మోడల్
- నత్తనడకన మోడల్ స్కూల్ భవన నిర్మాణాలు
- భర్తీకాని బోధన సిబ్బంది పోస్టులు
- జిల్లాలో వివిధ తరగతుల్లో 3,532 సీట్లు ఖాళీ
- నేడు అనంత, చిత్తూరు జిల్లాల ప్రిన్సిపాళ్లతో విద్యాశాఖ కమిషనర్ సమీక్ష
ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లలందరూ అమరాపురం మోడల్ స్కూల్ విద్యార్థులు. హల్కూరు సమీపంలోని ఈ పాఠశాలకు వెళ్లాలంటే కనీసం రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. కే శివరం, కే గొల్లహట్టి, గుణేహళ్లి, హేమావతి, నిద్రగట్ట, వీ అగ్రహారం, నాగోనపల్లి, దేవగానపల్లి, గౌడనకుంట, వలస తదితర ప్రాంతాల నుంచి ఆటోలు ఇతర వాహనాల్లో అమరాపురానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నడచి వెళ్లాలి. తిరుగుప్రయాణంలో వారివారి గ్రామాలకు వెళ్లాలంటే చీకటవుతోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు రోజూ ఆందోళనకు చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2012–13లో ప్రతిష్టాత్మకంగా 'మోడల్' స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. తొలివిడతగా జిల్లాలో 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ఇప్పటికి ఐదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్క స్కూల్ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించలేదు. ప్రకటించిన మేరకు ఇంకా 38 మండలాల్లో భవనాలు ఎప్పుడు నిర్మిస్తారో? పాలకులే తెలపాలి.
'వసతి' లేక తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తులు చేసుకున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి అధికారులు చేతులెత్తేశారు. తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. అదికూడా అమలు కాలేదు. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పిన అధికారులు చివరకు మొండి చేయి చూపారు. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత కారణంగా తమ పిల్లలను ఈ స్కూల్లలో చేర్చడానికి తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు.
బోధన సిబ్బంది కరువు..
25æ స్కూళ్లకు 19 ప్రిన్సిపాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీటీ 96, టీజీటీ పోస్టులు 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించి ఒక్కో పాఠశాలలో 6 నుంచి ఇంటర్ దాకా 560 మంది చొప్పున 25 స్కూళ్లలో 14 వేల మంది ఉండాల్సి ఉంది. కేవలం 10,468 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 3,532 సీట్లు ఖాళీలున్నాయి.
నేడు విద్యాశాఖ కమిషనర్ సమీక్ష...
విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి శుక్రవారం జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్‌లో అనంతపురం, చిత్తూరు జిల్లాల మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో సమీక్షించున్నారు. వసతి, బోధన సిబ్బంది తదితర సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుందని ఉపాధ్యాయ వర్గాలతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రులూ ఆశిస్తున్నారు.