Mister KK Movie
-
‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..
‘షమితాబ్’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన అక్షర హాసన్... తొలి సినిమాతోనే అక్షరాలా అందమైన నటి అనిపించుకుంది. అక్షర పాండేగా ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎడా పెడా కాకుండా ఏరి కోరి సినిమాలు చేస్తున్న అక్షర, తాజాగా ‘మిస్టర్ కేకే’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్షర హాసన్ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... అలా అయితేనే... నేను చెన్నైలోనే పుట్టి పెరిగాను. నా పదో యేట అమ్మా, నాన్నలు విడిపోయారు. 2002లో అమ్మతో పాటు ముంబై వెళ్లిపోయాను. ఇక్కడ రెండు సంవత్సరాలు చదివిన తరువాత బెంగళూరు బోర్డింగ్ స్కూలో చేర్పించారు. అయితే అక్కడ చదువు సజావుగా సాగలేదు. చదవాలి కాబట్టి చదవాలి అని నేను అనుకోను. చదువుకు వందశాతం న్యాయం చేయగలిగినప్పుడే చదువుకోవాలి. అంతేగానీ, వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అని చదువుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఆరోప్రాణం డ్యాన్స్ అంటే నాకు ఆరోప్రాణం. ఎనిమిదో యేట డ్యాన్స్ నేర్చుకోవడం మొదలైంది. సల్సా, పాప్, భరతనాట్యం, కూచిపూడి...ఇలా రకరకాల డ్యాన్సులు వచ్చు. ఒకసారి కాలికి గాయం వల్ల సంవత్సరం పాటు డ్యాన్స్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది. ఊపిరి ఆగినంత పనైంది. ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లాను. గాయం నుంచి బయటపడిన తరువాత కమర్శియల్ యాడ్స్, స్టేజీపై నృత్యరూపకాలు చేశాను. ఆ సమయంలోనే నటించాలనే కోరిక మొదలైంది. అలా మొదలైంది... రాహుల్ ఢోలకియా ‘సొసైటీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. నా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. వ్యాన్‌లో కూర్చొని హోంవర్క్ చేసుకునేదాన్ని. ఒకసారి ఒక యాడ్ చేసి వస్తున్నప్పుడు స్టూడియో దగ్గర డైరెక్టర్ బాల్కి కనిపిస్తే పలకరించాను. ఆ సమయంలోనే ‘షమితాబ్’ సినిమా గురించి చెప్పారు. అలా ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రాహుల్, బాల్కీలను గురువులుగా భావిస్తాను. ఆమె మహారాణి ‘ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత ప్రేమించే వ్యక్తి ఎవరు?’ అని అడిగితే మొదటి స్థానం నాకు ఇచ్చుకుంటాను, రెండో స్థానంలో అమ్మ ఉంటుంది. నా జీవితానికి అమ్మ మహారాణి. ఆమె ఎప్పుడూ నాకు ఆదర్శమే. అమ్మ ఆలోచన తీరు, నాది ఒకే తీరుగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళనపడదు, ఒత్తిడిని దరి చేరనివ్వదు. స్పోర్టివ్‌గా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే...అమ్మది స్వీట్హార్ట్. అమ్మ శక్తిమంతమైన స్త్రీ. ఆమె నుంచి నాకు కావలసిన శక్తిని తీసుకుంటాను. -
విక్రమ్ సినిమాపై బ్యాన్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మిస్టర్ కెకె. కోలీవుడ్ లో కదరం కొండన్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగులో మిస్టర్ కెకెగా రిలీజ్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ టాక్ రావటంతో మరోసారి విక్రమ్ అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే తాజాగా మిస్టర్ కెకె టీంకు మరో షాక్ తగిలింది. ఎక్కువ భాగం మలేషియాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను మలేషియా ప్రభుత్వం నిషేదించింది. మలేషియా పోలీసులను తప్పుగా చూపించినందకు గానూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చిత్ర మలేషియా డిస్ట్రిబ్యూటర్స్ లోటస్ ఫైవ్ స్టార్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించారు. కమల్ చిన్న కూతురు అక్షరా హాసన్‌తో పాటు అభి హసన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘మిస్టర్ కెకె’ మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ కెకె జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విక్రమ్, అక్షర హాసన్, అభి హసన్, వికాస్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : రాజేష్ ఎం సెల్వ నిర్మాత : కమల్ హాసన్ చాలా కాలంగా విక్రమ్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించటం లేదు. అయితే విక్రమ్ నటించిన సినిమాలు ఫెయిల్ అయినా విక్రమ్ మాత్రం ఫెయిల్ కాలేదు. అందుకే ఈ విలక్షణ నటుడి సినిమా వస్తుందంటూ కాస్తో కూస్తో హైప్ ఉంటుంది. దానికి తోడు విక్రమ్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ సినిమా నిర్మించటంతో ‘మిస్టర్ కెకె’పై అంచనాలు ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను మిస్టర్ కెకె అందుకున్నాడా..? ఈ సినిమాతో అయినా విక్రమ్ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా? కథ : వాసు (అభి హసన్), అధీరా (అక్షరా హాసన్) పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని మలేషియా వెళ్లిపోతారు. ఓ హాస్పిటల్లో డాక్టర్ అయిన వాసు, అధీరా గర్భవతి కావటంతో నైట్ డ్యూటీస్‌కు వెళుతూ ఉదయం అధీరాకు తోడుగా ఉంటుంటాడు. అదే సమయంలో ఓ ఇండస్ట్రీయలిస్ట్‌ను చంపిన కేసులో ముద్దాయి అయిన కెకె (విక్రమ్) అదే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాసు డ్యూటీలో ఉన్న సమయంలోనే కెకె పై హాత్యాయత్నం జరుగుతుంది. అప్పుడు వాసునే కెకెను కాపాడతాడు. కానీ కొంతమంది దుండగులు అధీరాను కిడ్నాప్ చేసి కెకెను హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురావాలని వాసును బెదిరిస్తారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వాసు.. కెకెను తప్పిస్తాడు. అసలు కెకె ఎవరు..? కెకెను విడిపించే ప్రయత్నం చేసింది ఎవరు..? ఇండస్ట్రియలిస్ట్ చావుకు కెకెకు సంబంధం ఏంటి? చివరకు అధీరా, వాసులు ఏమయ్యారు? అన్నదే మిగతా కథ. నటీనటులు : విలక్షణ నటుడు విక్రమ్ మరోసారి స్టైలిష్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కథా పరంగా పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోవటంతో సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితమయ్యాడు. లుక్స్, మేనరిజమ్స్ పరంగా మాత్రం బాగానే మెప్పించాడు. కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరాహాసన్ కూడా మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర పాత్రలో కనిపించిన నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే. వారంత తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : కేవలం ఒక చిన్నపాయింట్‌ను తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో రెండు గంటల సినిమాగా మార్చే ప్రయత్నం చేసిన దర్శకుడు రాజేష్ ఎం సెల్వ. పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్ చేసే అంశాలు పెద్దగా లేకపోవటమే పెద్ద మైనస్. అసలు కథ ప్రారంభించకుండానే ఫస్ట్ హాఫ్ పూర్తి కావటం ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. దీనికి తోడు సుధీర్ఘంగా సాగే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. సినిమా క్లైమాక్స్‌కు వచ్చే సరికి విక్రమ్, కమల్ హాసన్ ఏం నచ్చి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారన్న అనుమానం కలుగుతుంది. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో జరిగే క్లైమాక్స్ సీన్ ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని ఫైట్స్, చేజ్ సీన్స్, హీరో ఎలివేషన్ షాట్స్ మెప్పిస్తాయి. సంగీత దర్శకుడు గిబ్రాన్ కొంత వరకు సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : విక్రమ్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : కథ స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
నా ఫిట్నెస్ గురువు తనే
‘‘మిస్టర్ కేకే’ ట్రైలర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ చిత్రంలో చాలా వైవిధ్యమైన పాత్ర చేశాను. మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. కమల్‌గారికి మరీ మరీ థ్యాంక్స్. తెలుగులో చాలా బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు’’ అని విక్రమ్ అన్నారు. అక్షరాహాసన్, అభిహాసన్ కీలక పాత్రల్లో విక్రమ్ లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘కడరమ్ కొండాన్’. రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ ‘మిస్టర్ కేకే’ పేరుతో శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నటించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా ఫ్రెండ్ సెల్వ హార్డ్ వర్కర్. నా ఫిట్నెస్ గురువు కూడా ఆయనే’’ అన్నారు. ‘‘కమల్‌హాసన్‌గారు ఇండస్ట్రీకి ఒక డిక్షనరీ లాంటివారు. ఆయన సొంత బ్యానర్లో నిర్మించిన చిత్రంలో మేం భాగమైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. విక్రమ్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎనర్జీలో కొంత నాకు ఉన్నా ఓకే. మళ్లీ ఈ సినిమా సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అన్నారు టి. అంజయ్య. ‘‘నా రెండవ సినిమానే రాజ్‌కమల్ ప్రొడక్షన్లో చేయడం నా అదృష్టం. రవీంద్రన్‌గారు ఈ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. తర్వాత విక్రమ్‌గారు యాడ్ అయ్యాక ఇదొక పెద్ద సినిమా అయిపోయింది. రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు అందించారు’’ అన్నారు దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ. ‘‘ఇందులో గర్భవతి పాత్ర చేశాను. ఈ పాత్ర చేయలేననుకున్నా. కానీ రాజేష్‌గారు, మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు అక్షరాహాసన్. రామజోగయ్య శాస్త్రి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్ స్కిల్స్ తీసుకున్నాను..
♦ నేను నటించాలనుకునే హీరోల జాబితాలో విక్రమ్ సార్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఈ సినిమాలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఆయన రియల్ హీరో. యాక్టింగ్ పరంగా నాకు సెట్లో సహాయం చేశారు. ఈ సినిమాలో గర్భవతిగా నటించాను. మా నాన్నగారి బ్యానర్ (రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్)లో నటించడం హ్యాపీ. ఎన్నో స్ఫూర్తిదాయక చిత్రాలు ఈ నిర్మాణసంస్థ నుంచి రావడం వచ్చాయి. మా నాన్నగారి బ్యానర్లో నటించినప్పటికీ పారితోషికం తీసుకున్నాను. ఎందుకంటే పని పనే. (నవ్వుతూ). ♦ ఇందులో గర్భవతిగా నటించాల్సి వచ్చింది కాబట్టి మా అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్ సలహాలు తీసుకున్నాను.. హోమ్ వర్క్ చేశాను. ఈ పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. కొన్ని వర్క్‌షాప్స్ కూడా చేశాం. దర్శకుడు రాజేష్‌కి టెక్నికల్‌గా చాలా నాలెడ్జ్ ఉంది. ♦ హిందీ చిత్రం ‘షమితాబ్’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌గారితో కలిసి నటించాను. కొన్ని సన్నివేశాల్లో ఈజీ, మరికొన్ని సన్నివేశాల్లో కష్టం అనిపిచింది. దర్శకుడు బాల్కీసార్, అమితాబ్సార్, ధనుష్... ఇలాంటి అనుభవజ్ఞులతో చేయడంతో నా పని సులభంగా తోచింది. కానీ వారి యాక్టింగ్ స్టైల్‌కు తగ్గుట్లుగా నా నటన ఎలా ఉంటుందోనన్న విషయం కష్టంగా అనిపించింది. ఆ సమయంలో కాస్త ఆందోళన అనిపించింది. నా సినిమాలను ఎంచుకునే ఫ్రీడమ్ ఉంది నాకు. కాకపోతే నేను మా అమ్మనాన్నల సలహాలు తీసుకుంటాను. ♦ ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. హీరోయిన్గా నా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. యాక్టింగ్ కాకుండా.. నేను బొమ్మలు వేస్తాను. కథలు రాస్తాను. -
నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!
‘‘ప్రతి నటుడు హిట్ సాధించాలనే సినిమా చేస్తాడు. నా కెరీర్‌నే ఓసారి పరిశీలించుకుంటే.. ‘సేతు’ విజయం అందుకోవడానికి ముందు దాదాపు పన్నెండేళ్లు ఫెయిల్యూర్స్ చూశాను. ఆ సమయంలో నేను చేసిన ప్రతి సినిమా బ్రేక్ సాధిస్తుందనే చేశాను. కానీ రాలేదు. అయితే నటుడిగా ప్రతిసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టే ఎంచుకున్నాను. అందుకే ఇండియన్ సినిమాలో నాకంటూ ఓ గుర్తుంపు ఉందని భావిస్తున్నాను’’ అన్నారు విక్రమ్. రాజేష్ ఎం. సెల్వ దర్శకత్వంలో విక్రమ్, అక్షరా హాసన్, అభిహసన్ (నటుడు నాజర్ తనయుడు) ముఖ్య తారాగణంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కడరమ్ కొండాన్’. ఈ చిత్రానికి నటుడు కమల్‌హాసన్ ఒక నిర్మాత. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ ఈ సినిమాను ‘మిస్టర్ కేకే’ టైటిల్‌తో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా విక్రమ్, అక్షరా హాసన్ చెప్పిన విశేషాలు. ♦ ఇంటర్నేషనల్ స్టైల్లో తెరకెక్కిన చిత్రం ‘కేకే’. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర నా సినిమా జీవితంలోనే వన్నాఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను. అయితే నా పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. సినిమాలో నా క్యారెక్టర్ పాజిటివ్‌నా? నెగటివా? అనే విషయం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ♦ కొన్ని సినిమాలకు క్యారెక్టర్ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే సినిమాలో ఆ పాత్ర ఎంత బలమైనదో ఊహించుకోవచ్చు. ఈ సినిమా అలాంటిదే. అందుకే అలా టైటిల్ పెట్టాం. ఒక రోజులో జరిగే కథ కాబట్టి స్క్రీన్‌పై కథ స్పీడ్‌గా నడుస్తుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ రియల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన గిల్ ఫైట్స్‌ను బాగా డిజైన్ చేశారు. దర్శకుడు రాజేష్‌కు మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సెట్లో తనకు ఏం కావాలన్న విషయంపై ఫుల్ క్లారిటీతో ఉంటాడు. ♦ ఇది ఇంటర్నేషనల్ స్టైలిష్ మూవీ అయినప్పటికీ మన ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందనే అనుకుంటున్నాను. నేను చేసిన ‘శివపుత్రుడు’ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అయినా కేవలం నేటివిటి కారణంగానే మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానిక్’ వంటి సినిమాలకు మన ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఆ సినిమాల్లోని ఎమోషనల్ కంటెంటే. అలాగే ‘బాహుబలి’ కూడా. మంచి కథ, సరైన ఎమోషన్స్ ఉంటే ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు. అలాగే ఒక నటుడిగా బాక్సాఫీస్ నంబర్స్ కూడా ముఖ్యంగా భావిస్తాను. ♦ ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అందుకే ఏ ఒక్క భాషకే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లో నాకు గుర్తింపు తెచ్చిన సినిమాలు ఉన్నాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. నంబర్ 1 యాక్టర్ కావాలనే ఆశ లేదు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. ♦ నిజానికి ఈ సినిమాలో కమల్‌హాసన్‌గారు నటించాల్సింది. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కమల్‌సార్ బ్యానర్లో నేను ఈ సినిమా చేశాను. వాస్తవానికి కమల్‌గారు ఎవరి గురించీ ఎక్కువగా మాట్లాడరు. కానీ ఈ సినిమా తమిళ ఆడియో వేడుకలో నా గురించి ఆయన చెప్పిన మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. ♦ నా కొడుకు ధృవ్ నటించిన ‘ఆదిత్యవర్మ’ (తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్) షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా చాన్స్ వచ్చినప్పుడు ధృవ్ అమెరికాలో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. చాలా నేచురల్‌గా నటించాడనిపించింది. కొన్ని సీన్స్‌లో అయితే నా కంటే బాగా చేశాడనిపించింది. రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో, డబ్బింగ్ చెప్పే సమయంలో ‘నాన్నా.. నువ్వు బయటికి వెళ్లు’ అన్నాడు. నేను ఇక్కడ లేను.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడనుకుని వర్క్ చేయమన్నాను. ♦మణిరత్నంగారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నాను. అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించబోతున్నాను. గౌతమ్ మీనన్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న ‘ధృవనక్షత్రం’ ఫైనల్ షెడ్యూల్ జరగాల్సి ఉంది. ‘మహావీర్ కర్ణ’ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. -
మిస్టర్ థ్రిల్
విక్రమ్ హీరోగా, అక్షరాహాసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కదరమ్ కొండన్’. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.రవిచంద్రన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ‘మిస్టర్ కెకె’ పేరుతో తెలుగులో విడుదలవుతోంది. టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ ఈ నెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టి.నరేష్ కుమార్, టి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు థ్రిల్‌ని అందించేలా సెల్వ తెరకెక్కించారు. సమర్థుడైన కమాండర్‌గా విక్రమ్ యాక్షన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో విక్రమ్ గెటప్ చాలా బాగుందని అందరూ ఒకే మాట చెబుతున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ చిత్రంలో అక్షరాహాసన్ కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు’’ అన్నారు. -
‘నువ్ ఆడుకున్నది నాతో కాదు.. యముడితో’
చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ కెకె’. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేష్ ఎం సెల్వ దర్శకుడు. తమిళ్లో కదరం కొండెన్ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో మిస్టర్ కెకె పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న విక్రమ్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఎక్కువ భాగం విదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు అక్షర హాసన్, అబి హసన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విక్రమ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.