వారంలో అన్ని రోజులూ షాపులను అనుమతించాలి
⇒ మోడల్ బిల్లుపై రాష్ట్రాలకు కేంద్రం
⇒ నచ్చజెప్పాలి: అసోచామ్
న్యూఢిల్లీ: చిన్న, మధ్య స్థాయి షాపులు వారంలో అన్ని రోజులూ తెరిచి ఉంచేందుకు వీలుగా మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లును అన్ని రాష్ట్రాలూ తప్పకుండా ఆమోదించాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలకు నచ్చజెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం గతేడాదే మోడల్ బిల్లును ఆమోదించగా రాష్ట్రాల నుంచి స్పందన తక్కువగా ఉండడంపై అసోచామ్ అందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాష్ట్రం మాత్రమే ఈ బిల్లుకు అనుగుణంగా రాజస్థాన్ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1958కి సవరణలు తీసుకువచ్చే చర్యలు ప్రారంభించినట్టు అసోచామ్ వివరించింది.
కాగా, షాపుల్లో పనిచేసే కార్మికుల హక్కులను సైతం పరిరక్షించాలని కోరింది. ఎటువంటి అదనపు ప్రయోజనాలు ఇవ్వకుండా రెండు షిప్టులు వారితో పనిచేయించుకోకుండా చూడాలని, రాత్రి వేళల్లో పనిచేసే వారు ముఖ్యంగా మహిళా కార్మికుల భద్రత చూడాలని సూచించింది. వారంలో అన్ని రోజులూ షాపులను తెరిచి ఉంచడం వల్ల అధిక జనాభా కలిగిన నగరాలు స్థానిక, విదేశీ పర్యాటకులను ఆకర్షించగలవని, దీనివల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంది.