ఢిల్లీ హత్యాచార ఘటన: రాహుల్ చేష్టలపై సీరియస్
Delhi Dalit Minor Case: ఢిల్లీ మైనర్ హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పరస్పర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బాధితురాలి తల్లిదండ్రుల ఫొటోల్ని తన ట్విటర్లో రాహుల్ పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సీరియస్ అయ్యింది.
శ్మశాన వాటికలో మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై అక్కడున్న కొందరు హత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై తల్లిదండ్రుల సమ్మతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారన్న కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ తరుణంలో తొమ్మిదేళ్ల దళిత మైనర్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ తన ట్విటర్లో ఫొటో పోస్ట్ చేశాడు. అయితే జువెనైల్ జస్టిస్-పోక్సో చట్టాల ప్రకారం.. అలా ఫొటోల్ని, వివరాల్ని బయటపెట్టడానికి వీల్లేదు. తద్వారా బాధితురాలి ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది. ఇది చట్ట విరుద్ధం కూడా. ఈ నేపథ్యంలోనే బాలల కమిషన్ స్పందించింది.
రాహుల్ పోస్ట్‌పై మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ట్విటర్‌కు ఎన్సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విటర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సదరు ట్వీట్‌ను తొలగించాలంటూ ఓ లేఖ కూడా రాసింది. ఇక రాహుల్ చర్యలపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ డీసీపీ(నైరుతి విభాగం)కి మరో ప్రత్యేక లేఖలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని 48 గంటల డెడ్‌టైన్ విధించింది ఎన్సీపీసీఆర్. ఇక ‘ఓటేసే ముందు నిర్భను గుర్తు తెచ్చుకోండి’ అంటూ గతంలో మోదీ చేసిన ప్రచారాన్ని తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్‌పై కౌంటర్ దాడులు చేస్తోంది.