సముద్రంలో చిక్కుకున్న 4,400 మందిని రక్షించారు
రోమ్: లిబియా నుంచి సముద్ర మార్గం ద్వారా యూరప్ దేశాలకు వెళ్తూ ప్రమాదంలో చిక్కుకుపోయిన 4,400 మందిని ఇటలీ తీర రక్షక దళాలు కాపాడాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని తాము సమన్వయ కృషితో రక్షించినట్టు ఇటలీ రక్షణ దళం పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా లిబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా వేలాదిమంది ప్రజలు యూరోపియన్ తీరప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరందరూ చిన్న చేపల పడవలలో గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూ ప్రమాదంలో చిక్కుకుంటున్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షితంగా యూరప్ దక్షిణ తీర ప్రాంతానికి చేరేలా చర్యలు తీసుకున్నట్టు ఇటలీ రక్షణ దళం తెలిపింది. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఇటలీ తీర రక్షణ దళం, నౌకాదళం, సరిహద్దు పోలీసులు, నార్వే నౌకాదళం, ఐరీష్ నౌకాదళం యూరోపియన్ తీరప్రాంతాల వద్ద మోహరించాయి. శాటిలైట్ ఫోన్లతో ఘటన స్థలాల వద్ద ఇటాలీ ఆర్మీ విమానాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.