మండలి చీఫ్ విప్‌గా పాతూరి
విప్‌లుగా పల్లా, బోడకుంటి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి నియమితులయ్యారు. విప్‌లుగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లును నియమించారు. ఏడాదిగా వాయిదా పడుతూ వచ్చిన చీఫ్ విప్, విప్‌ల నియామకాలకు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ అనుమతివ్వడంతో ఈ మేరకు ప్రభుత్వం మూడు జీవోలను జారీ చేసింది. పాతూరి, పల్లా, బోడకుంటి శనివారం క్యాంపు ఆఫీస్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
పాతూరి సుధాకర్‌రెడ్డి: కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి 1968 నుంచి 2005 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్‌టీయూ) నేత గా, 1975 నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. 2007లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011లో టీఆర్‌ఎస్‌లో చేరి 2013లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నుంచి రెండోసారి మండలికి ఎన్నికయ్యారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం షోడశపల్లికి చెందిన పల్లా.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్), పీహెచ్‌డీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘాల్లో పని చేసి తర్వాత నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలు నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీతో మమేకమై పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి ఎన్నికయ్యారు.
బోడకుంటి వెంకటేశ్వర్లు: వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బోడకుంటి.. బచ్చన్నపేట ఎంపీపీగా, వరంగల్ జెడ్పీ చైర్మన్‌గా, వరంగల్ ఎంపీగా పనిచేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై త ర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2015లో జరిగిన ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.