mineral
-
ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
సాధారణంగా మనం చూసే భవనాలన్నీ ఇసుక, సిమెంట్ కలిపిన ఆర్సీసీ కాంక్రీట్ లేదా మైవాన్ అల్యూమీనియంతో ఉంటాయి. పైకప్పు, గోడలు అన్నీ వీటితోనే నిర్మిస్తుంటారు. దీంతో ఈ ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా గోడలు, ప్లాస్టరింగ్‌లకు అయ్యే ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖనిజ జిప్సం అందుబాటులోకి వచ్చేసింది. ఇసుక, సిమెంట్ అవసరం లేకుండానే నేరుగా ఇటుకల మీదపూతలాగే పూయడమే మినరల్ జిప్సం పన్నింగ్ ప్రత్యేకత. పైగా దీనికి చుక్క నీటితో క్యూరింగ్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సం ఇళ్లలో గది ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో అపారమైన నదుల కారణంగా ఇసుక లభ్యత ఎక్కువ. దీన్ని ఆసరా చేసుకొని బ్రిటీష్ రాజులు మన దేశంలో సిమెంట్ కర్మాగారాలు నెలకొల్పి, అందుబాటులో ఉన్న ఇసుకను కలిపి నిర్మాణ రంగంలో వినియోగించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా నది ఇసుక కొరత ఏర్పడటంతో రోబో శాండ్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి పట్టుత్వం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జిప్సం వినియోగం పెరిగింది. భూగర్భంలో బంగారం, బొగ్గు, ఇనుము వంటి గనులలాగే జిప్సం కూడా ఖనిజమే. మన దేశంలో రాజస్థాన్‌లోని బికానెర్, కశ్మీర్ వ్యాలీలో మాత్రమే మినరల్ జిప్సం గనులు ఉన్నాయి. మార్కెట్లో కాంపోజిట్, మినరల్ జిప్సం అని రెండు రకాలు ఉంటాయి. సిమెంట్ పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే తెల్లటి పదార్థాన్ని కాంపోజిట్ జిప్సం అంటారు. దీన్ని ఇటుక, చాక్‌పీస్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మినరల్ జిప్సం భూగర్భంలో నుంచి వెలికితీసే గని. దీని రసాయన నామం కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ (సీఏఎస్‌ఓ4).అంతర్గత గోడలు, సీలింగ్లకే.. ఖనిజ జిప్సంకు నిరంతరం నీరు తాకితే తేమ కారణంగా పాడైపోతాయి. అందుకే దీన్ని ఇంటి లోపల అంతర్గత గోడలు, సీలింగ్‌లకు మాత్రమే వినియోగిస్తారు. బయట గోడలకు, బాత్రూమ్, టాయిలెట్స్ గోడలకు వినియోగించరు. ఆర్సీసీ కాంక్రీట్‌ను తాపీతో వేయాలి లేకపోతే చేతులు, కాళ్లకు పొక్కులు వస్తాయి. అదే మినరల్ జిప్సంను నేరుగా చేతులతో కలుపుతూ గోడలకు పూత లాగా పూస్తారు. ఈ గోడలు చాలా తేలికగా ఉండటంతో ఇంటి శ్లాబ్ మీద బరువు పెద్దగా పడదు. మినరల్ జిప్సంను నివాస, వాణిజ్య, కార్యాలయ అన్ని రకాల భవన సముదాయాల నిర్మాణంలో వినియోగిస్తారు.ఎంత ఖర్చు అవుతుందంటే.. ఆర్సీసీ కాంక్రీట్‌తో చదరపు అడుగు గోడ ప్లాస్టరింగ్ రూ.50–55 ఖర్చు అవుతుంది. అదే జిప్సం పన్నింగ్కు అయితే రూ.35–40తో అయిపోతుంది. అలాగే చ.అ. కాంక్రీట్ గోడ క్యూరింగ్‌కు 7 లీటర్ల నీళ్లు అవసరం కాగా.. కనిష్టంగా ఏడు రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక, జిప్సం గోడలకు క్యూరింగే అవసరం లేదు. ఉదాహరణకు.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అంతర్గత గోడలు నాలుగు వైపులా కలిపితే 5 వేల చ.అ. ఉంటాయి. వీటి క్యూరింగ్‌కు 25 వేల నీళ్లు అవసరం అవుతాయి. ఈలెక్కన ఖనిజ జిప్సంతో నీళ్లు, సమయం, డబ్బు ఆదా అవుతుందన్నమాట.ఇళ్లంతా చల్లగా.. మినరల్ జిప్సంకు వేడి, అగ్ని, ధ్వనిని నిరోధించే శక్తి ఉంటుంది. ఇందులోని థర్మల్ ప్రూఫ్ కారణంగా బయటితో పోలిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఖనిజ జిప్సంతో ఉండే ఇంట్లో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సంకు అగ్ని ప్రమాదాలను తట్టుకుంటాయి. నింతరంగా మూడు గంటల పాటు అగ్నిని నిరోధిస్తాయి. ఖనిజ జిప్సంతో కట్టే గోడలు చాలా మృదువుగా, పాలవలే తెల్లగా ఉంటాయి. దీంతో చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. -
రాష్ట్రాలకే మైనింగ్ ట్యాక్స్ రాయల్టీ: సుప్రీం
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే మైనింగ్ పై రాయల్టీ పొందే హక్కు విషయమై సుప్రీంకోర్టు నేడు(గురువారం) చారిత్రక తీర్పు వెలువరించింది. ఖనిజాలు కలిగిన భూములపై రాయల్టీని విధించే హక్కు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందన్న వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.వివిధ రాష్ట్రాల్లో మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేసుకునే హక్కు కేంద్ర, రాష్ట్రాల్లో ఎవరికి ఉందన్న అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టులో సీజే డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం 8:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో ఖనిజ సంపద అధికంగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలగబోతోంది.రాయల్టీ అనేది పన్నుతో సమానమైనది కాదని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. అయితే ఖనిజ హక్కులపై పన్ను విధించే విషయంలో ఆయా రాష్ట్రాలకు అనుమతి కల్పిస్తే వివిధ రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని అన్నారు. ఇది మార్కెట్ దోపిడీకి దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టంలో మైనింగ్ పై రాష్ట్రాలు పన్ను విధించకుండా అడ్డుకునే అధికారం పార్లమెంట్ కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
ఖనిజం అక్రమ రవాణా
ఆలస్యంగా వెలుగుచూసిన అక్రమార్కుల దోపిడీ బొల్లాపల్లి: ముడి ఖనిజం అక్రమ తరలింపు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్లవిలువ జేసే లెడ్ జింక్ ముడి సరుకు అక్రమ రవాణాకు అక్రమార్కులు నడుం బిగించారు. పాలకపార్టీ నాయకుల అండదండలతో స్థానిక నాయకులు ఈ అక్రమ దోపిడీకి శ్రీకారం చుట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో బండ్లమోటు మైనింగ్ 1965లో ప్రారంభమైంది. అనంతరం నష్టాబాటలో ఉన్న కంపెనీ 2002లో మూతపడింది. అప్పట్లో కొన్ని వేల టన్నులు ముడి సరుకు మైనింగ్ పక్కనే పడిఉంది. వేల కోట్ల విలువచేసే ఈ రాయి అక్రమ రవాణాపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. 2013తో మైనింగ్ లీజ్ రద్దవడంతో ఈ ప్రాంతమంతా అటవీ శాఖ అదీనంలోకి వచ్చింది. టిడిపి అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి కొందరు వచ్చి పరిశీలించి వెళ్తున్నారని స్థానికులు అంటున్నారు. గత రెండు నెలలుగా క్వారీ ప్రాంతం నుంచి రెండు ధపాలుగా ముడి సరుకు అక్రమంగా తరలివెళ్లిందని, ఈ సరుకు అక్రమ తరలింపు అటవీ శాఖాధికారుల కనుసన్నల్లో జరిగిందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. టిప్పర్లను అడ్డుకున్న యువకులు.. గురువారం తెల్లవారుజామున ఆరు టిప్పర్లు, పెద్ద ప్రోక్లెయినర్ బండ్లమోటు మైనింగ్‌లోకి ప్రవేశించి అక్రమంగా తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకులు గమనించి టిప్ఫర్లును అడ్డుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు సిబ్బంది సంఘటన ప్రాంతానికి చెరుకొని వాహనాల వివరాలు సేకరించారు. నిబందనల ప్రకారం అర్ధరాత్రివేళ అటవీ సంపదను కొల్లగొడుతున్న వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో వాహనాలు సంఘటన ప్రాంతం నుంచి వెళ్లిపోవడం, పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమంగా తరలించిన ముడిసరుకు పక్కనే ఉన్న రేమిడిచర్ల గ్రామానికి సమీపంలోని దంతెలకుంట పోలాల్లో నిలువచేశారు. సుమారు వంద టన్నుల ముడిసరుకు అక్రమంగా తరలివెళ్లినట్లు తెలుస్తుంది. టన్ను ముడి సరుకు విలువ సుమారు లక్షన్నర వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. స్థానిక యువకులు అడ్డగించడంతో ఈవిషయం వెలుగుచూసింది. మూసివేసిన మైనింగ్ నుంచి సరుకు రవాణాకు దట్టంగా మెలచిన అటవీ ప్రాంతంలోని కలపను నరికివేసి దారి ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ తరలింపు వెనుక పెద్దల హస్తం..? ఉన్నత స్థాయి పాలనా యంత్రాంగం అండదండలతో అక్రమంగా తరలివెళ్తోందని, ముడిసరుకును కడప జిల్లాకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు వాపోతున్నారు. కోట్ల అటవీ సంపదను అక్రమార్కుల నుంచి కాపాడాలని బండ్లమోటు గ్రామస్తులు కోరుతున్నారు.