కరెంటు లేదు.. అందుకే మావాళ్లు చనిపోయారు!
''కరెంటు పోయింది.. జనరేటర్ రూంలోకి నీళ్లు వరదలా వచ్చేశాయి.. దాంతో కరెంటూ లేదు, ఆక్సిజన్ సహా ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టంలు కూడా పనిచేయలేదు.. అందుకే మావాళ్లు చనిపోయారు'' అని చెన్నై ఎంఐఓటీ ఆస్పత్రిలో మరణించినవాళ్ల బంధువులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఎంఐఓటీ ప్రతినిధులు నోరు విప్పలేదు గానీ, దీనిపై విచారణ జరిపిస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ హామీ ఇచ్చారు.
ఎంఐఓటీ ఆస్పత్రి లోతట్టు ప్రాంతంలో ఉందని, అలాంటప్పుడు తగినంత విద్యుత్ సరఫరా, జనరేటర్లను సరైన స్థానంలో పెట్టుకోవడం లాంటి విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీదే ఉంటుందని, అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం పూర్తిగా పేషెంట్లను గాలికి వదిలేసిందని, దీనిపై చట్టం తనపని తాను చేసుకుకపోతుందని చీఫ్ సెక్రటరీ చెప్పారు.
ఆ ఆస్పత్రి ఐసీయూలో మొత్తం 75 మంది రోగులు ఉండగా, వాళ్లోల 57 మంది వెంటిలేటర్ మీద ఉన్నారని, వాళ్లందరినీ బయటకు పంపేశారని ఆరోగ్యశాఖ కార్యదర్శి జె.రాధాకృష్ణన్ తెలిపారు. మిగిలినవాళ్లు గత రెండు మూడు రోజులలో మరణించారని చెప్పారు. కేవలం విద్యుత్ లేకపోవడం వల్లే రోగులు మరణించారని మాత్రం అప్పుడే చెప్పలేమన్నారు. ఎంఐఓటీ ఆస్పత్రిలో మరణించినవాళ్లంతా పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నవాళ్లేనని ఆయన అన్నారు.
అడయార్ ప్రాంతంలో నీటిమట్టం పెరుగుతోందని తెలిసినప్పుడే తాము తమవాళ్లను వేరే ఆస్పత్రికి తరలించాలని క ఓరినా.. ఎంఐఓటీ యాజమాన్యం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. ఆస్పత్రికి ఎలాంటి ఇబ్బంది లేదనే వాళ్లు చివరి వరకు చెప్పారని.. ఇప్పుడు తాను తన తండ్రిని కోల్పోయానని దేవీప్రసాద్ అనే యువకుడు వాపోయారు.