టమక వద్ద అతిపెద్ద రెవెన్యూ భవన్
కోలారు, న్యూస్‌లైన్ : కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా రెవెన్యూ భవన ఏర్పాటు చేయాలనే జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. నగరంలోని టమక వద్ద దేవరాజ్ అరస్ మెడికల్ కళాశాల ఎదుట రెవెన్యూ భవన్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. ఇందు కోసం ఎనిమిది ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. స్థానిక జిల్లా పంచాయతీ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌తో పాటు అన్ని కార్యాలయాలు ఓకే చోట ఉండేలా అతి పెద్ద రెవెన్యూ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు.
శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఉడిపి జిల్లా కేంద్రం, లేదా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన రెవెన్యూ భవన్ తరహాలో ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టాలనే యోచన ఉందన్నారు. జిల్లాలో నెలకొన్న మంచినీటి ఎద్దడి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో రూ.10కోట్లతో యాక్షన్ ప్లాన్న ప్రభుత్వానికి అందజేసే విషయంపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలిపారు. ఏయే గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉందో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఎంపి, ఎమ్మెల్యే నిధులు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక విజిలెన్స్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందు కోసం కాంట్రాక్టు పద్దతిపై సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణ కొనసాగించాలని అధికారులతో జరిగిన సమావేశంలో తీర్మానించినట్లు ఆయనతెలిపారు.చెరువుల వద్ద పశువుల నీటి తొట్టీలు, దోభిఘాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యేలందరూ పార్టీల కతీతంగా సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు.
చెరువులనుంచి తీసిన పూడిక మట్టిని రైతుల పొలాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్తూరు మంజునాథ్, మంజునాథ్‌గౌడ, వై రామక్క, ఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వై ఏ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే వై సంపంగి, జిల్లా కలెక్టర్ డీ ఎస్ రవి, సీఈఓ జుల్ఫికరుల్లా తదితరులు పాల్గొన్నారు.