‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ | Vikram Mister KK Movie Review | Sakshi
Sakshi News home page

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

Jul 19 2019 2:43 PM | Updated on Jul 19 2019 6:19 PM

Vikram Mister KK Movie Review - Sakshi

మిస్టర్‌ కెకె అంచనాలను అందుకున్నాడా..? కమల్‌ హాసన్‌ నిర్మించిన సినిమాతో అయినా విక్రమ్‌ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడా?

టైటిల్ : మిస్టర్ కెకె
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
తారాగణం : విక్రమ్‌, అక్షర హాసన్‌, అభి హసన్‌, వికాస్‌
సంగీతం : గిబ్రాన్‌
దర్శకత్వం : రాజేష్‌ ఎం సెల్వ
నిర్మాత : కమల్‌ హాసన్‌

చాలా కాలంగా విక్రమ్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించటం లేదు. అయితే విక్రమ్‌ నటించిన సినిమాలు ఫెయిల్ అయినా విక్రమ్‌ మాత్రం ఫెయిల్ కాలేదు. అందుకే ఈ విలక్షణ నటుడి సినిమా వస్తుందంటూ కాస్తో కూస్తో హైప్‌ ఉంటుంది. దానికి తోడు విక్రమ్‌ హీరోగా లోక నాయకుడు కమల్‌ హాసన్‌ సినిమా నిర్మించటంతో ‘మిస్టర్‌ కెకె’పై అంచనాలు ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను మిస్టర్‌ కెకె అందుకున్నాడా..? ఈ సినిమాతో అయినా విక్రమ్‌ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడా?

కథ :
వాసు (అభి హసన్‌), అధీరా (అక్షరా హాసన్‌) పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని మలేషియా వెళ్లిపోతారు. ఓ హాస్పిటల్‌లో డాక్టర్‌ అయిన వాసు, అధీరా గర్భవతి కావటంతో నైట్‌ డ్యూటీస్‌కు వెళుతూ ఉదయం అధీరాకు తోడుగా ఉంటుంటాడు. అదే సమయంలో ఓ ఇండస్ట్రీయలిస్ట్‌ను చంపిన కేసులో ముద్దాయి అయిన కెకె (విక్రమ్‌) అదే హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. వాసు డ్యూటీలో ఉన్న సమయంలోనే కెకె పై హాత్యాయత్నం జరుగుతుంది. అప్పుడు వాసునే కెకెను కాపాడతాడు. కానీ కొంతమంది దుండగులు అధీరాను కిడ్నాప్‌ చేసి కెకెను హాస్పిటల్‌ నుంచి బయటకు తీసుకురావాలని వాసును బెదిరిస్తారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వాసు.. కెకెను తప్పిస్తాడు. అసలు కెకె ఎవరు..? కెకెను విడిపించే ప్రయత్నం చేసింది ఎవరు..? ఇండస్ట్రియలిస్ట్ చావుకు కెకెకు సంబంధం ఏంటి? చివరకు అధీరా, వాసులు ఏమయ్యారు? అన్నదే మిగతా కథ.




నటీనటులు :

విలక్షణ నటుడు విక్రమ్‌ మరోసారి స్టైలిష్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే కథా పరంగా పెద్దగా వేరియేషన్స్‌ చూపించే అవకాశం లేకపోవటంతో సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితమయ్యాడు. లుక్స్‌, మేనరిజమ్స్‌ పరంగా మాత్రం బాగానే మెప్పించాడు. కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షరాహాసన్‌ కూడా మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఆమె నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర పాత్రలో కనిపించిన నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే. వారంత తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ :

కేవలం ఒక చిన్నపాయింట్‌ను తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో రెండు గంటల సినిమాగా మార్చే ప్రయత్నం చేసిన దర్శకుడు రాజేష్‌ ఎం సెల్వ. పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్‌ చేసే అంశాలు పెద్దగా లేకపోవటమే పెద్ద మైనస్‌. అసలు కథ ప్రారంభించకుండానే ఫస్ట్ హాఫ్ పూర్తి కావటం ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. దీనికి తోడు సుధీర్ఘంగా సాగే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. సినిమా క్లైమాక్స్‌కు వచ్చే సరికి విక్రమ్‌, కమల్‌ హాసన్‌ ఏం నచ్చి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారన్న అనుమానం కలుగుతుంది. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో జరిగే క్లైమాక్స్‌ సీన్‌ ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని ఫైట్స్‌, చేజ్‌ సీన్స్‌, హీరో ఎలివేషన్‌ షాట్స్‌  మెప్పిస్తాయి. సంగీత దర్శకుడు గిబ్రాన్‌ కొంత వరకు సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్‌ :
విక్రమ్‌
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
కథ
స్క్రీన్‌ ప్లే

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement