Mine accident
-
ఇరాన్ గనిలో పేలుడు.. 51 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ తూర్పు ప్రాంతంలోని దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్‌లోని టబాస్ గనిలో భారీ ప్రమాదం సంభవించింది. మిథేన్ గ్యాస్ వెలువడటంతో జరిగిన పేలుడులో 51 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 20 మంది గాయపడ్డారు. మరికొందరి జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో 70 మందికి పైగా 700 మీటర్ల లోతులో పనిచేస్తున్నారని చెప్పారు. రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారులను ఆదేశించారు. -
Jharkhand: అక్రమ బొగ్గు గని కూలి ఘోరం
రాంచీ: జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఇవాళ ఘోరం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో భారత్ కోకింగ్‌కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) భౌరా కాలరీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భౌరా పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సింద్రీ డీఎస్సీ అభిశేక్ కుమా మాట్లాడుతూ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. గనిలోకి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు సత్వరమే స్పందించి ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని, ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు తెలిపారు. -
Turkey: బొగ్గు గనిలో భారీ పేలుడు.. కార్మికుల దుర్మరణం
అంకారా: టర్కీ ఉత్తర భాగంలో ఘోర ప్రమాదం సంభవించింది. అమస్రా వద్ద ఓ బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి పాతిక మందికి పైగా మరణించారు. డజన్ల మంది ఇంకా గనిలోనే చిక్కుకుని పోయారు. వాళ్లంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. శుక్రవారం సూర్యాస్తమయం కంటే కాస్త ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. వందల మీటర్ల భూగర్భంలో డజన్ల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో 110 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే కొందరు కార్మికులు వాళ్లంతట వాళ్లుగా బయటకు వచ్చిన దృశ్యాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. దాదాపు 50 మంది కార్మికులు భూమికి దిగువన 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాలలో చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెఉలస్తోంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం నుంచి చర్యలు మొదలుకానున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని.. శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో.. 2014లో టర్కీ పశ్చిమ పట్టణం సోమాలో సంభవించిన ఎయ్నజ్ బొగ్గు గని ప్రమాదంలో 310 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. Update- #Rescue operation underway.. At least 25 killed and dozens trapped underground after massive blast tears through coal mine in #Turkey. Around 110 workers were in the mine at the time of the #explosion.#bartin #bartinamasra #MineBlast #News pic.twitter.com/g3mwAgfmkQ — Chaudhary Parvez (@ChaudharyParvez) October 15, 2022 -
గని ప్రమాదంలో కళ్లు కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరు ఒక కంటి చూపు కోల్పోయారు. గురువారం జరిగిన ప్రమాదంలో కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, శ్రీనివాస్‌లు తీవ్రగాయాలపాలవ్వడంతో హైదరాబాద్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వారిలో రామకృష్ణ, రాజశేఖర్‌లకు ఒక్కో కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు సింగరేణి అధికారులు చెప్పారు. కాగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించి, కంటిచూపు వచ్చేలా చూడాలని వైద్యులను కోరారు. -
పాక్‌లో ఘోర గని ప్రమాదం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ప్రఖ్యాతిగాంచిన జియారత్ ఘర్ పర్వతప్రాంత పాలరాయి గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గని కార్మికుల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పర్వతపాదం సమీపంలోని సఫీ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పాలరాయి గనిలోని ఆరు యూనిట్లు కుప్పకూలడంతో 12 మంది కార్మికులు ఘటనాస్థలిలో మరణించారు. కూలిన గని శిథిలాల కింద దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండే అవకాశముందని పోలీసు అధికారి తారిఖ్ హబీబ్ చెప్పారు. ప్రమాదం జరిగే సమయానికి అక్కడ దాదాపు 45 మంది కార్మికులు పనిచేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ ఇఫ్తికార్ చెప్పారు. ఘటనాస్థలిలో తొమ్మిది మందిని కాపాడారు. చదవండి: పాక్ చెరలో 19మంది భారతీయులు -
'గని ప్రమాదాలపై విచారణ జరిపించాలి'
- మావోయిస్టు కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ లేఖ - అధికారుల నిర్లక్ష్యం వల్లే శాంతిఖని గని ప్రమాదం - కార్మికుల హక్కులను తాకట్టుపెట్టిన టీఆర్ఎస్, టీబీజీకేఎస్ బెల్లంపల్లి : సింగరేణిలో జరుగుతున్న బొగ్గుగని ప్రమాదాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పోస్టులో ఒక ప్రకటన పంపారు. ఈ లేఖలో సింగరేణి, రక్షణ అధికారులు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో సంస్కరణల పర్వం కొనసాగుతోందని, కమీషన్లకు కక్కుర్తి పడుతున్న యాజమాన్యం, అధికారులు మోడ్రన్ టెక్నాలజీ, ఆధునీకరణ, యాంత్రీకరణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి విధానాలకు తిలోదకాలిచ్చి కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే శాంతిఖని గనిలో ప్రమాదం జరిగి పోల్సాని హన్మంతరావు, గాలిపల్లి పోశం, రమావత్ కిష్టయ్య దుర్మరణం చెందారని తెలిపారు. గనిలోని 52 లెవల్ 1 డీప్ జంక్షన్లో ప్రమాదం పొంచి ఉందని కార్మికులు నెల రోజుల ముందు నుంచి చెబుతున్నా రక్షణ అధికారులు, గని మేనేజర్ నిర్లక్ష్యం చేయడం వల్లే కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అధికారులకు కంటిన్యూయస్ మైనర్ (సీఎంఆర్) యంత్రంపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర గనుల రక్షణ శాఖ అధికారులు పర్యవేక్షణ పేరుతో విహారయాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గని స్థాయిలో సేఫ్టీ కమిటీల్లో ఉన్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఫిట్ కమిటీల నాయకులు యాజమాన్యం ఇచ్చే విందులకు, ఉచిత మస్టర్లకు వెంపర్లాడుతున్నారే తప్ప కార్మికుల తరఫున గట్టిగా పోరాటం లేదని అన్నారు. టీఆర్ఎస్, టీబీజీకేఎస్‌లు కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించి హక్కులను యాజమాన్యానికి తాకట్టు పెట్టాయని పేర్కొన్నారు. రోడ్డు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రూ. 5 లక్షలు, 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే ప్రభుత్వాలు, వేల కోట్ల లాభాలు తెచ్చిపెడుతున్న కార్మికులకు కేవలం రూ.25 లక్షలు ప్రకటించడం దుర్మార్గమని తెలిపారు. ఓఎన్జీసీ తరహాలో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభాత్ డిమాండ్ చేశారు. గత పాలక ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోందని, తెలంగాణలో ఓసీపీలు ఉండవన్న నోటితోనే అడ్డూ అదుపు లేకుండా అనుమతులు ఇస్తోందని విమర్శించారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేనిపక్షంలో కార్మిక, ప్రజా ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
బొగ్గు గని కూలి 19 మంది మృతి
బీజింగ్ : బొగ్గు గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ ఘటన ఉత్తర చైనాలోని షాంజ్జీ ప్రావిన్స్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా గురువారం వెల్లడించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో129 మంది ఉన్నారని పేర్కొంది. మిగిలిన వారంతా సురక్షితంగా బయటకు వచ్చినట్లు తెలిపింది. -
కూలిన బొగ్గు గని : నలుగురు మృతి
మాస్కో : ఉత్తర రష్యా కొమి ప్రాంతంలోని సెవర్నియా బొగ్గు గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో 26 మంది గల్లంతు అయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. శిథిలాల నుంచి మాత్రం ఎనిమిది మందిని రక్షించి...పైకి తీసుకువచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 110 మంది పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని పేర్కొన్నారు. గనిలో ఒత్తిడి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై వార్త తెలిసిన వెంటనే అత్యవసర సేవల మంత్రి వాద్లమిర్ పుచ్కొవ్ ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా రష్యాతోపాటు సోవియేట్ దేశాల్లోని బొగ్గు గనులు కుప్పకూలడం సాధరణమైన విషయమే. ఈ ప్రమాదం గురువారం చోటు చేసుకుంది. -
బొగ్గు గని పై కప్పు కూలి ఇద్దరి మృతి
మంచిర్యాల:ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే-7 న్యూటెక్ గనిలో బొగ్గు పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రాం నర్సయ్య(54) అనే కార్మికుడితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
ఆరని కన్నీటి తడి
గోదావరిఖని: జీడీకే-7ఎల్ఈపీ ఘోర దుర్ఘటనకు సోమవారంతో పదకొండేళ్లు నిండాయి. ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న 17 మంది కార్మికులు జలసమాధి అయ్యారు. 2003 జూన్ 16న ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ జరిగి పదేళ్లు గడిచాయి. బొగ్గు వెలికితీసిన స్థలంలో ఇసుక నింపకపోవడం వల్లనే అందులో నీరు చేరిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయినప్పటికీ నాడు దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఏటా జూన్ 16న మృతి చెందిన కార్మికులను స్మరించుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప చేసిందేమీ లేదని కార్మికులు అంటున్నారు. కార్మిక సంఘాలు గట్టి పట్టుతో డిమాండ్ చేయలేకపోవడం వల్లనే బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకపోవడంతో పదకొండేళ్లుగా వారి కన్నీటి తడి ఆరడం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే.. 2003 జూన్ 16న ఉదయం షిఫ్టులో విధులకు వెళ్లిన 17 మంది కార్మికులు విధుల్లో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటికే గనిలోని మూడో లెవల్లో ఊట నుంచి ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా ప్రాణభయంతో తప్పించుకునే యత్నం చేశారు. కానీ అప్పటికే నీటి ప్రవాహం పెరగడంతో అందులో చిక్కుకున్నారు. హెడ్ ఓవర్‌మెన్ కైరి మల్లయ్య, ఎలక్ట్రీషియన్ రాపెల్లి మల్లయ్య, ఫిట్టర్ కుంట సమ్మయ్య, టింబర్‌మెన్ పుల్యాల నర్సయ్య, జనరల్ మజ్దూర్లు ఇజ్జగిరి రాంచందర్, దాసరి సత్యనారాయణ, ఆరెళ్లి వెంకటి, బదిలీ ఫిల్లర్లు రాగం బాపు, కె.వెంకటస్వామి, కుక్కల కొమురయ్య, కేవీ.శ్రీనివాస్, తాళ్ల తిరుపతి, తాటికొండ శ్రీనివాస్, కోల్ఫిల్లర్లు కె.గోపాల్‌రెడ్డి, పులి వెంకటి, లెక్కల బుచ్చయ్య, ట్రామర్ తాడూరి రాయమల్లు జలసమాధి అయ్యారు. నీటిలో చిక్కుకోవడంతో శరీరాలు ఉబ్బి కనీసం మృతదేహాలను చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. విచారణ జరిగినా...చర్యలు శూన్యం ఈ ఘటనపై అప్పటి హైకోర్టు జడ్జి జస్టిస్ బిలాల్నజ్కీ, రిటైర్డ్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఏకే.రుద్రా, ట్రేడ్ యూనియన్ నాయకుడు కమలేష్ సహాయ్‌తో కూడిన కమిటీ విచారణ చేసింది. సుమారు ఎనిమిది పర్యాయాలు గోదావరిఖని సింగరేణి బి-గెస్ట్‌హౌస్‌లో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతోపాటు డీజీఎంఎస్ అధికారులు గోదావరిఖని మున్సిఫ్ కోర్టులో సింగరేణి అధికారులపై దావా వేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఈ సంఘటన జరిగిన తర్వాత గని ఏజెంట్ నాగయ్య, మేనేజర్ రవితోపాటు సేఫ్టీ ఆఫీసర్, సర్వే ఆఫీసర్లను బాధ్యులు చేస్తు యాజమాన్యం కొంతకాలం వీరిని సస్పెన్షన్‌లో ఉంచింది. తర్వాత వీరందరికీ పదోన్నతులను కల్పించింది. 17 మంది కార్మికులు చనిపోయిన నేపథ్యంలో సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గనిని సందర్శించారు. ఆ సమయంలో ఆయనను అడ్డుకుని ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో ఆయన రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ ఉన్నప్పటికీ గుర్తింపు సంఘాలు కూడా ప్రేక్షకపాత్ర వహించాయి. విచారణ పూర్తి చేసినప్పటికీ దాన్ని బహిర్గత పరచాలని ఏ సంఘం కూడా గట్టిగా పట్టుపట్టకపోవడం విచారకరం. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన నేపథ్యంలో నూతన ప్రభుత్వం మృతుల కుటుంబాల సంక్షేమానికి పాటుపడాలని కార్మికవర్గం కోరుతోంది. నేడు గని వద్ద సంస్మరణ సభ జీడీకే-7 ఎల్ఈపీ గని ప్రమాదంలో మృతిచెందిన 17 మంది కార్మికులు, సూపర్వైజర్లను స్మరిస్తూ సోమవారం ఉదయం 7 గంటలకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి గని అధికారులతోపాటు కార్మిక సంఘాల నాయకులు, మృతిచెందిన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు,స్నేహితులు హాజరుకానున్నారు.