- మావోయిస్టు కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ లేఖ
- అధికారుల నిర్లక్ష్యం వల్లే శాంతిఖని గని ప్రమాదం
- కార్మికుల హక్కులను తాకట్టుపెట్టిన టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్
బెల్లంపల్లి : సింగరేణిలో జరుగుతున్న బొగ్గుగని ప్రమాదాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పోస్టులో ఒక ప్రకటన పంపారు. ఈ లేఖలో సింగరేణి, రక్షణ అధికారులు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో సంస్కరణల పర్వం కొనసాగుతోందని, కమీషన్లకు కక్కుర్తి పడుతున్న యాజమాన్యం, అధికారులు మోడ్రన్ టెక్నాలజీ, ఆధునీకరణ, యాంత్రీకరణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి విధానాలకు తిలోదకాలిచ్చి కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే శాంతిఖని గనిలో ప్రమాదం జరిగి పోల్సాని హన్మంతరావు, గాలిపల్లి పోశం, రమావత్ కిష్టయ్య దుర్మరణం చెందారని తెలిపారు. గనిలోని 52 లెవల్ 1 డీప్ జంక్షన్‌లో ప్రమాదం పొంచి ఉందని కార్మికులు నెల రోజుల ముందు నుంచి చెబుతున్నా రక్షణ అధికారులు, గని మేనేజర్ నిర్లక్ష్యం చేయడం వల్లే కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
అధికారులకు కంటిన్యూయస్ మైనర్ (సీఎంఆర్) యంత్రంపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర గనుల రక్షణ శాఖ అధికారులు పర్యవేక్షణ పేరుతో విహారయాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గని స్థాయిలో సేఫ్టీ కమిటీల్లో ఉన్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఫిట్ కమిటీల నాయకులు యాజమాన్యం ఇచ్చే విందులకు, ఉచిత మస్టర్లకు వెంపర్లాడుతున్నారే తప్ప కార్మికుల తరఫున గట్టిగా పోరాటం లేదని అన్నారు.
టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌లు కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించి హక్కులను యాజమాన్యానికి తాకట్టు పెట్టాయని పేర్కొన్నారు. రోడ్డు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రూ. 5 లక్షలు, 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే ప్రభుత్వాలు, వేల కోట్ల లాభాలు తెచ్చిపెడుతున్న కార్మికులకు కేవలం రూ.25 లక్షలు ప్రకటించడం దుర్మార్గమని తెలిపారు.
ఓఎన్‌జీసీ తరహాలో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభాత్ డిమాండ్ చేశారు. గత పాలక ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే టీఆర్‌ఎస్ అవలంభిస్తోందని, తెలంగాణలో ఓసీపీలు ఉండవన్న నోటితోనే అడ్డూ అదుపు లేకుండా అనుమతులు ఇస్తోందని విమర్శించారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేనిపక్షంలో కార్మిక, ప్రజా ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.