ఉండనీయరు.. వెళ్ల గొట్టరు | TRS Party Not Caring Some Party Leaders In Telangana | Sakshi
Sakshi News home page

ఉండనీయరు.. వెళ్ల గొట్టరు

Published Sun, Jun 24 2018 11:41 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

TRS Party Not Caring Some Party Leaders In Telangana - Sakshi

భూపతి రెడ్డి, డీఎస్‌,

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నేతల విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా..? ఇటు సస్పెండ్‌ చేయకుండా.. అలాగని పార్టీలో ఉంచకుండా త్రిశంకు స్వర్గంలో ఉంచుతోందా..? సస్పెన్షన్‌ వేటు వేస్తే కాస్తో కూస్తో ప్రజల నుంచి వచ్చే సానుభూతిని కూడా వారికి రానీయకుండా.. స్వయంగా వారే పార్టీని వీడేలా చేస్తోందా.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి విషయంలో ఇదే జరుగుతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకు ల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ విషయంలోనూ క్రమంగా ఇలాంటి పరిస్థితికి దారితీస్తోందని అంటున్నారు. ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇలాంటి కీలక నేతల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. 

వేచిచూసే ధోరణితో.. 
నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డితో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యల ప్రతిపాదనకు దారితీసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి కుమారుడు జగన్‌ తనను దూషించారంటూ భూపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శాసన మండలిలో ప్రివిలైజ్‌ కమిటీకి కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా స్పందించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని, జగన్‌పై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

అయినప్పటికీ భూపతిరెడ్డి స్పందించలేదు. ఈ క్రమంలో భూపతిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని కోరుతూ 2017 డిసెంబర్‌ 13న జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. ఒక్క రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ మినహా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లో మంత్రి పోచారం నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు తీర్మానించారు. ఈ తీర్మానాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. అప్పటి నుంచి పార్టీ ఏ నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఆరు నెలలుగా భూపతిరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

పార్టీ అధికారిక కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. అయితే నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో అడపాదడపా ఆయన అనుచర వర్గానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తన విషయంలో అధినేత ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఎమ్మెల్సీ కూడా వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే ధోరణితో ఉన్నట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. మరోవైపు భూపతిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.  

డీఎస్‌ పరిస్థితి కూడా పరోక్షంగా ఇలాగే..? 
రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ పరిస్థితి కూడా పరోక్షంగా ఇలాగే ఉందనే అభిప్రా యం రాజకీయ వర్గాల్లో ఉంది. సీనియర్‌ నాయకులైన డీఎస్‌కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన అనుచరవర్గం గుర్రుగా ఉంది. పార్టీ, అధికారిక కార్యక్రమా లకు సంబంధించి డీఎస్‌కు మొక్కుబడిగా ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన అను చరవర్గం అసంతృప్తితో ఉంది. ముఖ్య కార్యక్రమాలు సైతం జరిగినా.. ‘‘నిన్ననే ఖరారైంది.. కార్యక్రమానికి రండీ..’’ అంటూ మొక్కుబడి ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీ బహిరంగసభ వేదికపైన కాకుండా., ప్రజాప్రతినిధుల గ్యాలరీలో డీఎస్‌ కూర్చున్న ఫొటోలు, వీడియోలు అప్ప ట్లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

ఇటు డీఎస్‌ కూడా తన అనుచరవర్గంతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. తన అనుచరవర్గం ఆవేదనను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని డీఎస్‌ ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎంపీ కవిత కూడా స్పందించారు. సీనియర్‌ నాయకులు డీఎస్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉందని, సీఎం కేసీఆర్‌ చాంబర్‌లోకి నేరుగా వెళ్లగలిగే చొరవ డీఎస్‌కు ఉందని స్పష్టత ఇచ్చారు. ఇలా ఈ ముఖ్యనేతలిద్దరి విషయంలో పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, ఈ ఇద్దరు నేతలు సైతం ఆచితూచి అడుగులు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement