MLC Bhupathi Reddy
-
పోచారం ఓ రబ్బర్ స్టాంపు : విద్యాసాగర్‌రావు
‘‘బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై గుత్పకట్టెలతో దాడి చేసిన వారికి మార్కెట్ కమిటీ పదవిచ్చారు.. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వొద్దని సోనియాకు లేఖ రాసిన రాజేశ్వర్‌కు ఎమ్మెల్సీ పదవి.. టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్, నగర మేయర్ పదవులు..కానీ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ఏఎస్ పోశెట్టి, ఉద్యమంలో జైలు పాలైన చింతా మహేష్ లాంటి ఉద్యమ కారులకు మాత్రం ద్రోహం చేశారు..’’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లపై తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి కళ్యాణమండపంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మంలో 1,200 మంది అమరులైతే ఆ కుటుంబాలను ఆదుకున్న దాఖలాల్లేవన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో కనీసం అమరవీరుల స్థూపం నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాజిరెడ్డి ట్రాక్టర్లు అమ్ముకున్నారు.. ప్రతి అభివృద్ధి పనిలోనూ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కమీషన్లు దండుకున్నారని భూపతిరెడ్డి ఆరోపించారు. రైతులకు పంపిణీ చేయాల్సిన ట్రాక్టర్లను అమ్ముకున్నారని, ఇసుక దందాకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను రూరల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. కవితపైనా విమర్శలు.. సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్‌లలో అభివృద్ధి పనులకు రూ.వందల కోట్లు వెళుతుంటే.. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కుమార్తె, ఎంపీ కవితతో జిల్లాకు ఒరిగిందేమీలేని భూపతి రెడ్డి విమర్శించారు. కనీసం సీఎం వద్ద ఉండే రూ.ఐదు వేల కోట్లలో రూ.ఐదు వం దల కోట్లు కూడా జిల్లాకు మంజూరు చేయించలేకపోయారన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితులు లేవన్నారు. ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్క డిగ్రీ కాలేజీని స్థాపించలేదన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దక్కకుండా చేశారని విమర్శించారు. మెడికల్ కళాశాల సౌకర్యాలు మెరుగుపడలేదని, ఎన్డీఎస్ఎల్ పునరుద్ధరణకు నోచుకోలేన్నారు. అదనంగా ఒక్క గుంటకూ నీళ్లివ్వలేదు.. జిల్లా రైతాంగం హక్కైన సింగూరు జలాలను మెదక్ జిల్లాకు తరలించుకుపోతే జిల్లా నుంచి గెలుపొందిన ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కూడా నోరు మెదపలేదని భూపతి రెడ్డి విమర్శించారు. ఎస్సారెస్పీ లీకేజీ నీటిని అడిగితే గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి రైతులను భయ భ్రాంతులకు గురి చేశారన్నారు. కానీ ఎస్సారెస్పీనుంచి తొమ్మిది టీఎంసీల నీటిని మానేర్ డ్యాంకు తరలించుకు పోయారన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలో అదనంగా ఒక్క గుంటకు కూడా సాగునీరిచ్చిన దాఖలాల్లేవన్నారు.ఏ ముఖం పెట్టుకుని టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అస్తవ్యస్తంగా టీఆర్ఎస్ : విద్యాసాగర్‌రావు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ విద్యా సాగర్‌రావు విమర్శించారు. ఎంపీ కవిత, మిషన్‌భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డిలకు అనుభవం లేక పార్టీని నడిపించలేకపోయారన్నారు. జిల్లాలో టీఆర్ఎస్కు యం త్రాంగం లేదు.. మంత్రాంగం లేదన్న విద్యాసాగర్.. మంత్రి పోచారం ఓ రబ్బరు స్టాంపుగా మారారన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కోసం పార్టీని తాకట్టుపెట్టారని, బాజిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎలా అవుతుంద ని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, నాయకులు కర్కగంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, షాదుల్లా, కిషన్ నాయక్, కర్స మోహన్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన భూపతిరెడ్డి
-
ఉండనీయరు.. వెళ్ల గొట్టరు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతల విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా..? ఇటు సస్పెండ్ చేయకుండా.. అలాగని పార్టీలో ఉంచకుండా త్రిశంకు స్వర్గంలో ఉంచుతోందా..? సస్పెన్షన్ వేటు వేస్తే కాస్తో కూస్తో ప్రజల నుంచి వచ్చే సానుభూతిని కూడా వారికి రానీయకుండా.. స్వయంగా వారే పార్టీని వీడేలా చేస్తోందా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి విషయంలో ఇదే జరుగుతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకు ల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ విషయంలోనూ క్రమంగా ఇలాంటి పరిస్థితికి దారితీస్తోందని అంటున్నారు. ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇలాంటి కీలక నేతల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. వేచిచూసే ధోరణితో.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యల ప్రతిపాదనకు దారితీసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి కుమారుడు జగన్ తనను దూషించారంటూ భూపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శాసన మండలిలో ప్రివిలైజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని, జగన్‌పై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అయినప్పటికీ భూపతిరెడ్డి స్పందించలేదు. ఈ క్రమంలో భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ 2017 డిసెంబర్ 13న జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. ఒక్క రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ మినహా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లో మంత్రి పోచారం నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు తీర్మానించారు. ఈ తీర్మానాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. అప్పటి నుంచి పార్టీ ఏ నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఆరు నెలలుగా భూపతిరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీ అధికారిక కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. అయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అడపాదడపా ఆయన అనుచర వర్గానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తన విషయంలో అధినేత ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఎమ్మెల్సీ కూడా వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే ధోరణితో ఉన్నట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. మరోవైపు భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. డీఎస్ పరిస్థితి కూడా పరోక్షంగా ఇలాగే..? రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ పరిస్థితి కూడా పరోక్షంగా ఇలాగే ఉందనే అభిప్రా యం రాజకీయ వర్గాల్లో ఉంది. సీనియర్ నాయకులైన డీఎస్‌కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన అనుచరవర్గం గుర్రుగా ఉంది. పార్టీ, అధికారిక కార్యక్రమా లకు సంబంధించి డీఎస్‌కు మొక్కుబడిగా ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన అను చరవర్గం అసంతృప్తితో ఉంది. ముఖ్య కార్యక్రమాలు సైతం జరిగినా.. ‘‘నిన్ననే ఖరారైంది.. కార్యక్రమానికి రండీ..’’ అంటూ మొక్కుబడి ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీ బహిరంగసభ వేదికపైన కాకుండా., ప్రజాప్రతినిధుల గ్యాలరీలో డీఎస్ కూర్చున్న ఫొటోలు, వీడియోలు అప్ప ట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇటు డీఎస్ కూడా తన అనుచరవర్గంతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. తన అనుచరవర్గం ఆవేదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని డీఎస్ ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎంపీ కవిత కూడా స్పందించారు. సీనియర్ నాయకులు డీఎస్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉందని, సీఎం కేసీఆర్ చాంబర్లోకి నేరుగా వెళ్లగలిగే చొరవ డీఎస్‌కు ఉందని స్పష్టత ఇచ్చారు. ఇలా ఈ ముఖ్యనేతలిద్దరి విషయంలో పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, ఈ ఇద్దరు నేతలు సైతం ఆచితూచి అడుగులు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
సమగ్ర విచారణ చేపట్టండి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ముఖ్య నేతల మధ్య వర్గ పోరు రసకందాయంలో పడింది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యూహాత్మకంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆరోపణలు తప్పని తేలితే ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్:భూ ప్రక్షాళన ప్రక్రియపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన సంచలన ఆరోపణలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యూహాత్మకంగా స్పందించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావుకు ఆదివారం లేఖ రాశారు. ఈ ఆరోపణలు తన 35 ఏళ్ల రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీశాయని లేఖలో పేర్కొన్నారు. పోలీసు శాఖతో గానీ, తగిన అధికారం కలిగిన యంత్రాంగంతో గానీవిచారణ జరిపించాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు కాని పక్షంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు ఉప్పు నిప్పులా మారిన విషయం విదితమే. గతంలో భూపతిరెడ్డి పలుమార్లు చేసిన విమర్శలపై బాజిరెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కానీ ఈసారి బాజిరెడ్డి వ్యూహాత్మకంగా కలెక్టర్‌కు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఆరోపణలపై బాజిరెడ్డి అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇన్చార్జి డీఆర్వోతో విచారణ.. బాజిరెడ్డి రాసిన లేఖపై కలెక్టర్ రామ్మెహన్‌రావు తక్షణం స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వినోద్‌కుమార్‌ను నియమించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించిన గ్రామాలతో పాటు అన్ని చోట్లా విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మరో వైపు జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి శనివారం సిరికొండ తహసీల్దార్ కార్యాలయాలన్ని తనిఖీ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన 95 శాతం పూర్తయిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆధార్ సీడింగ్, డిజిటల్ సిగ్నిచర్లను ఖాతాల వారీగా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలోని 105 గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాసుపుస్తకాల ముద్రణకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆరోపణలు, బాజిరెడ్డి కలెక్టర్‌కు లేఖ చర్చనీయాంశంగా మారింది. -
ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫొటో కట్
సిరికొండ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. శనివారం నిజామాబాద్ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఫొటో లేకపోవడం ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆదివారం మండలంలోని పెద్దవాల్గోట్, పోత్నూర్ల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భూపతిరెడ్డి ఫొటోను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభ సమయానికి ఫ్లెక్సీల్లోని ఎమ్మెల్సీ ఫొటోలు కట్ చేయడం చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ ఫైట్
కాలూరు వేదికగా డిష్యూం.. డిష్యూం.. టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు ఎమ్మెల్సీపై చేయి చేసుకోవడంపై చర్చ పిలవకున్నా వచ్చి రాద్దాంతం చేస్తున్నందుకేనని సమర్థన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై కేసు.. బాజిరెడ్డిపై ఫిర్యాదు.. ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత కలహాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇద్దరూ అధికారపార్టీకి చెందిన వారే. ఒకరు శాసనసభ్యులు, ఇంకొకరు శాసనమండలి సభ్యులు. ఇద్దరి మధ్య పొడచూపిన అంతర్గత విభేదాలు శనివారం నిజామాబాద్ మండలం కాలూరు వేదికగా బయడపడ్డాయి. కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డి వర్గీయుల మధ్యఫ్లెక్సీలో ఫొటోలు పెట్టలేదని మొదలైన గొడవ.. చివరకు చినికి చినికి గాలివానగా మారింది. ఎమ్మెల్సీ ఫొటోలు ఫ్లెక్సీలో పెట్టలేదని మహిళ సంఘం భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ అనుచరలు నిరసన తెలుపుతుండగా.. కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాజిరెడ్డి ధర్మారం రమాకాంత్‌పై చేయి చేసుకున్నాడు. ఇదేమిటనే ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ప్రశ్నించే క్రమంలో ఎమ్మెల్సీపై కూడా బాజిరెడ్డి గోవర్ధన్ చేయి చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగగా అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దు మణిగింది. కాగా ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేయి చేసుకోవడం దారుణమైన చర్యగా ఆ పార్టీలోని కొందరు బహిరంగంగానే మాట్లాడుతుండగా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు సంబంధం లేకుండా ఆయన నియోజకవర్గంలో వైరివర్గాలతో కలసి కార్యక్రమాల్లో పాల్గొంటుండటం.. తరచూ పిలవడం లేదంటూ ప్రొటోకాల్ పేరిట రాద్దాంతం చేస్తుండటమే గొడవకు కారణమని ఎమ్మెల్యే వర్గీయుులు సమర్థిస్తున్నారు. ఎమ్మెల్సీపై కేసు.. ఎమ్మెల్యేపై ఫిర్యాదు.. నిజామాబాద్ మండలం కాలూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డ్డిల మధ్య జరిగిన వాగ్వాదం, ఘర్షణపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గొడవ జరుగుతున్న సమయంలో అడ్డుకునేందుకు వెళ్లిన తనను కొట్టారంటూ నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో మున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీపై 353, 506, రెడ్‌విత్ 34 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందకు వెళ్లిన తమపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దాడి చేశారని ఎమ్మెల్సీ వర్గీయుడు కుమార్‌రెడ్డి నిజామాబాద్ రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా వుండగా రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ప్రొటోకాల్ వివాదం చివరకు ఎమ్మెల్సీపై చేయి చేసుకునే స్థాయికి చేరిన అంశం జిల్లాలో చర్చనీయాంశం కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బహిరంగంగా వాగ్వాదానికి దిగడం, చేయి చేసుకునే స్థాయికి వెళ్లడం రాష్ర్టంలో ఇదే మొదటి సంఘటన. రంగంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు సంచలనం కలిగించిన నిజామాబాద్ మండలం కాలూరు సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై చేయి చేసుకునే పరిస్థితిపై ఆయన వివరాలు అడిగి తెలిసుకున్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరినీ వేర్వేరుగా ఈ సంఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది. నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామంలో డ్వాక్రా మహిళలకు నిర్మించిన మహిళ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిల చోటు చేసుకున్న వాగ్వాదం కారణాలను పార్టీకి చెందిన కొందరు సీనియర్లను సీఎం అడిగి తెలుసుకున్నట్లు ప్రచారం. ఈ సంఘటనకు ముందు, తర్వాత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మొదటి నుంచి చివరి వరకు ప్రత్యక్షసాక్షి నిలవగా.. వీజీ గౌడ్ ఇచ్చే వివరాలు కీలకం కానున్నాయి. ఇదిలా వుండగా రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే ఉదంతం, అందుకు దారి తీసిన కారణాలు, వాస్తవఅవాస్తవాలపై లోతుగా పరిశీలన చేసేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ అంతర్గత వ్యవహారంకు సంబంధించిన కాలూరు సంఘటనపై అన్నికోణాల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఇంటెలిజెన్స్ విచారణ మొదలైంది.