మాట్లాడుతున్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి
‘‘బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జెండా గద్దెలు కూల్చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై గుత్పకట్టెలతో దాడి చేసిన వారికి మార్కెట్ కమిటీ పదవిచ్చారు.. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వొద్దని సోనియాకు లేఖ రాసిన రాజేశ్వర్‌కు ఎమ్మెల్సీ పదవి.. టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్, నగర మేయర్ పదవులు..కానీ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ఏఎస్ పోశెట్టి, ఉద్యమంలో జైలు పాలైన చింతా మహేష్ లాంటి ఉద్యమ కారులకు మాత్రం ద్రోహం చేశారు..’’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లపై తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి కళ్యాణమండపంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మంలో 1,200 మంది అమరులైతే ఆ కుటుంబాలను ఆదుకున్న దాఖలాల్లేవన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కనీసం అమరవీరుల స్థూపం నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాజిరెడ్డి ట్రాక్టర్లు అమ్ముకున్నారు..
ప్రతి అభివృద్ధి పనిలోనూ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కమీషన్లు దండుకున్నారని భూపతిరెడ్డి ఆరోపించారు. రైతులకు పంపిణీ చేయాల్సిన ట్రాక్టర్లను అమ్ముకున్నారని, ఇసుక దందాకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను రూరల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు.
కవితపైనా విమర్శలు..
సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్‌లలో అభివృద్ధి పనులకు రూ.వందల కోట్లు వెళుతుంటే.. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కుమార్తె, ఎంపీ కవితతో జిల్లాకు ఒరిగిందేమీలేని భూపతి రెడ్డి విమర్శించారు. కనీసం సీఎం వద్ద ఉండే రూ.ఐదు వేల కోట్లలో రూ.ఐదు వం దల కోట్లు కూడా జిల్లాకు మంజూరు చేయించలేకపోయారన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితులు లేవన్నారు. ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్క డిగ్రీ కాలేజీని స్థాపించలేదన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దక్కకుండా చేశారని విమర్శించారు. మెడికల్ కళాశాల సౌకర్యాలు మెరుగుపడలేదని, ఎన్‌డీఎస్‌ఎల్ పునరుద్ధరణకు నోచుకోలేన్నారు.
అదనంగా ఒక్క గుంటకూ నీళ్లివ్వలేదు..
జిల్లా రైతాంగం హక్కైన సింగూరు జలాలను మెదక్ జిల్లాకు తరలించుకుపోతే జిల్లా నుంచి గెలుపొందిన ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కూడా నోరు మెదపలేదని భూపతి రెడ్డి విమర్శించారు. ఎస్సారెస్పీ లీకేజీ నీటిని అడిగితే గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి రైతులను భయ భ్రాంతులకు గురి చేశారన్నారు. కానీ ఎస్సారెస్పీనుంచి తొమ్మిది టీఎంసీల నీటిని మానేర్ డ్యాంకు తరలించుకు పోయారన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలో అదనంగా ఒక్క గుంటకు కూడా సాగునీరిచ్చిన దాఖలాల్లేవన్నారు.ఏ ముఖం పెట్టుకుని టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
అస్తవ్యస్తంగా టీఆర్‌ఎస్ : విద్యాసాగర్‌రావు
జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ విద్యా సాగర్‌రావు విమర్శించారు. ఎంపీ కవిత, మిషన్‌భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డిలకు అనుభవం లేక పార్టీని నడిపించలేకపోయారన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌కు యం త్రాంగం లేదు.. మంత్రాంగం లేదన్న విద్యాసాగర్.. మంత్రి పోచారం ఓ రబ్బరు స్టాంపుగా మారారన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కోసం పార్టీని తాకట్టుపెట్టారని, బాజిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎలా అవుతుంద ని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, నాయకులు కర్కగంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, షాదుల్లా, కిషన్ నాయక్, కర్స మోహన్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment