిదాకా అమాయకులైన 11 మంది పౌరులు మృతి చెందారు.
ఇది భయోత్పాత వాతావరణాన్ని సృష్టించింది. వలసకూలీలు మంగళవారం వేలాదిగా జమ్మూలోని రైల్వేస్టేషన్లకు తరలివచ్చారు. జమ్మూ, ఉదంపూర్‌లలో ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రతను పెంచారు. ప్రతియేటా మూడు నుంచి నాలుగు లక్షల మంది వలస కూలీలు పనిని వెతుక్కుంటూ కశ్మీర్ లోయకు వస్తారు. మార్చిలో వచ్చి నవంబర్‌లో శీతాకాలం ఆరంభంలో వెళ్లిపోతారు.
రాతిపని, వడ్రంగి, వెల్డింగ్, వ్యవసాయ కూలీలుగా వీరు పనిచేస్తారు. ఆదివారం కూల్గామ్ జిల్లాలో వలస కూలీల శిబిరాల్లోకి వచ్చి ఉగ్రవాదులు ఇద్దరు కార్మికులను కాల్చి చంపడంతో... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు భీతిల్లిపోయారు. ఇక్కడుంటే ఏ క్షణం ఎటువైపు నుంచి కాల్పులు జరుగుతాయో, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందోననే భయంతో నిర్ణీత సమయానికి కంటే ముందే కశ్మీర్‌ను వదిలి స్వస్థలాలకు వెళ్లి పోతున్నారు.
పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్ షా
న్యూఢిల్లీ: కశ్మీర్లో తాజా పరిస్థితులను వివరించడానికి హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భద్రతను మెరుగుపర్చడానికి కశ్మీర్ అధికార యంత్రాంగం, కేంద్ర హోంశాఖ తీసుకున్న చర్యలను వివరించారు. కశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టిస్తున్న భయోత్పాత వాతావరణం, ఫలితంగా కూలీలు పెద్దసంఖ్యలో స్వస్థలాలకు వెళ్లిపోతుండటం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. కాగా ఈనెల 23 నుంచి 25 వరకు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. భద్రతపై సమీక్షిస్తారు.
చదవండి: ఉత్తరాఖండ్‌లో జలవిలయం