ఆప్ మరో ఎమ్మెల్యే అరెస్ట్
భూకబ్జా, మోసం కేసులో అదుపులోకి..
న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక భూకబ్జా కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌ను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం ఇది రెండోసారి. తూర్పు ఢిల్లీలోని కొండ్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మనోజ్కుమార్పై భూకబ్జా ఆరోపణలున్నాయి. దీంతోపాటు ఆయన మోసానికి పాల్పడ్డారని ఏడాది కిందట కేసు కూడా నమోదైంది. ఈ కేసులో పోలీసులు మనోజ్‌కుమార్‌ను గురువారం విచారణకు పిలిపించారు.
కొంతసేపు ప్రశ్నించిన అనంతరం.. అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471(నకిలీ పత్రాలను అసలైనవిగా చూపడం), 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) సెక్షన్లను నమోదు చేసినట్లు ఢిల్లీ ఉత్తర రేంజ్ జాయింట్ కమిషనర్ సంజయ్ బెనివాల్ చెప్పారు. మనోజ్‌కుమార్‌ను ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 2 రోజుల పోలీసు కస్టడీకి జడ్జి అప్పగించారు. కాగా బీజేపీ ఢిల్లీ పోలీసులను ఆప్‌పై రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని ఆప్ మండిపడింది.
ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల మధ్య విభేదాల వల్లే, తాను ఆప్ ఎమ్మెల్యే కావడం వల్లే అరెస్టు చేశారని మనోజ్ పేర్కొన్నారు. ఏడాది కిందే కేసు నమోదైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదని.. ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అరెస్టు చేయడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్‌పై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఆయనను పోలీసులు అరెస్టు చేయకుండా సెప్టెంబర్ 7 వరకు గడువిచ్చింది.