modal school
-
మోడల్ స్కూళ్లకు మంచి రోజులు
శ్రీకాకుళం న్యూకాలనీ: మోడల్ స్కూళ్లకు (ఆదర్శ పాఠశాలలు) మంచి రోజులు రానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆదరణకు నోచుకోని మోడల్ స్కూళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. సర్కారులో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పూర్తిస్తాయితో ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని మోడల్ స్కూళ్ల సొసైటీకి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2012లో మోడల్ స్కూల్ విధానం.. 2012లో మోడల్ స్కూల్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెరపైకి తీసుకొచ్చాయి. ఇదే సమయంలో జిల్లాకు 14 మోడల్ స్కూళ్లను కేటాయించారు. తొలినాళ్లలో నిర్దేషిత నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతుండేవి. 2014 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మోడల్ స్కూళ్లు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. కనీస నిధులకు నోచుకోకుండా పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. 2012 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ప్రయోజనాలకు నోచుకోని ఉపాధ్యాయులు.. 2012 డీఎస్సీ విధానం ద్వారా నియామకమై 2013 మే నుంచి జిల్లాలో 160 మంది ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. ఇందులో పీజీటీ, టీజీటీలున్నారు. నియామకమై వారంతా ప్రభుత్వ రెగ్యులర్ ఉపాధ్యాయులైనప్పటికీ వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలకు, రాయితీలకు నోచుకోలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా మోసపోయారు. గత ఐదేళ్లు జీతాలు కూడా సరిగ్గా అందలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు లభిస్తున్న పెన్షన్ విధానం, హెల్త్‌కార్డులు, కారుణ్య నియామకాలు, ఏపీజీఎల్‌ఐసీ, పీఎఫ్ వంటివి లేకపోవడం శోచనీయం. మోడల్ స్కూళ్లలో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఎటువంటి ఆదరణ, ప్రయోజనాలు లేకపోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డునపడిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన ప్రయోజనం లేకపోయింది. పాదయాత్రలో సీఎం జగన్ హామీ మేరకు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర సమయంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కలిశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతి నెలా జీతాలను మంజూరు చేస్తూ వస్తోంది. అదే విధంగా పాఠశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వ టీచర్ల మాదరిగా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, మోడల్ స్కూల్స్ సొసైటీ ఈసీ (కార్యనిర్వహణ కమిటీ) సిఫార్సులను పంపాలని ప్రభుత్వం సోమవారం మెమో విడుదల చేసింది. మోడల్ స్కూళ్లపై విధానపరమైన నిర్ణయం ప్రకటించడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎంఎస్ ఉపాధ్యాయుల హర్షం.. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుంట లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షడు పి.వాసుదేవరావు, కార్యదర్శి బి.సురేష్, గౌరవాధ్యక్షుడు సీహెచ్ కృష్ణారావు, కోశాధికారి పి.రాము, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు లభిస్తున్న అన్ని ప్రయోజనాలు, రాయితీలు కల్పించి తమ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
మోడల్
నత్తనడకన మోడల్ స్కూల్ భవన నిర్మాణాలు భర్తీకాని బోధన సిబ్బంది పోస్టులు జిల్లాలో వివిధ తరగతుల్లో 3,532 సీట్లు ఖాళీ నేడు అనంత, చిత్తూరు జిల్లాల ప్రిన్సిపాళ్లతో విద్యాశాఖ కమిషనర్ సమీక్ష ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లలందరూ అమరాపురం మోడల్ స్కూల్ విద్యార్థులు. హల్కూరు సమీపంలోని ఈ పాఠశాలకు వెళ్లాలంటే కనీసం రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. కే శివరం, కే గొల్లహట్టి, గుణేహళ్లి, హేమావతి, నిద్రగట్ట, వీ అగ్రహారం, నాగోనపల్లి, దేవగానపల్లి, గౌడనకుంట, వలస తదితర ప్రాంతాల నుంచి ఆటోలు ఇతర వాహనాల్లో అమరాపురానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నడచి వెళ్లాలి. తిరుగుప్రయాణంలో వారివారి గ్రామాలకు వెళ్లాలంటే చీకటవుతోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు రోజూ ఆందోళనకు చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2012–13లో ప్రతిష్టాత్మకంగా 'మోడల్' స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. తొలివిడతగా జిల్లాలో 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ఇప్పటికి ఐదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్క స్కూల్ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించలేదు. ప్రకటించిన మేరకు ఇంకా 38 మండలాల్లో భవనాలు ఎప్పుడు నిర్మిస్తారో? పాలకులే తెలపాలి. 'వసతి' లేక తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తులు చేసుకున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి అధికారులు చేతులెత్తేశారు. తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. అదికూడా అమలు కాలేదు. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పిన అధికారులు చివరకు మొండి చేయి చూపారు. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత కారణంగా తమ పిల్లలను ఈ స్కూల్లలో చేర్చడానికి తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. బోధన సిబ్బంది కరువు.. 25æ స్కూళ్లకు 19 ప్రిన్సిపాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీటీ 96, టీజీటీ పోస్టులు 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించి ఒక్కో పాఠశాలలో 6 నుంచి ఇంటర్ దాకా 560 మంది చొప్పున 25 స్కూళ్లలో 14 వేల మంది ఉండాల్సి ఉంది. కేవలం 10,468 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 3,532 సీట్లు ఖాళీలున్నాయి. నేడు విద్యాశాఖ కమిషనర్ సమీక్ష... విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి శుక్రవారం జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో అనంతపురం, చిత్తూరు జిల్లాల మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో సమీక్షించున్నారు. వసతి, బోధన సిబ్బంది తదితర సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుందని ఉపాధ్యాయ వర్గాలతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రులూ ఆశిస్తున్నారు.