రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్
రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌లో కొనసాగాలా.. వద్దా ? అంశంపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తన సన్నిహితులతో జరిపిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో కొనసాగి ప్రయోజనం లేదని ఆయన అనుచవర్గం ఒత్తిడి చేసినట్లు సమాచారం.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ మరోమారు తన అనుచరవర్గంతో సమావేశమవడం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం నిజామాబాద్ లోని ప్రగతినగర్‌లో తన నివాసంలో సుమారు 40 మంది సన్నిహిత అనుచరులతో మంతనాలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో ఇంకా వేచి చూసి ప్రయోజనం లేదని అనుచరులు స్పష్టం చేశారు. త్వరలోనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుచరగణం ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అలాగే ఈనెల 27న డీఎస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు చేయాలని భావిస్తున్నారు.
పుట్టిన రోజు సందర్భంగా డీఎస్ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జోరందుకుంది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలతో పాటు, అర్బన్ నుంచి కూడా అనుచరులు హాజరయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ డీఎస్‌ను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయా లని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవం గా తీర్మానం చేశారు. రెండు నెలల పాటు వేచి చూసిన డీఎస్ ఈనెల 4న విలేకరుల సమావేశం నిర్వహించి తనపై చేసిన తీర్మానంపై లేఖాస్త్రాన్ని సంధించారు.
‘‘నేను టీఆర్‌ఎస్‌ను వీడితే ప్రజల దృష్టిలో మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పు కున్నట్లు అవుతుంది.. అందుకే నా అంతగా నేను పార్టీకి రాజీనామా చేయను.. దయచేసి నన్ను సస్పెండ్ చేయండి.. అది మీకు చేతకాకపోతే తీర్మానం వెనక్కి తీసుకోండి..’’ అంటూ అధినేత కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. ఈ విషయమై అధినేత కేసీఆర్ కూడా స్పందించారు. పార్టీలో ఉంటే ఉంటారు.. పోతే పోతారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ మరోమారు సన్నిహిత అనుచరవర్గంతో సమావేశం కావడం ప్రాధాన్య త సంతరించుకుంది. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఈ విషయమై ‘సాక్షి’ డీఎస్‌ను సంప్రదించగా తాను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని తన అనుచరులు పూర్తి విశ్వాసాన్ని తనపై ఉంచారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment