మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు!
చిరు(సిరి)ధాన్యాల ఆహారం ఎంతో ఆరోగ్యదాయకమన్న స్పృహ ఇప్పుడిప్పుడే తిరిగి మేలుకొంటున్న తరుణంలో చిరుధాన్యాలను పప్పుధాన్యాలతో కలిపి మిశ్రమ సాగు చేసే రైతుల సంఖ్య తెలుగునాట అంతకంతకూ పెరుగుతోంది. అయితే, శుద్ధి యంత్రాల ధరలు అందుబాటులో లేక చాలా మంది రైతులు సిరిధాన్యాలను పండించడం లేదు. పండించిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన యంత్రాలతో పని లేకుండానే, కేవలం మిక్సీతోనే ఇంటిపట్టున మహిళలు శుద్ధి చేసుకోగలిగిన సులువైన పద్ధతి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిపై సాగుబడి ప్రత్యేక కథనం..
జొన్నలు (Sorghum), రాగులు (Finger Millet), సజ్జలు (Pearl Millet).. ఈ మూడు రకాల చిరుధాన్యాలను కంకుల నుంచి రాలగొట్టి నూర్చుకుంటే చాలు.. వాడకానికి సిద్ధమవుతాయి. గింజలపైన పొట్టు ఉండదు. కాబట్టి వీటికి ప్రాసెసింగ్ సమస్య లేదు. అయితే, కొర్రలు (fox tail millet), అండుకొర్రలు (brown top milletట), సామలు (little millet), ఊదలు (Barnyard Millet), అరికలు (Kodo Millet) వంటి చిరుధాన్యాల (సిరిధాన్యాలు) సంగతి కొంచెం భిన్నంగా ఉంటుంది. వీటి ధాన్యం నూర్పిడి చేసిన అనంతరం బియ్యం పొందాలంటే ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ధాన్యం పైన పొట్టును తొలగిస్తే.. తినడానికి వీలయ్యే చిరుధాన్యాల బియ్యం సిద్ధమవుతాయి. సాంప్రదాయకంగా ఈ ధాన్యాన్ని తిరగలి (ఇసుర్రాయి)లో ఇసిరి, తర్వాత రోట్లో దంచుకొని, చెరిగి బియ్యాన్ని సిద్ధం చేసుకోవటం ఆనవాయితీ. అయితే, ఇది అధిక శ్రమ, సమయంతో కూడిన పని. కాబట్టే, ఈ మైక్రో మిల్లెట్స్ ఎంత ఆరోగ్యదాయకమైనవైనప్పటికీ కాలక్రమంలో కనుమరుగయ్యాయి.
తిరగలి, రోలు అవసరం లేకుండా.. ఖరీదైన యంత్రాలతో పని లేకుండా..
మరుగున పడిపోయిన ఈ 5 రకాల (కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు) మైక్రో మిల్లెట్సే మానవాళిని ప్రాణాంతక జబ్బుల నుంచి రక్షించే నిజమైన ‘సిరిధాన్యాల’ంటూ కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ చిరకాలంగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
సిరిధాన్యాలను పాత పద్ధతిలోనే ఇసుర్రాయిలో ఇసిరి, రోట్లో దంచి శుభ్రం చేసుకోవటం తప్ప మరో మార్గం లేదా?
యంత్రాలు అవసరం లేకుండా బియ్యం మార్చుకోగలిగే మార్గం ఇక లేదా?
సిరిధాన్యాలను సాగు చేసే చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఇల్లు దాటి వెళ్లకుండా ఈ ధాన్యాలను బియ్యంగా మార్చుకోగలిగే పద్ధతిని రూపొందించలేమా? అని డా. ఖాదర్ మదనపడేవారు. తన సోదరీమణులు మహబున్నీ, కాశింబిలతో కలిసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మహబున్నీ కొత్త ఆలోచనతో తిరగలి, రోలు అవసరం లేకుండా.. ఖరీదైన యంత్రాలతో పని లేకుండానే.. ప్రతి ఇంట్లో ఉండే మిక్సీ ద్వారానే చిరు ధాన్యాలపై పొట్టును సులభంగా తీసివేసి బియ్యంగా మార్చుకునే పద్ధతిని అన్వేషించటంలో మహబున్నీ కొద్ది నెలల క్రితం సఫలీకృతులయ్యారు. వృత్తి రీత్యా నర్సు అయిన ఆమె స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. తన సోదరిని ‘బుచ్చి’ అని పిలుచుకునే డా. ఖాదర్ ఆమె కనిపెట్టిన ఈ పద్ధతికి ‘సిరిధాన్యాలను శుద్ధి చేసే బుచ్చి పద్ధతి’ అని పేరు పెట్టారు.
రైతుకు ఏడాది పొడవునా ఆదాయం
సిరిధాన్యాలను సాగు చేసే చిన్న, సన్నకారు రైతులు రూ. లక్షలు వెచ్చించి యంత్రాలను ఏర్పాటు చేసుకొని ముడి సిరిధాన్యాలను శుద్ధి చేసుకోలేరు. గంపగుత్తగా వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటారు. అయితే, మిక్సీతోనే ఇంటిపట్టున అవసరం మేరకు రోజుకు 20 కిలోల చొప్పున సిరిధాన్యాల బియ్యం తయీరు చేసుకోగలిగే ఈ సదుపాయం వల్ల.. వారు అవసరమైనప్పుడు, ఇతర వ్యవసాయ పనులు లేనప్పుడు ఈ పని చేసుకుంటారు. సిద్ధమైన బియ్యాన్ని తాము తినటంతోపాటు గ్రామస్తులకు, స్థానిక మార్కెట్లలోనూ ఏడాది పొడవునా అమ్ముకొని మంచి నికరాదాయం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఎక్కువ ఎకరాల్లో పండించే రైతులైనా బుచ్చి పద్ధతిలో చిరుధాన్యాలను శుద్ధి చేయడటం ద్వారా.. తన గ్రామంలోనే మహిళలకు నీడపట్టున పని కల్పించడానికి కూడా ఇది నిస్సందేహంగా ఉపకరిస్తుంది. నిబద్ధతతో సృజనాత్మకంగా.. వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం దిశగా ముందడుగు వేస్తున్న డా. ఖాదర్, ఆయన కుటుంబ సభ్యులు, సహచర బృందానికి జేజేలు!
రైతుల చేతుల్లోనే సిరిధాన్యాలు!
డాక్టర్ ఖాదర్ తన సోదరి మహబున్నితో కలిసి వినూత్నమైన మిక్సీ పద్ధతిని కనుగొన్నారు. ముడి సిరిధాన్యాలకు పైన ఉండే పొట్టు తీసి బియ్యంగా తయారు చేసే ప్రక్రియ కంపెనీల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ‘బుచ్చి పద్ధతి’ ఉపయోగపడుతుంది. యంత్రాల అవసరం లేకుండా కేవలం మిక్సీతోనే రైతులు, మహిళలు కుటీర పరిశ్రమగా సిరిధాన్యాల బియ్యం తయారీని చేపట్టవచ్చు. ముడి సిరిధాన్యాల పైపొట్టు తీయడంలో ఇబ్బందుల వల్లనే సిరిధాన్యాల సాగు, వాడకం మరుగునపడిపోయింది. డా. ఖాదర్ కృషి వల్ల సిరిధాన్యాల సాగు గత రెండేళ్లలోనే రెట్టింపైంది. మిక్సీ పద్ధతితో పొట్టు తీయడం కూడా సులభమైంది. మిక్సీలతో ఇంటి స్థాయిలోనే కాకుండా, వాణిజ్య స్థాయిలో కూడా సిరిధాన్యాల బియ్యం తయారీని చేపట్టవచ్చు. ఇప్పటికే మైసూరులో, తమిళనాడులో ఇటువంటి యూనిట్లను ఏర్పాటు చేయించాము. మిక్సీ సాధారణ వేగాన్ని 2,800 ఆర్.పి.ఎం. నుంచి 1,500 ఆర్.పి.ఎం.కు తగ్గించుకోవాలి (మిక్సీలోని కాయిల్‌ను మార్చడం ద్వారా వేగాన్ని తగ్గించవచ్చు). కొంచెం వంచిన సింగిల్ బ్లేడును(పదును లేకుండా సానరాయితో మొండి చేసి) వాడితే నూక శాతం బాగా తగ్గినట్లు గుర్తించాం. అటవీ వ్యవసాయ(కాడు కృషి) పద్ధతిలో రసాయనాల్లేకుండా సిరిధాన్యాల సాగుపై రైతు శిక్షణా శిబిరాల్లోనే మిక్సీతో బియ్యం తయారీ పద్ధతిపైన కూడా శిక్షణ ఇస్తున్నాం. ఇటీవల రాయచూర్‌లో శిక్షణ ఇచ్చాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగులోనే రైతులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
– బాలన్ కృష్ణ (097405 31358), అటవీ వ్యవసాయ నిపుణుడు, మైసూరు, కర్ణాటక balan71@gmail.com
మిక్సీ బర్నర్‌ను వెనక్కి తిప్పినట్టే తిప్పి వదలాలి..!
కొర్రలు తదితర సిరిధాన్యాలకు పైన ఉండే పొట్టును తీయడానికి మామూలుగా ఇసుర్రాయితో ఇసిరి, తర్వాత రోట్లో దంచి చెరిగే వాళ్లం. మిక్సీతోనే పొట్టు తీసే పద్ధతిని కొన్ని నెలలుగా వాడుతున్నాం. ఇది చాలా సులువు. పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో ఉంటున్న వాళ్లు కూడా సిరిధాన్య బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ముడి సిరిధాన్యాలను చెరిగి మట్టిపెళ్లలు, పుల్లలు, ఇసుక లేకుండా సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జారులో సగానికి పైగా నింపుతాను. తర్వాత బర్నర్‌ను (ముందుకు.. అంటే 1 వైపు తిప్పకూడదు) కొంచె వెనక్కి(‘పల్స్’వైపు) తిప్పినట్టే తిప్పి వదిలేస్తాను. ఇలా 50 సార్లు చేసిన తర్వాత చేటతో చెరుగుతాను. మళ్లీ మిక్సీలో పోసి 30 సార్లు మళ్లీ వెనక్కి తిప్పి వదిలేసి, మరోసారి చెరుగుతాను. పొట్టు చాలా వరకు పోతుంది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మళ్లీ జారులో పోసి ఐదారు సార్లు పల్స్ వైపు తిప్పి వదిలేసి.. చెరిగితే సరిపోతుంది. ఇంట్లో మిక్సీ ఉన్న ఎవరైనా సిరిధాన్యాల బియ్యాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సులువుగా తయారు చేసుకోవచ్చు.
– మహెబున్నీ (70930 11240), ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా
సిరిధాన్యాలను రైతులే నగరాలకు సరఫరా చేయొచ్చు!
సిరిధాన్యాలను పండించే రైతులు తమ గ్రామాల్లోనే తక్కువ ఖర్చుతో బియ్యం తయారు చేసుకొని, స్థానిక మహిళలకు పని కల్పిస్తూ, మంచి నికరాదాయం పొందవచ్చు. యంత్రాల అవసరం లేకుండా మిక్సీలతోనే సిరిధాన్యాల బియ్యం తయారీని రైతులు తాము తినడం కోసం మాత్రమే కాదు పట్టణాలు, నగరాల్లో నివాసం ఉండే వారి కోసం కూడా పెద్ద ఎత్తున చేపట్టవచ్చు. రెండు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకొని 20 మిక్సీలను సమకూర్చుకుంటే విద్యుత్తు సదుపాయం కూడా అవసరం లేదు. 20 మంది మహిళలతో రోజుకు 400 కిలోల వరకు సిరిధాన్యాల బియ్యాన్ని తయారు చేసుకుంటూ.. వినియోగదారులకు నేరుగా సరఫరా చేయవచ్చు. అనేక చోట్ల ఇప్పటికే ఇలాంటి యూనిట్లు ఏర్పాటయ్యాయి.
– డాక్టర్ ఖాదర్‌వలి (94485 61472), స్వతంత్ర అటవీ వ్యవసాయ, ఆహార శాస్త్రవేత్త, మైసూరు
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్