జగన్ ఆదేశాలిస్తే రాజీనామాలకు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిస్తే ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు. మంచి ఆశయం కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు శాసనసభ్యుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా నియంతలా పరిపాలన చేస్తున్నాడని మండిపడ్డారు. పెన్షన్ ఇచ్చేందుకు, రోడ్లు వేయించేందుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, అధికారుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పెత్తనం మొత్తం వారికి అంటగాట్టారన్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వంలో పెద్దపీట వేసి వ్యవస్థలను చంద్రబాబు దుర్వనియోగం చేశాడని దుయ్యబట్టారు. ఇంత నీచంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని మొదటి సారి చూస్తానన్నారు.
టీడీపీ ఎంపీలు ముందుకు రావాలి
ప్రత్యేక హోదా కోసం ప్రాణాలకు తెగించి ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ అవినాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ..తమిళనాడులో జల్లికట్టుపై అందరు కలిసికట్టుగా ఉద్యమం చేసి సాధించుకున్నారని అన్నారు. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీనేనని, ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు లాలూచీ పడ్డారు
ఐదుకోట్ల ఆంధ్రులు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం డిమాండ్ చేశారని అన్నారు. అగ్రిగోల్డ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని... అర్థరాత్రి ఆంధ్రాభవన్‌లో సమాజ్‌వాదీ నేతలను కలిసింది వాస్తవం కాదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ అంశంపై చంద్రబాబు లాలూచీ పడ్డారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వచ్చారని విమర్శించారు.
చంద్రబాబుతో వాటాలు తేలకపోవడంతో అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనానికి జీఎస్ఎల్ గ్రూప్ వెనకడుగు వేసిందన్నారు. ఈ నెల 3న చంద్రబాబు అమర్ సింగ్‌ను కలిశారని, ఆ తర్వాతే అఫిడవిట్ వేయడం జరిగిందన్నారు. చంద్రబాబు తన అవినీతి కోసం అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలు పణంగా పెట్టారని విమర్శించారు. ఓ వైపు రాష్ట్రమంతా ఆందోళనలు జరుగుతుంటే ...చంద్రబాబు ఏపీ భవన్ వేదికగా అవినీతి వ్యవహారాలు నడిపారని బొత్స మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తున్నామని, హోదా సాధనకు హైవేల దిగ్బంధం, రైల్‌రోకోలకు పిలుపునిచ్చామని బొత్స తెలిపారు.
ఎంపీల ఆరోగ్యం క్షీణిస్తోంది
హోదా సాధన కోసం దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, కేసుల భయంతోనే ఆయన యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.
హోదాతోనే అభివృద్ధి సాధ్యం
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దీక్ష చేస్తున్న ఎంపీలను పలకరించే పరిస్థితి లేదని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే హోదా అంశం సజీవంగా ఉందన్నారు. జగన్ యువభేరీ సభలకు విద్యార్థులు వెళ్తే కేసులు పెడతామని చంద్రబాబు బెదిరించారన్నారు. అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, తన అవినీతిపై కేసులు పెడతారన్న భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.