minimum salaries
-
నర్సింగ్ విద్యార్థినుల ధర్నా
గుంటూరు మెడికల్: 2016వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నర్సింగ్ అధికారులకు ప్రతి నెల రూ.20 వేల కనీస వేతనాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం గుంటూరు జీజీహెచ్ శాఖ నేతలు డిమాండ్ చేశారు. కర్నూలులో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా జీజీహెచ్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నర్సింగ్ వ్యవస్థలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ నర్సింగ్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్టాఫ్ నర్సు అనే పదాన్ని తీసివేసి నర్సింగ్ అధికారి హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బందిని తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ విద్యార్థులకు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్టైఫండ్ పెంచాలన్నారు. నిరసన కార్యక్రమంలో నర్సుల సంఘం అధ్యక్షురాలు కావూరి అనూరాధ సూర్యకుమారి, సెక్రటరీ ఎం.ఆశాలత, నర్సింగ్ సూపరింటెండెంట్ కె.పుష్పావతి, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, నర్సుల సంఘం నేతలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
కత్తి పక్కన పెట్టారు
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైలం దేవస్థాంనంలో క్షురకులు శుక్రవారం విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో పాతాళగంగ దారిలో ఉన్న కేశఖండనశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళ్యాణ కట్ట సంఘం అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర దేవాలయాల కేశఖండనశాల జేఏసీ పిలుపు మేరకు ధర్నా చేశామన్నారు. ఈనెల 1న విజయవాడకు చెందిన ఓలేటి రాఘవులు కేశఖండన చేసిన అనంతరం ఓ భక్తుడి నుంచి రూ.10 తీసుకున్నందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు పెంచలయ్య దుర్భాషలాడుతూ దాడి చేయడానికి నిరసనగా విధులు బహిష్కరించామన్నారు. అలాగే తమకు నెలకు రూ.15వేలు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరగా పరిష్కరిస్తామని చెప్పిన విజయవాడ ధర్మకర్త మండలి అధ్యక్షుడు గౌరంగ బాబు, ఎంఎల్సీ బుద్దా వెంకన్న నెరవేర్చకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 14వ తేదీ వరకు గడువు ఇచ్చినా పాలకుల్లో చలనం లేకపోవడంతో కత్తి పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. శ్రీశైల దేవస్థానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. క్షేత్రంలో పనిచేసే క్షురకులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే క్షురకుల సంక్షేమ నిధి నుంచి సహాయం చేస్తామని అధికారులు చెప్పినా అమలు కావడం లేదని వాపోయారు. కళ్యాణకట్టలో పనిచేసే చెన్నయ్యకు కొన్ని రోజుల క్రితం కాలు విరిగిపోయినా నేటి వరకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో అందని కనీస వేతనాలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడం లేదని.. కార్మికుల వేతనాలను ఎప్పటికప్పుడు సవరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కనీస వేతనాల విషయంలో కార్మికుల హక్కుల ఉల్లంఘన జరుగుతు న్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అడ్వైజరీ బోర్డు ప్రతిపాదనల ప్రకారం వేతనాలను సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్యదర్శి పావువెల్లి జీవన్‌రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందని కనీస వేతనాలు.. కార్మికుల చేత బండ చాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యాలు.. వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ చట్టం కాగితాలకే పరిమితమైందని..గరిష్టంగా ఐదేళ్లు దాటకుండా ఎప్పటికప్పుడు కనీస వేతనాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
కనీస వేతనాలు చెల్లించాలి : ఆశ వర్కర్లు
రాంగోపాల్‌పేట్: పదేళ్లుగా ఎన్నో సమస్యల మధ్య పనిచేస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పీ జయలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు సీఐటీయూ, ఆషా సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులను ఆశ వర్కర్లతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో 25 వేల మంది ఆశ వర్కర్లు పదేళ్లుగా పనిచేస్తున్నా కేవలం పారితోషికాలు మాత్రమే చెల్లిస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. కిందిస్థాయిలో అవి కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నారు. ఆశ వర్కర్లు 90 శాతం మంది పదో తరగతి పూర్తి చేసిన వారున్నారని వారు ఏఎన్ఎంలతో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు మాత్రం లేవన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత నవంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, బస్‌పాస్, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సనత్‌నగర్ అధ్యక్షుడు జంగయ్య, కంటోన్మెంట్ అధ్యక్షులు ఆర్ మల్లేష్, ఆశ వర్కర్లు జయమ్మ, చంద్రకళ, లత, గీత తదితరులు పాల్గొన్నారు. -
‘అంగన్వాడీ’ల అవస్థలు
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కనీస వేతనాలందక అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. వెట్టిచాకిరి చేస్తున్నా పాలకులు స్పందించడం లేదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణే గాక ప్రభుత్వం ఇతర పనులను సైతం వీరితోనే చేయిస్తోంది. పనిగంటలు, బాధ్యతలు పెరిగినా ఆ మేరకు జీతాలు పెరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత చాకిరి చేస్తున్నా అంగన్వాడీ కార్యకర్తకు కేవలం రూ.3,700, ఆయాకు రూ.1,950 చొప్పున నామమాత్రపు జీతాలను చెల్లిస్తుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రీస్కూల్ నడిపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అందోళనబాట పట్టిన కార్యకర్తలు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం రూ.10,000 చెల్లించాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రతి కేంద్రానికి సొంతభవనాన్ని సమకూర్చాలని, సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని, పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మూతపడిన కేంద్రాలు.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గత రెండు రోజులుగా ఆందోళనబాట పట్టడంతో ఆయా కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు.