డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు బైఠాయించిన ఆశ వర్కర్లు
రాంగోపాల్‌పేట్: పదేళ్లుగా ఎన్నో సమస్యల మధ్య పనిచేస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పీ జయలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు సీఐటీయూ, ఆషా సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టులను ఆశ వర్కర్లతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రంలో 25 వేల మంది ఆశ వర్కర్లు పదేళ్లుగా పనిచేస్తున్నా కేవలం పారితోషికాలు మాత్రమే చెల్లిస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. కిందిస్థాయిలో అవి కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నారు. ఆశ వర్కర్లు 90 శాతం మంది పదో తరగతి పూర్తి చేసిన వారున్నారని వారు ఏఎన్‌ఎంలతో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు మాత్రం లేవన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత నవంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, బస్‌పాస్, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సనత్‌నగర్ అధ్యక్షుడు జంగయ్య, కంటోన్మెంట్ అధ్యక్షులు ఆర్ మల్లేష్, ఆశ వర్కర్లు జయమ్మ, చంద్రకళ, లత, గీత తదితరులు పాల్గొన్నారు.