
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడం లేదని.. కార్మికుల వేతనాలను ఎప్పటికప్పుడు సవరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కనీస వేతనాల విషయంలో కార్మికుల హక్కుల ఉల్లంఘన జరుగుతు న్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అడ్వైజరీ బోర్డు ప్రతిపాదనల ప్రకారం వేతనాలను సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్యదర్శి పావువెల్లి జీవన్‌రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
అందని కనీస వేతనాలు..
కార్మికుల చేత బండ చాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యాలు.. వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ చట్టం కాగితాలకే పరిమితమైందని..గరిష్టంగా ఐదేళ్లు దాటకుండా ఎప్పటికప్పుడు కనీస వేతనాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.