MLC Paturi Sudhakar Reddy
-
సిద్దిపేటలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల నిర్వహణకుగాను ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(టీటీసీ) త్వరలో అందుబాటులోకి రానుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.2.5 కోట్లతో నిర్మించిన టీటీసీ భవనాన్ని శుక్రవారం నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలను స్కూళ్లలోనో ఇతర ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తుంటారు. దీంతో శిక్షణ తరగతులకు ప్రతిసారీ కొత్త భవనాన్ని వెతకాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో టీటీసీ భవనాన్ని ఏర్పా టు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మొదట్నుంచి కోరుతున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో సీడీపీ నిధుల నుంచి రూ.2.5 కోట్లు కేటాయించి రాష్ట్రంలోనే తొలిసారిగా భవన నిర్మాణానికి కృషి చేశారు. -
‘పనిచేసే మంత్రిపై..పనికిరాని విమర్శలా?’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే కలను సాకారం చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్న మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి .జీవన్‌రెడ్డి సహా కొందరు కాంగ్రెస్ నేతలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే మంత్రిపై కువిమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిడ్ మానేరుకు గండిపడిన ఉదంతాన్ని కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మిడ్‌మానేరు గండిపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రెండేళ్ల కిందటి దాకా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. శంషాబాద్‌కు బదులు సిరిసిల్లను జిల్లాగా చేయాలని టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు. కొత్త జిల్లాలు ప్రజల సౌకర్యం కోసం తప్ప పార్టీలు, నేతల సౌలభ్యం కోసం కాదన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా వివాదాస్పదం చేయడం కాంగ్రెస్, టీడీపీలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. -
మండలి చీఫ్ విప్‌గా పాతూరి
విప్‌లుగా పల్లా, బోడకుంటి సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి నియమితులయ్యారు. విప్‌లుగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లును నియమించారు. ఏడాదిగా వాయిదా పడుతూ వచ్చిన చీఫ్ విప్, విప్ల నియామకాలకు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ అనుమతివ్వడంతో ఈ మేరకు ప్రభుత్వం మూడు జీవోలను జారీ చేసింది. పాతూరి, పల్లా, బోడకుంటి శనివారం క్యాంపు ఆఫీస్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. పాతూరి సుధాకర్‌రెడ్డి: కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి 1968 నుంచి 2005 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్టీయూ) నేత గా, 1975 నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. 2007లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011లో టీఆర్ఎస్లో చేరి 2013లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నుంచి రెండోసారి మండలికి ఎన్నికయ్యారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం షోడశపల్లికి చెందిన పల్లా.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్), పీహెచ్డీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘాల్లో పని చేసి తర్వాత నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలు నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీతో మమేకమై పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి ఎన్నికయ్యారు. బోడకుంటి వెంకటేశ్వర్లు: వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బోడకుంటి.. బచ్చన్నపేట ఎంపీపీగా, వరంగల్ జెడ్పీ చైర్మన్‌గా, వరంగల్ ఎంపీగా పనిచేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై త ర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2015లో జరిగిన ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.