ఆమెను చంపు.. లేదంటే నిన్ను చంపుతా..
అలా ఓ వ్యక్తి తనను బెదిరిస్తున్నాడన్న గుంటూరు వాసి
హత్య చేయాలంటూ రివాల్వర్, స్కూటీ ఇచ్చాడని వెల్లడి
ప్రాణహాని ఉందని వివరిస్తూ ఏపీ డీజీపీ, ఎస్పీకి లేఖ
పట్నంబజారు(గుంటూరు): ఓ మహిళను చంపాలని ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నా డని, ఇందుకోసం తనకు రివాల్వర్ కూడా ఇచ్చాడని ఏపీలోని గుంటూరు బ్రాడీపేటకు చెందిన మోదుగుల విజయభాస్కరరెడ్డి శుక్రవారం సాయంత్రం జిల్లా కోర్టులోని లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎదుట లొంగిపోవడం కలకలం రేపింది. కొంత మంది న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయన రివాల్వర్ అప్పగిస్తూ తను ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ ఓ లేఖ అందజేశాడు. అనంతరం లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు నగరంపాలెం పోలీసులకు అతన్ని అప్పగించి, ఈ వ్యవహారంపై విచారించాలని ఆదేశించారు.
మోదుగుల వెంట వచ్చిన న్యాయవాదులు ఆ లేఖలోని అంశాలను మీడియాకు వివరించారు. వారు వెల్లడించిన మేరకు మోదుగుల మాటల్లో వివరాలు.. ‘‘నేను (మోదుగుల విజయభాస్కరరెడ్డి) స్తంభాలగరువుకు చెందిన శనగా సోమశంకర్‌రెడ్డి గతంలో వ్యాపార భాగస్వాములం. కొద్ది కాలంగా చక్కెర వ్యాధి (డయాబెటిస్)తో బాధ పడుతున్న నేను స్తంభాలగరువులో సోమశంకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన శంకర్ హోలిస్టిక్ యోగా కేంద్రంలో చేరాను.
అయితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం జరుగుతోంది. శంకర్‌రెడ్డి నివాసంలోని ఐదో ఫ్లోర్లో అతని రెండో భార్య పోలీసు కానిస్టేబుల్ రమాదేవి ద్వారా నిత్యం మద్యం పార్టీ నిర్వహిస్తుంటాడు. మహిళల ద్వారా మగవారికి మసాజ్‌లు చేయించటంతో పాటు, వ్యభిచారం చేయించి వాటిని చిత్రీకరించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. 2004లో శంకర్‌రెడ్డి బెదిరించి పట్టాభిపురంలోని ఒక బ్రాహ్మ ణుల స్థలాన్ని కబ్జా చేశాడు. ఇందులో 2016లో బిల్డర్ అంకారావుతో కలిసి నిర్మా ణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే అంకారావు రూ.20 లక్షల వరకు నష్టం చేశాడని, అతని నుంచి డబ్బు వసూలుకు సహకరించాలని నన్ను కోరాడు.
అందుకే యోగాకు వెళ్లడం మానేశా..
అదే సమయంలో నాకు ఆరోగ్యం సరిగా లేకపోవటం, శంకర్‌రెడ్డి నేరపూరిత చరిత్ర తెలియడంతో నేను యోగాకు వెళ్లటం మానేశాను. శంకర్‌రెడ్డితో చనువుగా ఉండొద్దని మా పక్క పోర్షన్లో ఉండే ఒక మహిళకు చెప్పాను. ఈ విషయం తెలిసి అతను నన్ను తుపాకీతో బెదిరించాడు. గతంలో చలసాని ఝాన్సీ అనే మహిళ విషయంలో కూడా ఇలానే చేశావంటూ నన్ను చంపుతానన్నాడు. 2004లో ఫైనాన్స్ ఇచ్చి ఝాన్సీని మోసం చేసి ఇంటిని అక్రమంగా కాజేశాడు. దీంతో ఝాన్సీ.. కాల్‌మనీ, రేప్ కేసులు పెట్టబోతోందని, ఆమెను చంపాలని జూన్ 15న నాకు రివాల్వర్, ఓ స్కూటీ ఇచ్చాడు.
ఆమెను చంపకపోతే నన్ను చంపుతానని బెదిరించాడు. దీంతో తప్పులు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవాలని నేను జూన్ 17న శంకర్‌రెడ్డి, ఆయన కుమార్తె మృదుల, ఆయన అనుచరులు వణుకూరి సుబ్బారెడ్డి, సీహెచ్ అనంతబాబులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపాను. దీంతో నాకు శంకర్‌రెడ్డి నుంచి ప్రాణ హాని ఉంది’’ అని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు డీజీపీ, ఎస్పీలకు కూడా లేఖ ద్వారా వివరించినట్లు మోదుగుల న్యాయవాదులు తెలిపారు. మోదుగులను విచారిస్తున్నామని, ప్రాథమిక సమాచారం మేరకు భూ వివాదం కారణమని అర్బన్‌ఎస్పీ విజయరావు తెలిపారు.