ఆ హైకోర్టులను ఇలా పిలవాలి..
న్యూఢిల్లీ: వలసవాద వాసనలను పూర్తిగా వదిలించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాంబే, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల పేర్లను.. ముంబై, కోల్ కతా, చెన్నై హైకోర్టులుగా మార్చుతున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో హైకోర్టుల పేర్ల మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు చెప్పారు.
బ్రిటిష్ పాలనలో ఈ మూడు మహానగరాలకు స్థిరపడ్డ పేర్లను మార్చేసి బాంబేను ముంబై, కలకత్తాను కోల్ కతా, మద్రాస్ ను చెన్నైగా మార్చుతూ గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నగరాలు పేర్లు మారినప్పటికీ హైకోర్టులకు మాత్రం పాత పేర్లే కొనసాగాయి. కోర్టుల పేర్లు కూడా మార్చాలని గతంలో పెద్ద ఎత్తున డిమాండ్ వెల్లువెత్తింది. దీనిపై సమగ్ర అధ్యయం అనంతరం రూపొందిన బిల్లు.. ఇటీవలే న్యాయశాఖ ఆమోదం పొందిందని, ఇప్పుడు కేబినెట్ కూడా ఓకే చెప్పిందని మంత్రి రవిశంకర్ తెలిపారు. భారతీయ హైకోర్టుల చట్టం (1861) ఆధారంగా కొత్త పేర్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు.